వైసీపీ ఘోర పరాజయానికి 17 నెలలు పూర్తయ్యాయి. మరో మూడేళ్లు కళ్లు మూసుకుంటే మన ప్రభుత్వమే వస్తుందని.. అప్పుడు జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపుతానని మాజీ సీఎం జగన్ పదేపదే చెబుతున్నారు. ఇలా చెప్పటమే కాదు అందుకు పార్టీని సన్నద్ధం చేసేలా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో వైఫల్యానికి కేడర్ ను నిర్లక్ష్యం చేయడమే కారణంగా భావిస్తున్న జగన్.. ఈ సారి ఆ తప్పు జరగనీయనని మాటిస్తున్నారు. అయితే జగన్ హామీలు కేడర్ ను సంతృప్తిపరచలేకపోతున్నాయని అంటున్నారు. దీనికి ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను ఉదహరిస్తున్నారు.
మళ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కానీ, ఇప్పుడ వైసీపీ అధినేత తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కేడర్ సంతృప్తిగా లేరన్న టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై పోరాడుతున్న తమకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న భావనే ఎక్కువమందిలో కనిపిస్తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో ఓటమి వల్ల నిస్తేజంగా మారిన కేడర్ ను పునరుత్తేజం చేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో బలమైన పునాదులు నిర్మించాలని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్ ఇటీవల పార్టీలో కొన్ని నియామకాలు చేపడుతున్నారు. గ్రామ, మండలస్థాయి కమిటీలను నిర్మించడంతోపాటు పార్టీ అనుబంధ విభాగాలలో పదవులను భర్తీ చేస్తున్నారు.
అయితే పార్టీ కమిటీలపై అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య చర్చ జరుగుతోంది. నియోజకవర్గ నేతలకు దగ్గరగా ఉన్నవారికే పదవులు, గుర్తింపు దక్కుతుంది కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి అన్యాయమే జరుగుతోందని అంటున్నారు. వైసీపీ తాజాగా భర్తీ చేసిన పార్టీ పదవుల్లో ఇటీవల కేసులు ఎదుర్కొన్న ఏ ఒక్కరికీ చోటు దక్కని విషయాన్ని ఈ సందర్భంగా ఎత్తిచూపుతున్నారు. ఫ్రంట్ వారియర్స్ గా ఉంటూ పార్టీ కోసం కేసులు ఎదుర్కొంటున్న వారిని యథావిధిగా తొక్కిపెడుతున్నారని, ముఖ్య నేతల కోటరీకి దగ్గరగా ఉన్నవారికే పదవులు దక్కుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధమైన నిర్లక్ష్యం చేశారని, పార్టీని గెలిపించిన నేతలు, కార్యకర్తలను కాదని, వలంటీర్లపై ఆధారపడటం వల్ల జగన్ తగిన మూల్యం చెల్లించుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా పోరాడే వారిని పక్కన పెట్టి కేవలం షో చేసే వారిని అందలం ఎక్కించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, టీడీపీ కేడర్ లో ఉత్తేజం తెచ్చేలా ఆ పార్టీ వ్యవహరించిందని, ఎక్కువ కేసులు ఉన్నవారిని గుర్తించి పదవులు ఇస్తామని హామీ ఇచ్చిందని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ హామీకి కట్టుబడి పనిచేస్తోందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. కానీ, తమ పార్టీలో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవారిని ప్రోత్సహించకుండా పార్టీని బలోపేతం చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. తమ అధినేత మారలేదని చెప్పేందుకు తాజా నియామకాలను ఉదహరిస్తున్నారు. పార్టీలో ఏం జరుగుతుందో అధినేత ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. నియోజకవర్గ నేతలు ఇచ్చిన సమాచారంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని అంటున్నారు.


















