కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక రోజులో ముగుస్తాయనగా ఒక కీలక బిల్లుని సభ ముందుకు తెచ్చింది. బుధవారం ఆ బిల్లుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగ సవరణ 130 గా చేస్తూ రూపొందించనున్నారు. ఈ బిల్లు ప్రకారం ఎవరి మీద అయినా అయిదేళ్లకు మించి తీవ్ర నేరాల మీద శిక్షలు పడి వారు వరసగా 30 రోజులు జైలు జీవితం అనుభవిస్తే కనుక వారి పదవి ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది. ఇది ప్రధాని ముఖ్యమంత్రి మంత్రులతో సహా వర్స్తిస్తుంది ఇది వివాదాస్పద బిల్లు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏకంగా ప్రభుత్వం తీరు మీదనే నిప్పులు చెరుగుతున్నాయి
ఈ వివాదాస్పద బిల్లుని పార్లమెంట్ ముందుకు హడావిడిగా తీసుకుని రావడానికి కారణం బీహార్ సీఎం నితీష్ కుమార్, ఏపీ సీఎం చంద్రబాబు అని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లోక్ సభలో గురువారం ఈ బిల్లు మీద మాట్లాడుతూ బీజేపీ ఒక పధకం ప్రకారమే బిల్లు తెచ్చిందని ఆరోపించారు. తమ మిత్రుల మీదనే ప్రయోగించాలని అనుకుంటోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. విపక్ష పార్టీలకు చెందిన వారిని సైతం కట్టడి చేయాలని ఈ బిల్లుని బీజేపీ తెచ్చిందని లోక్ సభలో కీలక వ్యాఖ్యలే చేశారు. అయితే దానిని బీజేపీ ఎంపీలు అంతకంటే తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని వారు చెప్పారు.
ఇక బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్జేడీకి చెందిన ముఖ్య నాయకుడు తేజస్వి యాదవ్ సైతం బీజేపీ తెచ్చిన 30 రోజుల్లో జైలు బిల్లు మీద తీవ్రంగా మండిపడ్డారు. మిత్రులను తన చెప్పుచేతలలో ఉంచుకునేందుకే ఈ బిల్లు అన్నారు. బీహార్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని మంత్రులు ముఖ్యమంత్రులౌ బెదిరించి వేధించేందుకే ఈ బిల్లుని కేంద్రం ఒక వ్యూహం ప్రకారం తెచ్చింది అని తేజస్వి యాదవ్ దుయ్యబెట్టారు. దీనికి లాజిక్ పాయింట్ ని కూడా ఆయన చెప్పారు.
నితీష్ చంద్రబాబు లేకుండా కేంద్రంలో ఎండీయే ప్రభుత్వం ఉండదని అందువల్ల ఈ ఇద్దరినీ ఏదో విధంగా తమ అదుపులో ఉంచుకునేందుకు ఈ బిల్లుని తెచ్చారని అన్నారు. లోక్ సభలో బీజేపీకి మెజారిటీ లేదని అందుకే వ్యూహాత్మకంగా ఇలా చేశారు అని తేజస్వి యాదవ్ అంటున్నారు. ఇది బీహార్ ఎన్నికల ముందు కేంద్రం ఇస్తున్న సందేశంగా కూడా ఆయన అభివర్ణించారు. మనీ లాండరింగ్ కేసులలో నిందితుల పిటిషన్లను ఈడీ కోర్టు కొట్టేస్తే వారిని జైలుకు పంపంచి పదవుల నుంచి తప్పించే వ్యూహం ఉందని కూడా ఆయన ఆరోపించారు.
మరో వైపు చూస్తే బిల్లుని పార్లమెంటరీ సంయుక్త కమిటీ పరిశీలనకు పంపించాలని లోక్ సభలో నిర్ణయం తీసుకున్నారు. అయినా ఈ బిల్లు మీద అయితే విపక్షాల ఆగ్రహం విమర్శలు ఏ మాత్రం ఆగడం లేదు. ఈ బిల్లు వల్ల ఎవరిని అయినా టార్గెట్ చేయాలనుకుంటే ఇట్టే చేయవచ్చు అని అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో బీజేపీ ఆలోచనలను ప్రజాస్వామ్యవాదులు ఎవరూ సమర్ధించరని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ బిల్లు జేపీసీ ముందుకు వెళ్ళి అక్కడ అన్ని పార్టీల సభ్యుల సలహాలతో సూచనలతో తుది బిల్లుగా వస్తుందని అమిత్ షా ఇప్పటికే లోక్ సభకు చెప్పారు. అయితే ఈ బిల్లు విషయంలో మాత్రం విపక్షం ఎందుకో బీజేపీని అనుమానిస్తోంది. పైగా నితీష్ బాబు ఈ ఇద్దరే టార్గెట్ అని అంటోంది. దాంతో ఎన్డీయే రాజకీయం కూడా రసకందాయంలో పడినట్లు అవుతోంది. ముందు ముందు ఈ బిల్లే జాతీయ స్థాయిలో చర్చకు ఆస్కారం ఇచ్చేలా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో కేంద్రం బిల్లు ఉద్దేశ్యాలను ఏ విధంగా సమర్ధించుకుంటుందో.