హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలను మూసీ ముంచెత్తింది. మూసీ నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. హిమాయత్ సాగర్, గండిపేట నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో మూసీ నదిలో వరద ప్రవాహం తీవ్రరూపం దాల్చింది.మూసీ వరద నీరు ఎంజీబీఎస్‌ను ముంచెత్తింది. వరద ఉధృతితో ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు తీసుకువచ్చారు.
ఎంజీబీఎస్ నుంచి నడిచే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లలో మళ్లించినట్లుగా ఆర్టీసీ ప్రకటించింది.ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి.వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి.సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ నుంచి నడుస్తున్నాయి.
మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.”బస్సులకు సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలి” అని టీఎజీఎస్ఆర్టీసీ ప్రకటించింది.శుక్రవారం రాత్రి నుంచి వరదలు పోటెత్తడంతో హైదరాబాద్‌లోని బాపూఘాట్ నుంచి మూసారంబాగ్ వరకు మూసీ పరివాహక ప్రాంతంలో భయానక పరిస్థితి నెలకొంది.
చాదర్ ఘాట్, మూసారంబాగ్ ప్రాంతాల్లోని మూసానగర్, శంకర్ నగర్, దుర్గానగర్, వినాయకవీధి, అంబేడ్కర్ నగర్ బస్తీలు నీటమునిగాయి. మూసీ నది ఒడ్డున ఇళ్లు చాలావరకు ఇంటిపైకప్పు వరకు మునిగిపోయాయి.ఇళ్లల్లోని వస్తువులు, నిత్యావసరాలు వరదలో మునిగిపోయాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూసీ పరివాహాక ప్రాంతంలోని ప్రజల కోసం ప్రత్యేకంగా పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలకు గండిపేట 15 గేట్లు, హిమాయత్ సాగర్ 11 గేట్లు ఎత్తి వరదనీటిని కిందకు విడిచిపెడుతున్నారు.మూసారంబాగ్, చాదర్‌ఘాట్ పాతవంతెన, పురానాపూల్ వంతెనలపై వరద నీరు చేరడంతో రాకపోకలను నిలిపివేశారు.
మూసారంబాగ్, చాదర్‌ఘాట్ వద్ద వంతెనలపై నుంచి సుమారు పది అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది.ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నందున మూసీ నదిలో వరదలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.మూసీ నది వరదలతో కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ప్రభావం కనిపిస్తోంది.సూర్యాపేట వద్ద ఉన్న మూసీ ప్రాజెక్టు నుంచి 9 గేట్లను ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు.