కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కులగణన సర్వేను ఎంతో పకడ్బందీగా నిర్వహించామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కులగణన సర్వే-2025 నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు కేబినెట్ సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సరైన సమాచారం లేదన్నారు. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు నెలకొన్నారని చెప్పారు. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో లెక్కించలేదని అన్నారు.
“జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదు. అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణలో కులగణన చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం. కులగణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టాం. ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్ గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించాం”- సీఎం రేవంత్ రెడ్డి
76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి కులగణన సర్వే నివేదికను రూపొందించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన నివేదిక రూపొందించామని స్పష్టం చేశారు. కుల సర్వేకు పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత అసెంబ్లీలో ప్రవేశపెట్టామని చెప్పారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు సముచిత స్థానం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా కులగణన సర్వే నివేదికను రూపొందించిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.
“రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంబంధించి పూర్తి సమాచారం లేకపోవడం వల్ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల అమలులో సమస్యలు వస్తున్నాయి. కోర్టుల్లో చిక్కులు ఎదుర్కొంటున్నాం. చివరిగా 1931లో బ్రిటీష్ వాళ్లు కులగణన చేశారు. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదు. జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ లెక్కలు చెప్పేవారే తప్పా…బలహీన వర్గాల వివరాలు పొందుపరచలేదు. రాష్ట్రంలో ప్రతి 150 ఇండ్లను మ్యాపింగ్ చేసి 94 వేలకు యూనిట్లు గుర్తించాం. 150 ఇండ్లను రోజుకు 8-10 ఇండ్లు చొప్పున సర్వే చేశారు.
ఈ సర్వేలో ముందుగా ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించాం. ఆ తర్వాత ప్రతి ఇంటికి అప్లికేషన్లు తీసుకెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు సేకరించారు. ఇతర రాష్ట్రాల్లో కులగణన, జనగణన ఎలా జరిగిందో పూర్తిగా అధ్యయనం చేసి కులగణన సర్వే చేశాం. మొత్తం ఎనిమిది పేజీలలో ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల పేర్లు, సంక్షేమ పథకాల లబ్ది, రిజర్వేషన్లు ఇలా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాం. మాన్యువల్ గా సేకరించి వాటిని కంప్యూటరీకరణ చేశాము.
7 దశాబ్దాలుగా బలహీన వర్గాలు, తాము ఎంత మంది ఉన్నామో చెప్పాలని పోరాడుతున్నారు. నిధులు, రిజర్వేషన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో బలహీన వర్గాల వాటాను గుర్తించేందుకు కులగణన సర్వే ఉపయోగపడుతుంది. ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ స్డడీ చేసి ఆ నివేదికను కేబినెట్ ముందు ఉంచింది. కేబినెట్ ఆమోదంతో ఇవాళ సభలో ప్రవేశపెట్టి చర్చిస్తు్న్నాం. దీనికి పూర్తిస్థాయిలో చట్టబద్ధం కల్పించేందుకు పడక్బందీగా ఏర్పాటు చేశాం. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఈ సర్వే లెక్కలు ఎంతోగానో ఉపయోగపడతాయి.” -సీఎం రేవంత్ రెడ్డి