*వెలిగొండ ఆయకట్టుకు 2026 కల్లా నీరు*
*యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు*
*నిపుణులతో కలసి పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల*
వెలిగొండ ప్రాజెక్టు పనులు వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి ఆయకట్టు రైతాంగానికి పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్ ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో శుక్రవారం ఆయన పరిశీలించారు.
మెంథా తుఫాన్ వర్షాలకు ఫీడర్ కెనాల్ 850 మీటర్ వద్ద, వంద అడుగుల పొడవున 30 అడుగుల లోతులో పడిన గండిని చూశారు.
జంట సొరంగాలలోకి 9 కి.మీ చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
భవిష్యత్తులో కూడా వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని ఫీడర్ కెనాల్ సీసీ వాల్ లైనింగ్ నిర్మాణంలో డిజైన్స్ అప్రూవల్ చేయమని సూచించారు.
ఈ సందర్భంగా వెలిగొండ క్యాంప్ ఆఫీస్ లో ప్రాజెక్ట్ పెండింగ్ పనులపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల కిందట తను భూమి పూజ చేసిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తవ్వకపోవడంపై తీవ్ర ఆవేదన చెందినట్లు రామానాయుడు చెప్పారు.
అందువల్లనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలిగొండ పై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులను పరుగులు తీయిస్తున్నారు అన్నారు. ఈ నేపథ్యంలోనే మేమంతా రేయింబవళ్లు శ్రమించి వెలిగొండ పూర్తికి కంకణం కట్టుకున్నామన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన జగన్, తన అబద్దాల వేదిక సాక్షి మీడియాలో వెలిగొండ పై అవాకులు చవాకులు పేలడం ఆశ్చర్యం గొలుపుతోందన్నారు. ఏడాదిన్నరగా ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయని కు విమర్శలు చేయడం విడ్డూరం కాక మరేమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా, ఫ్లోరైడ్ బాదిత జిల్లా అయిన ప్రకాశం జిల్లా వాసులను మోసం దగా చేశాడు అన్నారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన అతనికి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేయడం పెద్ద విషయం కాకపోవచ్చు అన్నారు.
నిర్వాసితులకు రూ.900 కోట్లకు పైగా పరిహారం అందించాల్సి ఉండగా తన ఐదేళ్ల హయాంలో ఒక్కరూపాయి అందించలేదని దుయ్యబట్టారు .
నాడు 2014-19 లో టిడిపి ప్రభుత్వం లో చంద్రబాబు రూ.1373 కోట్లు నిధులు కేటాయించి రూ.1319 కోట్లు అనగా 96శాతం ఖర్చుచేశారని చెప్పారు.
పూర్తికాకుండానే పూర్తయిపోయింది అని జాతికి అంకితం చేసిన జగన్ జమానా తరువాత కూడా…
టన్నెల్-2లో ఇంకా 4.2 కి.మీ లైనింగ్ పనులు, బెంచింగ్ పనులు చేయడంతో పాటు, టిబిఎం మెషిన్ తొలగించాల్సి ఉందన్నారు..
ఫీడర్ కెనాల్ లైనింగ్ మరియు 3 కి.మీ పొడవున రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల కోసం ఇటీవలే రూ.456 కోట్లు తో టెండర్లు పిలిచామని రామానాయుడు వివరించారు.
ఈనెలలోనే ఫీడర్ కెనాల్ పనులు మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు .
టన్నెల్-2లో టిబిఎం మెషిన్ తొలగించడానికి సాంకేతిక నిపుణుల కమిటీని నియమించా మన్నారు.
సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 2026 కల్లా వెలిగొండ పూర్తి చేసి, ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో రేయింబవళ్లు పని చేస్తున్నామన్నారు.. ఇచ్చిన హామీకి కట్టుబడి ఇటీవలే హంద్రీనీవా కాలువల ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను తరలించి చూపించామన్నారు. అలాగే వెలిగొండకు కూడా 2026 నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి నీరందించటం ఖాయమన్నారు. ఆలోగానే నిర్వాసితుల కాలనీలు పూర్తి చేయటం, పరిహారం పంపిణీ తదితర సమస్యలు పరిష్కరిస్తామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం గత హయాంలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏడు కాలనీల లో నాలుగు కాలనీలు నిర్మించినట్లు చెప్పారు. ఆ పనులు తాలూకు బిల్లులు ప్రభుత్వం వచ్చిన తర్వాతే చెల్లించామన్నారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక బద్ధమైన కృషి జరుగుతుందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. జగన్ హయాంలో చిల్లిగవ్వ కూడా ఇవ్వని కారణంగా వెలిగొండ నిర్వాసితులకు ఇంకా 900 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందన్నారు. 2026 సంవత్సరం చివరికి ప్రాజెక్టు పూర్తి తో పాటు ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని రామానాయుడు చెప్పారు.



















