శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ!
జనసేన నుంచి చిలకం మధుసూదన్ రెడ్డి.. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్
పరిటాల రవి పాత అనుచరుడొకరు.. రాజకీయ వారసుడొకరు! కూటమి అధిష్ఠానం నిర్ణయంపైనే అందరి చూపు
శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత తొలి జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు కాబోతున్నారన్న అంశం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కేంద్రబిందువైంది. జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో ఇద్దరు కీలక నేతల పేర్లు చైర్మన్ పదవికి సంబంధించి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి చిలకం మధుసూదన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి పరిటాల శ్రీరామ్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకరు జనసేన రాష్ట్రస్థాయి నాయకుడు కాగా, మరొకరు పరిటాల కుటుంబ రాజకీయ వారసుడు. ఇద్దరికీ పరిటాల రవితో ఉన్న రాజకీయ అనుబంధం ఈ పోటీకి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
పరిటాల రవి అనుచరుడిగా మొదలై.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి!
చిలకం మధుసూదన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం పరిటాల రవితో ఉన్న అనుబంధంతో ముడిపడి ఉంది. ధర్మవరం రూరల్ మండలం రేగాటిపల్లి ఆయన స్వగ్రామం. పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో ఆయన వివాం చేసుకొన్నారు. రేగాటిపల్లి ప్రాంతంలో అప్పట్లో కొనసాగిన ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో పరిటాల రవి ఆయనకు అండగా నిలిచారని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. పరిటాల రవి అనుచర వర్గంలో కీలకంగా ఉంటూ రాజకీయ గుర్తింపు పొందిన ఆయన, ఆ తర్వాత జనసేనలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు.
గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2021లోనే ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం పుట్టపర్తి జడ్పీటీసీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 2500 పైచిలుకు మెజారిటీతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రయాణంలో మరో కీలక పరిణామం. రాష్ట్రస్థాయి పార్టీ పదవిలో కొనసాగుతున్న నాయకుడికి జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం కల్పిస్తారా అన్నది జనసేనలో ఆసక్తికర చర్చగా మారింది.
పరిటాల రవి రాజకీయ వారసుడిగా పరిటాల శ్రీరామ్
మరోవైపు పరిటాల శ్రీరామ్ పేరు టీడీపీ తరఫున ప్రధానంగా వినిపిస్తోంది. రామగిరి మండలం వెంకటాపురం ఆయన స్వగ్రామం. తండ్రి పరిటాల రవీంద్ర రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లోకి వచ్చిన శ్రీరామ్, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
పరిటాల రవి పెనుకొండ నియోజకవర్గం నుంచి 1994, 1999, 2004 సాధారణ ఎన్నికల్లో, 1996 ఉపఎన్నికలో విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2005 జనవరి 24న హత్యకు గురయ్యారు. అనంతరం జరిగిన ఉపఎన్నికలో ఆయన భార్య పరిటాల సునీత విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల సునీత తన కుమారుడు శ్రీరామ్ రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈసారి కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పరిటాలశ్రీరామ్ 4000 పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు.
రాజకీయ సమీకరణాలే కీలకం!
శ్రీ సత్యసాయి జిల్లా జడ్పీ చైర్మన్ పదవి అన్‌రిజర్వుడ్‌గా కేటాయించబడింది. అంటే రిజర్వేషన్ పరిమితి కారణంగా ఈ ఇద్దరిలో ఎవరికీ అడ్డంకి లేదు. అయితే చైర్మన్‌ను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులే ప్రత్యేక సమావేశంలో ఓటు వేసి చైర్మన్‌ను ఎన్నుకుంటారు.
ఇక్కడే అసలు రాజకీయ పరీక్ష మొదలవుతుంది. జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య జడ్పీటీసీ స్థానాల సంఖ్య, పార్టీల పరస్పర అవగాహన, పదవుల పంపకం కీలకమవుతాయి. జనసేనకు రాష్ట్రస్థాయి పదవిలో ఉన్న నాయకుడికి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంటుందా? లేక జిల్లాలో టీడీపీ రాజకీయ బలాన్ని పరిగణనలోకి తీసుకొని పరిటాల శ్రీరామ్‌కు అవకాశం కల్పిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
పరిటాల రవి అనుబంధం.. వారసత్వం.. కూటమి ధర్మం!
ఈ ఇద్దరి పేర్ల మధ్య ఆసక్తికరమైన పోలిక ఉంది. చిలకం మధుసూదన్ రెడ్డి పరిటాల రవితో కలిసి పనిచేసిన పాత అనుచరుడిగా గుర్తింపు పొందితే, పరిటాల శ్రీరామ్ ఆయన రాజకీయ వారసుడిగా కొనసాగుతున్నారు. ఒకరికి జనసేనలో రాష్ట్రస్థాయి బాధ్యతలు, మరొకరికి టీడీపీలో కుటుంబ రాజకీయ నేపథ్యం, నియోజకవర్గ స్థాయి బాధ్యతలు ఉన్నాయి.
అయితే వ్యక్తిగత రాజకీయ నేపథ్యాలకంటే కూటమి పార్టీల మధ్య సమన్వయమే ఈ ఎంపికలో నిర్ణయాత్మకంగా మారనుంది. ఒక పార్టీకి చైర్మన్ పదవి, మరో పార్టీకి ఇతర కీలక స్థానాలు కేటాయించేలా రాజీ సూత్రం అమలవుతుందా అన్నది కూడా పరిశీలించాల్సిన అంశం.
శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టినా, జిల్లా గ్రామీణాభివృద్ధికి సంబంధించి వారికి పెద్ద బాధ్యతే ఎదురుకానుంది. తాగునీరు, గ్రామీణ రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, సాగునీటి సమస్యల పరిష్కారంలో జిల్లా పరిషత్ పాత్ర కీలకం.
ZPChairman చివరకు చిలకంకు అవకాశం దక్కుతుందా? పరిటాల శ్రీరామ్‌కు పట్టం కడతారా? లేక కూటమి మరో సమీకరణాన్ని తెరపైకి తెస్తుందా? తొలి జడ్పీ చైర్మన్ ఎంపికతో శ్రీ సత్యసాయి జిల్లా రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. తుది నిర్ణయం కూటమి అధిష్ఠానం చేతుల్లోనే ఉంది.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.కదిరి.
శ్రీ సత్యసాయి జిల్లా


















