దేశంలోని మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల జాబితాకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. మహిళల భద్రతపై జాతీయ వార్షిక రిపోర్టు 2025 గురువారం విడుదలైంది. ఇందులో టాప్ 5 సేఫ్ నగరాల వివరాలు చూసినప్పుడు విశాఖపట్నం.. భువనేశ్వర్.. కోహిమా.. ఆయిజోల్.. ఈటానగర్.. ముంబయి.. గాంగ్ టక్ లు నిలిచాయి. అదే సమయంలో ఏ మాత్రం భద్రత లేని నగరాలుగా పాట్నా.. జైపూర్.. ఫరిదాబాద్.. ఢిల్లీ.. కోల్ కతా.. శ్రీనగర్.. రాంచీలు నిలిచాయి. దేశంలోని 31 నగరాల్లో 12చ770 మంది మహిళలపై సర్వే చేసి రిపోర్టును సిద్ధం చేశారు.
జాతీయస్థాయిలో మహిళల భద్రత స్కోర్ ను 65 శాతంగా పేర్కొన్నారు. దీనికి ఎగువున ఉన్న నగరాల్ని సురక్షితమైనవిగా.. దిగువన ఉన్న నగరాల్ని భద్రత లేనివిగా తేల్చారు. లింగ సమానత్వం.. మెరుగైన పోలీసు శాఖ పని తీరు.. మహిళలకు అనుకూలమైన మౌలిక సదుపాయాల్లో కోహిమా ప్రథమ స్థానంలో నిలిచింది. బలహీనమైన స్పందన.. మౌలిక సదుపాయాలతో పాటు.. స్త్రీ పురుష అంతరాలతో పాట్నా.. జైపూర్ లాంటి నగరాలు చివరి స్థానంలో నిలిచాయి.
మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలోని టాప్ 6లో హైదరాబాద్ మహానగరం లేకపోవటం గమనార్హం. అదే సమయంలో సురక్షితం కాని నగరాల జాబితాలోనూ మహానగరం పేరు లేకపోవటం రిలీఫ్ గా చెప్పాలి. ఈ రిపోర్టులో పేర్కొన్న దాని ప్రకారం వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక్కరు మాత్రమే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఈ కారణంగా అనేక నేరాలు రికార్డుల్లోకి ఎక్కట్లేదని చెప్పారు.
ఈ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలను పేర్కొన్నారు పగటిపూట విద్యా సంస్థల్లో మహిళలు తాము భద్రంగా ఉన్నామన్న భావనను ఎక్కువగా పేర్కొన్నారు. రాత్రి వేళల్లో ప్రజారవాణా సాధనాల్లో ప్రయాణాల సందర్భంగా అత్యధికంగా అభద్రతా భావానికి లోనైన విషయం రిపోర్టు వెల్లడించింది. అంతేకాదు.. మహిళలకు అధికారయంత్రాంగం మీద నమ్మకం తక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించారు. తాము చేసే కంప్లైంట్లపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం ప్రతి నలుగురు మహిళల్లో ఒక్కరికి మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు.
పర్యాటక ప్రాంతాల్లోనూ తమ భద్రతపై మహిళలు కొంత ఆందోళన చెందుతున్న విషయం ఈ రిపోర్టులో పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 40 శాతం మంది తమ భద్రతపై ఆందోళనలో ఉన్నట్లుగా తేలింది. మహిళల క్షేమాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడలేమని.. అది స్త్రీ జీవితంలోని విద్య.. ఆరోగ్యం.. ఉద్యోగ అవకాశాలు.. స్వేచ్ఛ లాంటి ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పాలి. మొత్తంగా ఎన్ఏఆర్ఐ (నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ విమెన్ సేఫ్టీ 2025) రిపోర్టు మహిళల భద్రతపై మరోసారి ఆసక్తికర చర్చను తెర మీదకు తీసుకొచ్చినట్లుగా చెప్పక తప్పదు.