కదిరి టీడీపీ కోటపై వైసీపీ జెండా!
జడ్పీటీసీల్లో వైసీపీ ఆధిక్యం.. ఎంపీటీసీల్లో టీడీపీ హవా
కూటమి నేతలకు ఆత్మపరిశీలన అవసరం.. ప్రతిపక్షానికి బాధ్యతాయుత పాత్ర నిర్వహించే అవకాశం
Kadiri ZPTC Election Results : కదిరి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం! జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ 7 స్థానాలు సాధించగా, టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. మరోవైపు ఎంపీటీసీల్లో టీడీపీ 76 స్థానాలతో ఆధిక్యం సాధించింది. కదిరి ఫలితాలు కూటమి నేతలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందా?
ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ కొన్ని ఫలితాలు రాజకీయ పార్టీలకు హెచ్చరికలుగా నిలుస్తాయి. మరికొన్ని భవిష్యత్తు రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తాయి. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల పరిధిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఇదే సంకేతాన్ని ఇస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా కనిపించిన రాజకీయ సమీకరణాలు స్థానిక ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలను ఇచ్చాయి. జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ ఆధిక్యం సాధించగా, ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ తన పట్టును నిరూపించుకుంది. ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో వైసీపీ సాధించిన నాలుగు జడ్పీటీసీ విజయాలు టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారితీశాయి. ఇది కేవలం ఎన్నికల ఫలితం మాత్రమే కాదు.. కూటమి నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన రాజకీయ సందేశం కూడా!
ప్రశాంతంగా సాగిన ప్రజాస్వామ్య పండుగ
కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల పరిధిలోని 12 మండలాల్లో నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. పోలీసు వ్యవస్థ, ఎన్నికల సిబ్బంది, అధికార కూటమి నాయకులు, ప్రతిపక్ష పార్టీలు సంయమనం పాటించడం అభినందనీయం. బెదిరింపులు, అదిరింపులకు తావులేకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకోవాలి.
రెండు నియోజకవర్గాల పరిధిలోని 12 జడ్పీటీసీ స్థానాలకు గాను వైసీపీ 7, టీడీపీ 5 స్థానాలు గెలుచుకున్నాయి. మొత్తం 125 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 76, వైసీపీ 49 స్థానాలు సాధించాయి. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని 32 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ 23, వైసీపీ 9 స్థానాలు దక్కించుకున్నాయి. జిల్లా స్థాయిలో టీడీపీ ఆధిక్యం ఉన్నప్పటికీ, కదిరి నియోజకవర్గంలో వైసీపీ సాధించిన విజయాలు ప్రత్యేకంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ముఖ్యమైన ఎన్నికల గణాంకాలు
| ఎన్నికల వివరాలు | వైసీపీ | టీడీపీ |
|---|---|---|
| జడ్పీటీసీలు (12) | 7 | 5 |
| ఎంపీటీసీలు (125) | 49 | 76 |
| జిల్లా జడ్పీటీసీలు (32) | 9 | 23 |
కదిరి ఆరు మండలాలు.. భిన్నమైన ప్రజాతీర్పు
కదిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నాలుగు జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ప్రత్యక్ష పోటీ జరగగా, నంబులపూలకుంటలో బీజేపీ, తలుపులలో జనసేన పోటీపడ్డాయి. ఈ రెండు స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. మొత్తంగా నాలుగు స్థానాలు వైసీపీకి, రెండు టీడీపీకి దక్కాయి.
కదిరి రూరల్: జనరల్ కేటగిరీ జడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి వజ్రా భాస్కర్ రెడ్డి తన సమీప టీడీపీ ప్రత్యర్థి వినీత్ కుమార్ రెడ్డిపై 900కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పది ఎంపీటీసీ స్థానాల్లో రెండు పార్టీలకు చెరో ఐదు వచ్చాయి. కుమ్మరవాండ్లపల్లి, ఎర్రదొడ్డి, ముత్యాలచెరువు పంచాయతీల్లో వైసీపీకి లభించిన మెజారిటీ, అభ్యర్థి నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాలు, ఆపరేషన్లు కలిసివచ్చిన అంశాలుగా విశ్లేషిస్తున్నారు. మరోవైపు టీడీపీలో సమన్వయ లోపం, కార్యకర్తల నిస్తేజం, అభ్యర్థికంటే అభ్యర్థి కుటుంబ నేపథ్యంపై అసంతృప్తి ప్రతికూలంగా మారినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
తలుపుల: బీసీ మహిళకు రిజర్వు చేసిన జడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి షర్మిల జనసేన అభ్యర్థి రమణమ్మపై 6,300కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 12 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, వైసీపీ చెరో ఆరు గెలుచుకున్నాయి. డీకే బాబు అలియాస్ కృష్ణారెడ్డి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారీగా ఆర్థిక సహకారం అందించినట్లు ప్రచారం జరుగుతోంది. తలుపుల వేపమానిపేట, ఈదులకుంట్లపల్లి ఎంపీటీసీ పరిధుల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ జడ్పీటీసీ విజయానికి అదనంగా దోహదపడింది.
నంబులపూలకుంట: టీడీపీకి సంప్రదాయంగా బలమున్న ఈ మండలంలో బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించడం కూటమికి ప్రతికూలంగా మారిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనరల్ మహిళ జడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి అనురాధ 2,300కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బిజెపి అభ్యర్థి కుటుంబ సభ్యుల లో ఒకరు మైనారిటీ కి చెందిన ఓ వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉండటం కూడా ఓ కారణం. అయితే తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ఆరు, వైసీపీ మూడు గెలుచుకుంది. ఎంపీటీసీల్లో టీడీపీ ఆధిక్యం ఉన్నా జడ్పీటీసీ స్థానం కోల్పోవడం క్రాస్ ఓటింగ్, అభ్యర్థుల ఎంపికపై చర్చకు దారితీసింది.
