వైసీపీలో అత్యంత కీలక నేతగా ఉంటూ ఆ పార్టీ తరఫున పార్లమెంటరీ లీడర్ గా వ్యవహరించిన వి విజయసాయిరెడ్డి వైసీపీకి తన ఎంపీ సీటుకు రాజకీయాలకు గుడ్ బై కొట్టి అచ్చంగా ఏడు నెలలు పూర్తి అవుతున్నాయి. అయితే ఆయనకు ఢిల్లీలో కేటాయించిన సకల వసతులతో కూడిన ఎంపీ క్వార్టర్స్ ని మాత్రం ఇంకా ఖాళీ చేయలేదని ప్రచారం సాగుతోంది. ఆయన మాజీ ఎంపీ అయినా రాజకీయాలకు దూరంగా ఉన్నా ఢిల్లీలో ఆయన నివాస భవనం లో మాత్రం ఆయనే ఉంటూ వస్తున్నారు. ఇదంతా ఆయన తనకు ఉన్న ఢిల్లీ స్థాయి పలుకుబడికి నిదర్శనం అని చెప్పేవారూ ఉన్నారు
ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి ప్రతీ సోమవారం ఢిల్లీ వెళ్ళి శుక్రవారానికి హైదరాబాద్ చేరుకుంటూంటారని ఆయన మాజీ ఎంపీ అయినా ఇదే ఆయన ప్రొగ్రాం షెడ్యూల్ గా ఉందని కూడా ప్రచారం సాగుతోంది. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అదే సందర్భంలో ఆయన బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారని కూడా ప్రచారం ఉంది. అందువల్లనే ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో కేటాయించిన అధికార నివాస భవనం లో ఇంతకాలం ఉంటూ వచ్చారని చెబుతున్నారు. అయితే ఇపుడు దానిని ఖాళీ చేయాలని కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ తరఫున నోటీసులు ఇచ్చిందని ఢిల్లీ వర్గాలలో ప్రచారం సాగుతోంది.
ఎంపిక అయిన లోక్ సభ రాజ్యసభ సభ్యులకు వారి సీనియారిటీని బట్టి నివాస భవనాలను డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ కేటాయిస్తూ ఉంటుంది. ఇక మాజీ ఎంపీలుగా ఉన్న వారు కానీ లేదా తమ పదవులకు రాజీనామాలు చేసిన వారు కానీ నెల రోజుల వ్యవధిలోగా ప్రభుత్వం తమకు కేటాయించిన భవనాలను ఖాళీ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ నిబంధనలుగా ఉన్నాయి. అలా చూసే బాధ్యత కూడా ఆ శాఖదే. అయితే విజయసాయిరెడ్డి ఏకంగా ఏడు నెలలకు పైగా ఢిల్లీలోని తన భవనంలో కొనసాగుతున్నారు అని చెబుతున్నారు. ఆయన బీజేపీలో చేరాలని ప్రయత్నం చేస్తున్నారు అని కూడా పుకార్లు షికారు చేశాయి. అవి నిజం అయితే ఆయనకు ఇబ్బంది లేకుండా పోయేదని అంటున్నారు. అయితే అలా జరగలేదు, ఈ లోగా డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ నుంచి నోటీసులు వచ్చాయని అంటున్నారు.
సాధారణంగా చాలా మంది తమ అధికార నివాసాలను నిబంధనల కంటే కాస్తా ఆలస్యంగా చేసే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. కొంతమంది తనకు ఉన్న లాబీయింగ్ తో కొనసాగుతూ ఉంటారు. విజయసాయిరెడ్డి విషయం తీసుకుంటే ఆయన ఇన్నాళ్ళు కొనసాగారు అంటే పలుకుబడిని తక్కువగా అంచనా వేయలేమని కేంద్ర పెద్దల సాయంతో మరింతకాలం కొనసాగుతారు అని అంటున్నారు. అయితే బీజేపీ విత్ విజయసాయిరెడ్డి రిలేషన్స్ ప్రభావం కూడా ఈ క్వార్టర్స్ మీద ఉంటుందని అంటున్నారు. ఆయన కనుక ఖాళీ చేస్తే మాత్రం ఆలోచించాల్సిందే అని కూడా అంటున్నారు.