ఏమాటకు ఆమాట చెప్పాలంటే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన కేడర్ ఉంది. అది స్థానికంగా ఉన్న నాయకుల వల్ల మరింత పెరిగిందనే చెప్పాలి. దీంతో వైసీపీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. సదరు నియోజకవర్గాల్లో నేతల వాయిస్ బలంగా వినిపించేది. దీంతో ఆ పార్టీ పనులు కూడా అలానే జరిగాయి. అయితే.. గత ఏడాది ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం తర్వాత.. సదరు నియోజకవర్గాల్లో సగానికి సగం పైగా వాయిస్ లెస్ అయిపోయాయి.
ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే.. మాచర్ల.. పల్నాడు జిల్లాలోని ఈ నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవా కొనసాగింది. పిన్నెల్లి సోదరులు గీసిన గీత దాటేందుకు అధికారులు కూడా భయపడే వారన్న వాదన కూడా వినిపించింది. టీడీపీ శ్రేణులు, నాయకులు అయితే.. పిన్నెల్లి హవాకు భయపడి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పిన్నెల్లి సోదరులు కేసుల ఊబిలో చిక్కుకున్నారు. దీంతో వారి వాయిస్ కానీ.. వారి హవా కానీ.. కనిపించడం లేదు.
మంగళగిరి: ఒకప్పుడు ఆళ్ల రామకృష్నారెడ్డి హవా కనిపించింది. ఇక్కడ టీడీపీ ఉన్నా.. పెద్దగా లేదు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి వర్గం దూకుడుగా ఉండేది. వైసీపీ ప్రభావం కూడా ఎక్కువగా కనిపించింది. కానీ, గత ఎన్నికలకు ముందు వైసీపీ మార్పుల కారణంగా ఇప్పుడు ఇక్కడ ఆ పార్టీ హవా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఆళ్ల ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇక, వైసీపీ జెండా మోసే కార్యకర్తలు కూడా లేకుండా పోయారు.
చంద్రగిరి: చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయనకుమారుడు మోహిత్ రెడ్డిల దూకుడుతో దాదాపు 10 సంవత్సరా ల పాటు.. ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడింది. కానీ, అక్రమ మద్యం కుంబకోణంలో చిక్కుకోవడం.. రాజకీయంగా ఇక్కడ టీడీపీ పుంజుకోవడంతో వైసీపీ హవా నేలమట్టమైంది. అదేవిధంగా గుడివాడలో దాదాపు 25 సంవత్సరాల పాటు కొడాలి నాని హవా కొనసాగినా. ఇప్పుడు ఆయన ఊసు లేకుండా పోయింది. గన్నవరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా.. దాదాపు 30 నియోజకవర్గాల్లో వైసీపీ వాయిస్ కొలాప్స్ అయిందనే టాక్ రాజకీయ వర్గాల్లోవినిపిస్తోంది.
















