కాలం కలిసి రానప్పుడు టెంకాయ కూడా టైంబాంబు మాదిరి పేలుతుందన్న మాటకు తగ్గట్లే వైసీపీ అధినేత..ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంది. ఆయనేం చేసినా మైలేజీ తర్వాత అంతకు రెట్టింపు డ్యామేజ్ బారిన పడుతున్నారు. తాజాగా ఆయన ప్లాన్ చేసిన రెంటపాళ్ల పర్యటనతో పార్టీకి జోష్ సంగతి తర్వాత.. కేసుల చిక్కులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఇప్పటికే సదరు పర్యటనలో ఒక కార్యకర్త కారు కింద పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. అధినేత జగన్ కారు కింద కాదని మొదట అనుకున్నా.. సీసీ కెమేరా ఫుటేజ్ లో ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు చక్రం కింద పడి మరణించిన విషయాన్ని గుర్తించారు.
ఈ పర్యటన వేళ పోలీసులు పెట్టిన నిబంధనలు..ఆంక్షలకు భిన్నంగా బలప్రదర్శన మాదిరి నిర్వహించిన వైనంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సరిపోదన్నట్లు పార్టీ అభిమాని ప్రాణాలు పోవటం ఒక ఎత్తు అయితే.. అది జగన్ ప్రయాణిస్తున్న కారు కావటంతో పోలీసు కేసు ఆయనపై నమోదైన పరిస్థితి. ఇదిలా ఉండగా.. ఈ పర్యటన వేళ.. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ర్యాలీ కారణంగా ఒక అంబులెన్సు ట్రాఫిక్ లో చిక్కుకుపోయి.. అత్యవసర చికిత్స అందాల్సిన రోగికి అందకపోవటమే కాదు.. ప్రాణాలు పోయిన వైనం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన తెల్లజర్ల వెంకటేశ్వర్లు కొడుకు మధు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్నేహితుడికి బైక్ ఇవ్వటానికి వెళ్లిన అతను అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడ్ని సాయి క్రిష్ణ ఆసుపత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన వైద్యులు మధుకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన విషయాన్ని గుర్తించి.. వెంటనే గుంటూరులోని పెద్ద ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయం తప్పుతుందని చెప్పారు. దీంతో సత్తెనపల్లి నుంచి అంబులెన్సులో గుంటూరుకు బయలుదేరారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామానికి వస్తుండటటంతో.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. మధు తల్లిదండ్రులు అంబులెన్సు దిగి..వైసీపీ నేతలకు దారి ఇవ్వాలని వేడుకున్నారు. అయినప్పటికీ వారి నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. 40నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో వెళ్లాల్సిన అంబులెన్సు.. 2 గంటల ఆలస్యంగా గుంటూరు ఆసుపత్రికి చేరుకుంది.
మధును పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లుగా వెల్లించారు. అంబులెన్స్ కు దారి ఇవ్వని కారణంగానే తమ కొడుకు చనిపోయినట్లు వారు ఆరోపిస్తున్నారు. తమ కొడుకు మరణానికి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంబులెన్సుకు దారి ఇవ్వకుండా వ్యవహరించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని..తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే సొంత కార్యకర్త మరణం ఆ పార్టీని ఇబ్బంది పెడుతుంటే.. ఇప్పుడు చనిపోయిన మధు తండ్రి టీడీపీకి చెందిన నేతగా చెబుతున్నారు. ఆయన ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి పార్టీ క్లస్టర్ ఇంఛార్జ్ గా చెబుతున్నారు.