బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురువారం (అక్టోబర్ 30) రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై వెళ్లిన రేవంత్ తో సల్మాన్ కాసేపు ప్రత్యేకంగా మాట్లాడాడు. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని తాను ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తానని సల్మాన్ హామీ ఇచ్చాడు.
సల్మాన్ ఖాన్, రేవంత్ రెడ్డి భేటీ ఇప్పుడు ఎంతో ఆసక్తి రేపుతోంది. ముంబై వెళ్లిన రేవంత్ రెడ్డిని సల్మాన్ ప్రత్యేకంగా కలిసి తెలంగాణ గురించి చర్చించడం విశేషం. తెలంగాణ కాంగ్రెస్ తోపాటు ఈ ఫొటోలను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరూ తెలంగాణ అభివృద్ధి గురించి చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ 2047 నినాదానికి సల్మాన్ మద్దతిచ్చాడు.
2034 వరకు తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వరకు చేర్చే ఉద్దేశంతో ఈ తెలంగాణ రైజింగ్ 2047 నినాదాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనికి సల్మాన్ మద్దతిస్తూ.. తాను ఈ నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తానని హామీ ఇవ్వడం గమనార్హం. తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వం చేపడుతున్న పనులను కూడా అతడు కొనియాడాడు.
సల్మాన్ ఖాన్ ను అతని ఇల్లు గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ లోనే రేవంత్ రెడ్డి కలిశాడు. ఈ ఫొటోలో ఉన్న సల్మాన్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అతడు మరింత ఫిట్‌గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. 59 ఏళ్ల వయసులోనూ సల్మాన్ ఇంత ఫిట్ గా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చివరిగా సికందర్ సినిమాలో నటించాడు. ఇందులో రష్మిక మందన్నా కూడా కనిపించింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇప్పుడతడు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ మూవీలో నటిస్తున్నాడు. గల్వాన్ లోయలో ఇండియా, చైనా మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. అతడు ఆ మధ్య చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ సినిమాలోనూ నటించిన విషయం తెలిసిందే.
 
			



















