అనంతపురం :
రూ. 41.20 లక్షల నగదు, 08 సెల్ ఫోన్ లు, కారు, 20 ఏటిఎం కార్డ్స్, 15 సిమ్ కార్డ్స్, 05 బ్యాంక్ పాస్ బుక్కులు, 10 చెక్కు బుక్కులు, 02 రూటర్స్ స్వాధీనం…ఐదుగురు సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
* కాంబోడియా దేశం నుండీ ఫేక్ యాప్ ల ఆపరేట్ … డిల్లీ కేంద్రంగా ఫ్రాడ్ డబ్బును ఫేక్ అకౌంట్లలోకి బదలాయించిన గుట్టు రట్టు చేసిన అనంతపురం ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆధ్వర్యంలో పోలీసులు
* రాయదుర్గం మండలం వేపరాళ్లకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నమ్మించి రూ.1,73,99,333/- లు సైబర్ మోసానికి పాల్పడిన వైనం
* దేశ వ్యాప్తంగా క్రియేట్ చేసిన 13 ఫేక్ అకౌంట్లలోకి సదరు డబ్బు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడి… కొనసాగుతోన్న సమగ్ర విచారణ
* డిల్లీ కేంద్రంగా ఫేక్ అకౌంట్ల ద్వారా పలు అకౌంట్లలోకి ఫ్రాడ్ చేసిన డబ్బు మార్పిడి … క్రిప్టో కరెన్సీ ద్వారా దేశం దాటించేందుకు సిద్ధమైనట్లు పోలీసులకు సమాచారం
* జిల్లా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్టు చేసి భారీగా నగదు, తదితరాలను సీజ్ చేసిన వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ గారు
** అరెస్టు చేసిన సైబర్ నేరగాళ్ల ముఠా వివరాలు :
1) భావనేష్ గోయల్@శ్యామ్ జి, వయసు 48 సం.లు, తిలక్ నగర్, వెస్ట్ ఢిల్లీ
2) ధర్మేంద్ర సింగ్, వయసు 43 సం.లు, భైసకుర్ గ్రామము, BB నగర్, బులంధశాహర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రము
3) సాపిరెడ్డి కోదండరామ దుర్గసాయి ప్రసాద్, వయసు 32 సం.లు, SR నాయక్ నగర్, IDA జీడిమెట్ల, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రము
4) కొంగతి కృష్ణ, వయస్సు 43 సం.లు, చందర్లపాడు మండల కేంద్రం, NTR జిల్లా
5) వడ్లమూడి ఫణికుమార్,వయస్సు 39 సం.,లు, చందర్లపాడు మండల కేంద్రం, NTR జిల్లా
( వీరికి సహకరించిన వారిలో ఓ ప్రయివేట్ బ్యాంకు మేనేజర్ కూడా ఉన్నారు. త్వరలో అరెస్టు చేస్తాం)
** స్వాధీనం చేసుకున్నవి :
రూ. 41.20 లక్షల నగదు, 08 సెల్ ఫోన్ లు, కారు, 20 ఏటిఎం కార్డ్స్, 15 సిమ్ కార్డ్స్, 05 బ్యాంక్ పాస్ బుక్కులు, 10 చెక్కు బుక్కులు, 02 wifi రూటర్స్ స్వాధీనం
** సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నరసింహప్పకు జరిగిన సైబర్ మోసం… నేపథ్యం :
* నరసింహప్ప..,తన ఫేస్ బుక్ అకౌంటులో ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అంటూ తారాసపడిన పోస్టు కు ఆకర్షితుడై తద్వారా తెలీకుండానే సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసి కాంబోడియ దేశం నుండీ ఆపరేట్ చేస్తున్న వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయ్యాడు
* సైబర్ నేరగాళ్లకు సంబంధించిన ఫేక్ యాప్ లైన VIP66 Bajaj Iinvestment మరియు K26 Zerodaha Market in sights లలో సైబర్ నేరగాళ్ల సూచనల మేరకు తొలుత రూ. 12 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. రోజుల వ్యవధిలోనే రూ. 5.50 లక్షలు లాభం వచ్చేటట్టు చూపించి ఆ డబ్బు మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే విధంగా అవకాశం కల్పించి నమ్మించారు
* అనతి కాలంలోనే లక్షల్లో లాభం రావడంతో మరింత నమ్మకం పెరిగింది. దీంతోనే… ఈ ఏడాది ఏప్రిల్ 15 నుండీ మే14 వరకు నెల రోజుల వ్యవధిలోనే విడతల వారీగా రూ. 1,73,99,333/- లు ఇన్వెస్ట్ చేశాడు.