గాండ్లపెంట: ఇక్కడ వైసీపీ అభ్యర్థి రోహిణి టీడీపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిపై 1,300కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీలో అంతర్గత అసమ్మతి, అభ్యర్థిపై కొందరు నాయకుల అసంతృప్తి , తెలుగు దేశం పార్టీ కి ఆదినుండి మంచి పట్టున్న గ్రామాల్లో వైసీపీ కి మెజారిటీ దక్కడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తొంది. టిడిపి కార్యకర్తల నిర్లిప్తత వైసీపీకి అనుకూలంగా మారినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏడు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ నాలుగు, వైసీపీ మూడు గెలుచుకున్నాయి. పార్టీకి పట్టున్న ప్రాంతంలోనూ నాయకుల మధ్య సమన్వయం లేకపోతే విజయావకాశాలు దెబ్బతింటాయనే విషయాన్ని ఈ ఫలితం గుర్తుచేస్తోంది.
నల్లచెరువు: టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ తన ప్రత్యర్థి వైసీపీకి చెందిన రవికుమార్ రెడ్డిపై 4,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆహ్వానం మేరకు బరిలోకి దిగిన శ్రీరామ్‌కు పరిటాల కుటుంబ రాజకీయ నేపథ్యం, జిల్లా స్థాయి గుర్తింపు కలిసివచ్చాయి. వైసీపీకి చెందిన పలువురు స్థానిక నాయకులు ముందుగానే టీడీపీలో చేరడం కూడా పార్టీకి బలమైంది. తొమ్మిది ఎంపీటీసీ స్థానాలనూ టీడీపీ కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్‌ను ప్రకటించడం ఈ విజయానికి మరింత రాజకీయ ప్రాధాన్యత తెచ్చింది.
తనకల్లు: ఎస్టీ రిజర్వు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి హరినాయక్ సుమారు 1,300 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి వైసీపీ కి చెందిన రమేష్ నాయక్ పై విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోటీలో 14 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 11, వైసీపీ మూడు స్థానాలు గెలుచుకున్నాయి. అభ్యర్థి కుటుంబానికి గతంలో మండలాధ్యక్ష పదవిలో పనిచేసిన అనుభవం, స్థానిక పరిచయాలు అనుకూలంగా మారినట్లు భావిస్తున్నారు.
కూటమికి హెచ్చరిక.. వైసీపీకి కొత్త ఉత్సాహం
కదిరి నియోజకవర్గంలో జడ్పీటీసీలుగా వైసీపీ నాలుగు స్థానాలు గెలవడం, మరోవైపు ఎంపీటీసీల్లో టీడీపీ ఆధిక్యం సాధించడం రాజకీయంగా భిన్నమైన సందేశాన్ని ఇస్తోంది. గ్రామస్థాయి ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక, కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్థానిక నాయకుల అసమ్మతి వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేశాయి.
ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఈ ఫలితాలను సీరియస్‌గా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మండలంలో, ప్రతి ఎంపీటీసీ పరిధిలో, ప్రతి పోలింగ్ బూత్‌లో వచ్చిన ఓట్లను విశ్లేషించాలి. ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది? ఎక్కడ కూటమి ఓట్లు బదిలీ కాలేదు? అభ్యర్థుల ఎంపికలో ఎక్కడ పొరపాట్లు జరిగాయి? నాయకుల మధ్య విభేదాలు ఎంతవరకు ప్రభావం చూపాయి? అన్న అంశాలపై స్పష్టమైన నివేదిక రూపొందించుకోవాలి.
కార్యకర్తల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వడం, నాయకుల మధ్య సమన్వయం పెంచడం, గ్రామీణ సమస్యల పరిష్కారానికి నిరంతర కార్యాచరణ చేపట్టడం అవసరం.
వైసీపీకి ఈ ఫలితాలు కొంత ఊరటనిచ్చాయి. అయితే జడ్పీటీసీ విజయాలను చూసి రాజకీయ ప్రభంజనం మొదలైందని విర్రవీగడం సరికాదు. ప్రతిపక్షంగా ప్రజల సమస్యలను బాధ్యతాయుతంగా ప్రస్తావిస్తూ, ప్రభుత్వాన్ని ఆధారాలతో ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకగా నిలవాలి.
ప్రజల తీర్పే అంతిమం!
స్థానిక ఎన్నికల్లో గెలిచినవారు బాధ్యతను గుర్తించాలి. ఓడినవారు తప్పులను సరిదిద్దుకోవాలి. అధికారంలో ఉన్నవారు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలి. ప్రతిపక్షంలో ఉన్నవారు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.
కదిరి టీడీపీ కోటపై వైసీపీ జెండా ఎగిరిందని టీడీపీ కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎంపీటీసీల్లో ఆధిక్యం వచ్చిందని టీడీపీ విర్రవీగకూడదు. జడ్పీటీసీల్లో గెలిచామని వైసీపీ అతిగా సంబరపడకూడదు. ఎందుకంటే ఎన్నికల్లో విజయం తాత్కాలికం.. ప్రజల విశ్వాసమే శాశ్వతం.
ప్రజలు ఓటు వేసింది కేవలం నాయకులను గెలిపించడానికి మాత్రమే కాదు.. తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో. ఆ ఆశను నిలబెట్టుకున్నప్పుడే రాజకీయ పార్టీలకు నిజమైన విజయం లభిస్తుంది.
నరసింహారెడ్డి చందమూరి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు. కదిరి.
శ్రీ సత్యసాయి జిల్లా.


















