వైఎస్ జగన్ క్రెడిబులిటి సున్నా అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందంటూ విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డి మాట్లాడాల్సిన అంశాలపై స్వయంగా జగన్ నోట్ ఇచ్చారని చెప్పారు. సాయిరెడ్డి చెప్పిన విషయాలు విని చాలా బాధ వేసిందన్నారు.
తన సొంత మేనకోడలు, అల్లుడికి వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్ నీతి మాటలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను.. తన పిల్లలను మోసం చేశారని మండిపడ్డారు.
వైఎస్ కుటుంబ ఆస్తుల తగాదాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ ఆస్తుల విషయంలో జగన్ ధోరణి నచ్చలేదని విజయసాయి రెడ్డి చెప్పినట్లు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల వివాదంలో అబద్దాలు చెప్పలేక విజయ సాయిరెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించారు. సొంత మేనల్లుడు, సొంత మేన కోడలు ఆస్తులు కాజేయాలని జగన్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
విజయవాడకు చేరుకున్న వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డితో సమావేశం విశేషాలను పంచుకున్నారు. విజయసాయి రెడ్డితో చాలా అంశాలు మాట్లాడుకున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్‌తో పడిన ఇబ్బందులు ఆయన చెప్పారని వెల్లడించారు. వైఎస్ కుటుంబం ఆస్తుల విషయంలో జగన్ తనతో అబద్ధాలు చెప్పించారని విజయసాయి రెడ్డి తనతో చెప్పినట్లు షర్మిల వివరించారు. ‘షేర్స్ తనకే చెందాలంటూ నా మీద, నా తల్లి మీద జగన్ కేసు వేశారు. అందుకే నేను వైఎస్ ఆనాడు అన్న మాటలు ఆనాడు చెప్పా. విజయసాయి రెడ్డితో జగన్ ప్రెస్ మీట్ పెట్టించి నా మాటలు అబద్దాలు అని చెప్పించారు’ అని షర్మిల చెప్పారు.
వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి మాటలు అబద్దమని విజయమ్మ లేఖ రాసి చెప్పారు. ఆ తరువాత కూడా జగన్ విజయసాయి రెడ్డి పై ఒత్తిడి తెచ్చారంట. ఆయన అంగీకరించకపోవడంతో సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి మళ్లీ విజయసాయి రెడ్డిని పిలిపించారు. 40 నిమిషాల పాటు జగన్ స్వయంగా విజయసాయి రెడ్డికి దిశానిర్దేశం చేశారం. ఎలా చెప్పాలి, నా పై ఏం మాట్లాడలో ఆయనే మొత్తం వివరించారంట’ అని వైఎస్ షర్మిల వివరించారు.
‘చెప్పినట్టు విని ప్రెస్‌మీట్ పెట్టకపోవడంతో విజయసాయి రెడ్డిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఈ విషయాలను విజయసాయి రెడ్డి నాకు స్వయంగా చెప్పారు. ఇవన్నీ పొల్లు పోకుండా సాయి రెడ్డి చెప్పినవే మీకు చెబుతున్నా. ఈ విషయాలు విని నా కళ్ల వెంట నీరు కారాయి’ అని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైఎస్ బిడ్డ, తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా జగన్ దిగజారి పోయారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నా క్యారెక్టర్‌పై ఇంత నీఛంగా మాట్లాడించారు. జగన్ ఇటీవల క్యారెక్టర్ గురించి పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారు. అసలు జగన్ క్యారెక్టర్ అంటే ఏమిటో మరచిపోయారు’ అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ‘వైఎస్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయి రెడ్డిపై ఒత్తిడి చేశారు. నా పరువు పోతుంది.. వదిలేయండి అన్నా కూడా జగన్ ఊరుకోలేదు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏ అబద్దాలు ఎలా చెప్పాలో జగన్ చెబితే.. విజయసాయి రెడ్డి రాసుకున్నారంట. ఇదీ జగన్ మహోన్నతమైన క్యారెక్టర్’ అని అసహన వ్యక్తం చేశారు.
‘సొంత మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్ ఇంత కుట్రలు చేశారు. జగన్, అతడి భార్య బైబిల్ ముందు కూర్చుని ఎంత దిగజారిపోయారో ఆలోచన చేయాలి. నా పిల్లలకు మీ ముఖం చూపించే ధైర్యం ఉందా?’ అని వైఎస్ షర్మిల నిలదీశారు.