ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల నిలుపుదల గడువును పొడిగించింది. ఈ మేరకు ఈ భూముల రిజిస్ట్రేషన్‌లను మరో రెండు నెలలు పొడిగిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు స్పెషల్ సీఎస్ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిషిద్ధ జాబితా నుంచి ఎసైన్డ్ భూములను తొలగించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ అంశంపై ప్రభుత్వం విచారణ చేస్తోంది.. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం అక్టోబరులో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. అందుకే రిజిస్ట్రేషన్ల నిలుపుదల గడువును పొడిగించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 5 లక్షల ఎకరాల ఎసైన్డ్ భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు. అయితే నిబంధనల ప్రకారం 20 ఏళ్లు దాటిన భూములను మాత్రమే తొలగించాల్సి ఉంటంది. కానీ గత ప్రభుత్వం ఆ నిబంధనలను ఉల్లంఘించగా.. దాదాపు 25 వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంపై ప్రభుత్వం విచారణ చేస్తుండగా.. భూ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీన కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అక్టోబర్ నాటికి ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంపై ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత ఈ భూముల అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగితే వాటిని రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన బిల్లు అమల్లోకి వచ్చింది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో జరిగే అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, బ్రాండెడ్ కంపెనీలతో వ్యాపారం చేసే ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సివిల్ కోర్టులకు మాత్రమే అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం ఉంది. 2023 మార్చి 20న అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908ను సవరించగా.. (AP యాక్ట్ అమెండ్‌మెంట్-2023) బిల్లును శాసనసభ ఆమోదించింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఒకవేళ ఏవైనా రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగాయని ఫిర్యాదులు వస్తే.. జిల్లా రిజిస్ట్రార్ వాటిని పరిశీలిస్తారు.. ఆధారాలు ఉంటే కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి సిఫార్సు చేస్తారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, ఇతర అధికారులు ఉంటారు. నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ చేసినా, ఒకే ఆస్తికి రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేసినా, కోర్టు అటాచ్‌మెంట్‌లో ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ చేసినా సబ్-రిజిస్ట్రార్లకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ సబ్-రిజిస్ట్రార్ వల్ల కొనుగోలుదారులకు నష్టం వాటిల్లితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.