బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా తన సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించారు. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఆమె సమర్థించారు. అక్కడితో ఆపలేదు. బీఆర్ఎస్ పార్టీ దీనిని వ్యతిరేకించడం తప్పు అని అన్నారు. ఈ డైలాగ్.. ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఈ ఆర్డినెన్స్ సరైనదే అన్న కవిత.. 2018లో చట్ట సవరణ ద్వారా దీనిని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తాను ఈ నిర్ణయానికి వచ్చానని కవిత స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేలా కవిత మరో డైలాగ్ పేల్చారు. బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకుని తన దారికి రావాలి అన్నారు. దీనికి వారు నాలుగు రోజుల సమయం తీసుకోవచ్చని ఆమె సెటైర్ కూడా వేశారు. బీఆర్ఎస్ లోనే ఉంటూ.. తాను అదే పార్టీలో ఉన్నాను అని చెబుతూ.. కూడా.. అదే పార్టీకి వ్యతిరేకంగా ఇలా బహిరంగంగా మాట్లాడటం ద్వారా ఆమె పార్టీకి మేలు చేస్తున్నారా? కీడు చేస్తున్నారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇంటర్నల్‌గా మాట్లాడుకోవాల్సిన అంశాలపై బహిరంగ ప్రకటనలు చెయ్యడం ద్వారా.. ఆమె కేసీఆర్‌కి ఆనందం కలిగిస్తున్నారా? ఇబ్బంది కలిగిస్తున్నారా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండటంపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నాననీ, హైదరాబాద్‌లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మల్లన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఐతే.. పార్టీ మౌనంగా ఉండటాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా తప్పు పడుతున్నారు. కవిత ఇంకా పార్టీని వీడలేదు. అలా వీడనంత వరకూ ఆమె బీఆర్ఎస్ నేతే అవుతారు. అలాంటప్పుడు.. ఆమెపై ఈగ వాలినా.. కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎదురించాల్సి ఉంటుంది. అలా చెయ్యకపోతే, అది ఆ పార్టీలో అంతర్గత విబేధాల్నిబయటపెడుతున్నట్లే.
కవిత ఇలా ఫైర్ అవ్వడం వెనక కేటీఆర్ తాజా నిర్ణయం కూడా కారణం అని తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆ… తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (TBGKS) ఇంఛార్జ్‌గా ఉన్న కవిత స్థానంలో.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. ఈ నిర్ణయం కవిత సమక్షంలో కాకుండా, ఆమె అనుమతి లేకుండా జరిగినట్లు తెలుస్తోంది. మరి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే, ఆమెకు కోపం రాకుండా, ఆనందం వస్తుందా? అందుకే ఆమె సడెన్‌గా సొంత పార్టీపైనే భగ్గుమంటున్నారు. ఆమె పోరాటం ప్రధానంగా కేటీఆర్‌ని టార్గెట్ చేస్తూ సాగుతోందనే వాదన వినిపిస్తోంది. ఐతే.. కేటీఆర్ ఈ నిర్ణయం తనకు తానుగా తీసుకుంటారని అనుకోలేం. కచ్చితంగా కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాతే తీసుకొని ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే నిజమైతే.. కవితను పార్టీకి మరింత దూరం పెట్టేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయని అనుకోవచ్చు.
కేటీఆర్ ఇంతలా కవిత పట్ల కఠినంగా ఉండటానికి ఆమె వ్యవహార శైలే కారణం అని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చురుగ్గా ఉన్న కవిత.. ఆ క్రెడిట్ మొత్తం జాగృతిదే అన్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీది అనలేదు. ఇలా ఆమె తన సొంత కుంపటిని డెవలప్ చేసుకుంటూ.. బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడుతుండటం.. కేటీఆర్‌కి ఇబ్బంది కలిగిస్తోందని తెలుస్తోంది. ఇలా సొంత పార్టీలో రగులుతున్న ఈ రచ్చ.. అటు పాలకపక్షం, ఇటు బీజేపీకి సానుకూలంగా మారుతోంది. ఈ పార్టీలు పచ్చగడ్డి వెయ్యకుండానే.. బీఆర్ఎస్‌లో మంట రగులుతోంది.