తమిళనాడులో కొత్త పార్టీ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం టీవీకే పేరుతో తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ పెట్టిన పార్టీ ఇపుడు ఆ రాష్ట్రానికి అతి పెద్ద ఆకర్షణ. రాజకీయాలు సినిమాలను కలిపి చూస్తే కల్చర్ ని దశాబ్దాలుగా అలవరచుకున్న తమిళ ప్రజానీకం కొత్తదానికి సైతం పెద్ద పీట వేస్తారు. రెండు ద్రవిడ పార్టీలతోనే రాజకీయ బంతాట సాగుతున్న నేపధ్యంలో మరో బలమైన ప్రాంతీయ పార్టీగా టీవీకే జనం ముందుకు వస్తోంది. అద్భుతమైన జనాభిమానం సొంతం చేసుకున్న విజయ్ తనదైన భావజాలంతో జనాన్ని ఒప్పించి మెప్పించి అధికారం అందుకుంటారని ఆయన అభిమానగణం ఆశ పడుతున్నారు.
ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద స్థాయిలో జిల్లా టూర్లు ఎవరూ చేపట్టి ఉండరు. అందునా సినీ నటులు అయితే చేయలేరు అని చెబుతోంది. ఎపుడో 80 దశకంలో అది సీనియర్ ఎన్టీఆర్ కే దక్కింది. ఆయన ఏకంగా తొమ్మిది నెలల పాటు జనం మధ్యనే ఉన్నారు. చైతన్య రధంలో ఉమ్మడి ఏపీలో ఊరూరా తిరిగారు ఆ తరువాత సినీ నటులు ఒకటి రెండు సభలకే పరిమితం అయిన నేపథ్యం ఉంది. ఎందుకు అంటే విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉందని తాము జనంలోకి వస్తే ఇబ్బంది అని చెబుతూంటారు. కానీ ప్రజాకర్షణలో దక్షిణాదిన అద్భుతం అనిపించుకున్న విజయ్ మాత్రం జనంలోకి వచ్చేస్తున్నారు. ఆయన 38 జిల్లాలను కవర్ చేయాలని డిసైడ్ అయ్యారు..
ఇక ఈ నెల 13 నుంచి విజయ్ జనంలోకి వస్తున్నారు. ఈ 38 జిల్లాలలో భారీ బహిరంగ సభలతో పాటు ప్రజలతో నేరుగా మమేకం కావడం అన్నది యాక్షన్ ప్లాన్ గా ఉంది ఈ మేరకు విజయ్ పార్టీ పెట్టిన తరువాత మొదటి సారి జనంలోకి వస్తున్నారు. ఈ పర్యటన రెండు విడతలుగా డిసెంబర్ 20 వరకూ కొనసాగుతుందని టీవీకే వర్గాలు తెలియచేశాయి. ఇక ఇదే పర్యటనలో ఈ నెల 27 కి చెన్నై చేరుకుంటుంది. అలా మొదటి విడత పర్యటన ముగుస్తుంది. తిరిగి అక్టోబర్ 25న రెండో విడత మొదలవుతుంది. అది తమిళనాడు రాష్ట్ర రాజకీయ రాజధానిగా ఉన్న మధురైలో డిసెంబర్ 30న ముగుస్తుంది అని అంటున్నారు.
ఇక విజయ్ జిల్లాల పర్యటనలకు భద్రతను కల్పించాలని కోరుతూ టీవీకే పార్టీ తమిళనాడు డీజీపీకి మంగళవారం లేఖ రాసింది. ఆ లేఖలో ఈ శనివారం అంటే 13వ తేదీన తిరుచ్చి నుంచి విజయ్ పర్యటన మొదలవుతుందని పేర్కొంది. అందువల్ల బహిరంగ సభలకు తగిన బందోబస్తుతో పాటు ట్రాఫిక్ నియంత్రనకు చర్యలు చేపట్టాలని ఆ విధంగా సహకరించాలని కోరుతూ టీవీకే డీజీపీకి లేఖ రాసింది.
తమిళనాడు రాజకీయాలు చూస్తే కనుక రెండు లబ్ధ ప్రతిష్ట చెందిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అవి ద్రవిడ వాదంతోనే దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. డీఎంకే అన్నా డీఎంకేల మధ్యనే పోటీ ఎపుడూ సాగుతూ వస్తోంది. ఈసారి విజయ్ పార్టీ టీవీకే రంగంలోకి దిగడంతో త్రిముఖ పోరుగా మారనుంది అని అంటున్నారు. అంతే కాదు ఈసారి తమిళ రాజకీయం జనాల తీర్పు ఏ విధంగా మారుతుంది అన్న ఉత్కంఠ కూడా ఉంది. అయిదేళ్ళ పాటు పాలించిన అధికార డీఎంకే పట్ల జనంలో కొంత వ్యతిరేకత ఉంది. అది యాంటీ ఇంకెంబెన్సీగా ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.
అదే సమయంలో రెండు పార్టీల మధ్య నేరుగా పోరు సాగితే ఫలితాలు ఎలా ఉంటాయో కానీ మూడు పార్టీలు రంగంలోకి దిగితే అది ఎవరికి లాభం అన్నది కూడా చర్చగా ఉంది. ఎవరు ఎవరి ఓట్లు చీల్చుకుంటారు అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే రెండు ద్రవిడ పార్టీలకు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బలం బలగం ఉంది. విజయ్ పార్టీ టీవీకే ఇంకా జనంలోనే ఉంది. క్యాడర్ బేస్డ్ గా మారాల్సిన అవసరం ఉంది. అందుకోసేమే ఈ జిల్లాల టూర్లు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.