ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష రాజకీయ అనుభవం ఉన్న వారు. ఆయన ఏది మాట్లాడినా ఆచీ తూచీ మాట్లాడుతారు. ఆయన మాటలలో లౌక్యం పాలు ఎక్కువ. ఆయన మనసులో ఏముందో ఎన్ని వందల ఇంటర్వ్యూలు నిర్వహించినా ఎవరూ బయటకు తీయలేరు. ఎన్ని ప్రశ్నలు సూటిగా సంధించినా చంద్రబాబు ఏ మాత్రం తడుముకోకుండా తాను ఏమి చెప్పాలనుకుంటారో అదే చెబుతారు.
అయితే చంద్రబాబు సుపరిపాలనకు తొలి అడుగు సభలో మాత్రం బోల్డ్ గా మాట్లాడారు. బహుశా ఫస్ట్ టైం అలా మాట్లాడి ఉంటారా అన్నది కూడా చర్చిస్తున్నారు. ఇంతకీ బాబు ఏమన్నారు అంటే ఏడాది పాలనలో అన్నీ చేశామని చెప్పుకోవడం లేదు అని. నిజంగా ఇది ఏ రాజకీయ నాయకుడూ అనలేని మాటే. మరీ ముఖ్యంగా చంద్రబాబు నుంచి అసలు ఊహించలేనిది ఈ మాట.
ఆయన ఎపుడూ ప్రభుత్వాన్ని సమర్ధిస్తూనే మాట్లాడుతారు. అదే రాజకీయ వ్యూహం విధానంగా భావిస్తారు. కానీ ఎందుకో ఆయన తొలి ఏడాది పాలన మీద విశ్లేషిస్తూ చాలా విషయాలు చెప్పారు. ఏడాదిలోనే అన్నీ చేశామని మేం చెప్పడం లేదు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు.
ఆయన అలా చెప్పడం ద్వారా తన రాజకీయ అనుభవాన్ని పెద్దరికాన్ని కూడా చాటుకున్నారు అని అంటున్నారు. చాలా మంది నాయకులు అన్నీ చేసేశామని చెబుతూంటారు. దాని వల్ల వారికి ఆత్మానందం కానీ అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసు. అందుకే చంద్రబాబు అన్నీ చేశామని చెప్పలేదని అంటున్నారు. అయితే అధికారంలోకి వచ్చి ఇంకా తొలి ఏడాదే అయింది కాబట్టి అన్నీ చేయాలన్న దురాశ జనాలకు కూడా ఉండదు.
అయితే సూపర్ సిక్స్ హామీల విషయం దృష్టిలో పెట్టుకుని బాబు అలా అని ఉంటారా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో ఊహించనివి కొన్ని చేశామని అన్నారు. ఏపీలో దారుణమైన ఆర్ధిక పరిస్థితి ఉందని బాబు అంటూ కేంద్రం సహకారం లేకపోతే అసలు ఊపిరి కూడా పీల్చుకోలేని నేపథ్యం ఉండేదని అన్నారు.
తనకు ఇది తొలిసారి కాదని అన్నారు. 1995 ప్రాంతంలో కూడా ఉమ్మడి ఏపీలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని దానిని తాను చాలా సమర్ధంగా తట్టుకుని నిలబడ్డాను అని ఆయన గుర్తు చేసుకున్న్నారు. ఇక 2014లో విభజన తరువాత ఏపీ ఇబ్బందులో ఉందని కనీసం రాజధాని లేకపోతే బస్సులో ఉంటూ పాలించిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.
మూడు రాజధానులు పేరు చెప్పి గత ప్రభుత్వం మూడు ముక్కలాడితే డబుల్ ఇంజన్ సర్కార్ తో తాము అభివృద్ధి బాటను పట్టించామని బాబు చెప్పారు. ఇక ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పధకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తాను ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉండగా విజన్ 2020 ని డాక్యుమెంట్ తయారు చేశామని దానిని నిజం కూడా చేశామని బాబు గుర్తు చేశారు ఇపుడు విజన్ 2047 అంటున్నామని దానిని కూడా సాధిస్తామని బాబు హామీ ఇచ్చారు.
ఇక రానున్న అయిదేళ్ళలో అందరికీ ఇళ్ళు నిర్మించి ఇస్తామని అలాగే .జల్ జీవన్ మిషన్ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం బనకచర్ల పధకం అన్నది చాలా మంచిదని ఆయన అంటూ దీని వల్ల రెండు రాష్టాలకు మేలు తప్ప ఎవరికీ నష్టం ఉండదని బాబు చెప్పడం విశేషం. గోదావరి నదిలోకి వృధాగా పోతున్న మూడువేల టీఎంసీల నీటి నుండి ఎంతో కొంత వాడుకున్నా తెలుగు రాష్ట్రాలకు మంచే జరుగుతుందని బాబు అన్నారు.