* ఇన్వెస్ట్మెంట్ మొత్తం మరియు వచ్చిన లాభం కలిపి సుమారు రూ. 3.40 కోట్లను విత్ డ్రా చేయాలనీ ప్రయత్నించగా ట్యాక్స్ మరియు బ్రోకరైజ్ కింద 40 శాతం డబ్బులు కడితేనే విత్ డ్రాకు అవకాశమిస్తామని సమాధానం రావడంతో అనుమానం కల్గి నరసింహప్ప అనంతపురం సైబర్ విభాగం పోలీసులను ఆశ్రయించాడు
** సీరియస్ గా తీసుకుని ఛేదించాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ… కేసు నమోదు… రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వేపరాళ్ల నరసింహప్ప 18-06-25 న ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు Cr.No.112/2025, U/s 318(4) BNS and Sec 66 (D) of IT Act నమోదు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో సి.ఐ లు జయనాయక్, వెంకటరమణ, షేక్ జాకీర్ , ఎస్సైలు నాగమధు, గూర్నాథరెడ్డిల ఆధ్వర్యంలో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
** పోలీసు బృందాల దర్యాప్తులో కీలక విషయాలు… కాంబోడియా వేదికగా ఫేక్ యాప్ ల ఆపరేషన్
ప్రత్యేక పోలీసు బృందాల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. సదరు ఫేక్ యాప్ లను కాంబోడియా దేశం నుండీ ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. వీటిపైన దర్యాప్తు కొనసాగుతోంది
** ఫ్రాడ్ డబ్బంతా 13 ఫేక్ అకౌంట్లలోకి…
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నరసింహప్ప వేసిన రూ.1,73,99,333/- లు విడతల వారీగా 13 అకౌంట్లలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ మొత్తం 13 ఫేక్ అకౌంట్లు కూడా దేశంలోని పలు ప్రాంతాలలో క్రియేట్ చేసినవే… డిల్లీ, పూణే, సూరత్ , గుణ (మధ్యప్రదేశ్ ), పాట్నా, సమస్తీపూర్ & బీడ్ (బీహార్ ), నుపాడ (ఒడిస్సా), బెంగుళూరు, గుంటూరు, విజయవాడలలో ఫేక్ అకౌంట్లు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీటిపై దర్యాప్తు కొనసాగుతోంది.
** తీగ లాగితే డొంక కదలిన వైనం …
ఫేక్ అకౌంట్ల దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసు బృందాలకు తీగలాగితే డొంక కదలిన చందంగా ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. విజయవాడ ఫేక్ అకౌంట్ ను లోతుగా విచారించారు. ఆ ప్రాంతంలో ఓ ప్రయివేట్ బ్యాంకు మేనేజర్ మరియు వడ్లముడి ఫణికుమార్ ల ద్వారా తెరిచిన అకౌంట్లకు సంబంధించిన బ్యాంకు పాసు బుక్కులు, తదితరాలను కొంగతి కృష్ణ ద్వారా సాపిరెడ్డి కోదండరామ దుర్గసాయి ప్రసాద్ సేకరించి డిల్లీలోని శ్యాంజీ, ధర్మేంద్ర సింగ్ లకు చేర్చారు. వీరు …డిల్లీ కేంద్రంగా ఫేక్ అకౌంట్లలోని డబ్బులను ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ తో వివిధ అకౌంట్ల ద్వారా డబ్బును మార్పిడి చేశారు. సదరు డబ్బును తదుపరి క్రిప్టో కరెన్సీ ద్వారా దేశం దాటించేందుకు సిద్ధమైనట్లు పోలీసులకు సమాచారం ఉంది.
** ప్రశంస : కాంబోడియా దేశం వేదికగా ఫేక్ యాప్ లు ఆపరేటింగ్ … డిల్లీ కేంద్రంగా ఫ్రాడ్ మొత్తాలను ఫేక్ బ్యాంకు అకౌంట్లలోకి బదలాయిస్తూ తీవ్రమైన సైబర్ నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు చేసిన సి.ఐ లు జయనాయక్, వెంకటరమణ, షేక్ జాకీర్ , ఎస్సైలు నాగమధు, గుర్నాథరెడ్డీల ఆధ్వర్యంలో పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు అభినందించారు.
** ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి — జిల్లా ఎస్పీ
ప్రస్తుత పరిస్థితులలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించేందుకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని… తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని ప్రలోభ పెట్టే మోసగాళ్లు, ప్రత్యేకంగా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలను టార్గెట్ చేస్తున్న పెట్టుబడి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గారు కోరారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా కొన్ని సూచనలు పాటించాలన్నారు.
** ప్రజలకు విజ్ఞప్తి :
✅ RBI, SEBI వంటి చట్టబద్ధ సంస్థల నుండి గుర్తింపు పొందని ఏవైనా ఫైనాన్స్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా డబ్బు పెట్టవద్దు.
✅ ‘గ్యారెంటీ లాభం’ అని చెప్పే ప్రతీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ను సందేహంతో చూడండి.
✅ డబ్బు పంపే ముందు కంపెనీ యొక్క వెబ్‌సైట్, రివ్యూలు, రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోండి.
✅ ఆన్లైన్ గేమింగ్ యాప్ లకోసం అంటూ సైబర్ నేరగాళ్ల విసిరే వలలో పడి కమిషన్ కోసం ఆశపడి మీ బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టొద్దు. అమాయక ప్రజల కోట్ల రూపాయల సొమ్ము దోచుకోవడంలో భాగం కావొద్దు.
✅ ప్రజలు వాడకంలో లేని తమ బ్యాంకు ఖాతాలను వెంటనే రద్దు చేసుకోవాలి లేదంటే అవి సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి సైబర్ నేరాల కోసం వాడుకునే అవకాశం ఉంది.
✅ ఎలాంటి అనుమానాస్పద లింకులు వచ్చినా క్లిక్ చేయకుండా ఉండండి.
✅ మోసానికి గురైతే వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేయండి.
** ఫిర్యాదులకు:
📞 నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్: 1930
🌐 వెబ్‌సైట్: www.cybercrime.gov.in