ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు ఘాటుగా స్పందిస్తూ అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. “మూడు రాజధానులు అయిపోయాయి… ఇప్పుడు మావిగన్ అంటున్నారు. మీకు అమరావతి కావాలా? వద్దా? మన రాజధాని అమరావతే” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రాయలసీమలోని జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా ఆ ప్రాంత ప్రజల చిరకాల కలను నెరవేర్చుతున్నామని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా రాయలసీమలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో వీబీజీ రామ్‌జీ పథకాన్ని ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టమని చంద్రబాబు అన్నారు. గతంలో నరేగా పథకం కూడా రాయలసీమ నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి వీబీజీ రామ్‌జీ పథకాన్ని ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.7,700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అమరావతిని ప్రపంచస్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలోని అత్యుత్తమ ఆరు క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. కేవలం క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా, క్వాంటం కంప్యూటర్ల తయారీ కేంద్రంగా కూడా అమరావతిని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మరో రెండేళ్లలో “అమరావతి మేడ్” క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. “అమరావతిని ఆపడం ఎవడి తరం కాదు” అని వ్యాఖ్యానిస్తూ రాజధాని నిర్మాణం వేగంగా కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి కేంద్రబిందువుగా మారుతుందని, పెట్టుబడులు, ఉపాధి, ఐటీ, పరిశ్రమలు, ఆధునిక సాంకేతిక రంగాలన్నీ ఇక్కడి నుంచే విస్తరిస్తాయని చెప్పారు.
మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై కూడా చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే “దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి” అంటూ ఎద్దేవా చేశారు. అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలకు పేటెంట్ ఎవరికైనా ఉందంటే అది “గొడ్డలి పార్టీ”కేనని విమర్శించారు. అమరావతి పరిరక్షణ పేరుతో రౌడీలతో దండయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు.
హోంమంత్రినే అవమానించే పరిస్థితి వస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదని, కానీ ప్రస్తుతం తమ ప్రధాన లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి, తెలుగుజాతి సంక్షేమమని చెప్పారు. రాజకీయ కక్షసాధింపుకంటే అభివృద్ధికే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. “గొడ్డలి పార్టీ నెవర్ అగైన్” అనే సంకల్పంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు రావాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
రాజకీయాల్లో స్థిరత్వం, పరిపాలనలో పారదర్శకత, అభివృద్ధిలో వేగం ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం, రాయలసీమ అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పెట్టుబడులు, భారీ మౌలిక వసతుల కల్పనతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.


















