నేటి అర్ధరాత్రి మూసుకోనున్న శ్రీవారి వైకుంఠ ద్వారం
శ్రీవారి ఆలయంలో గతేడాది డిసెంబరు 30న ప్రారంభమైన పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రి 12 గంటలకు అధికారికంగా ముగియనున్నాయి. వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) నుంచి ప్రారంభమైన ఈ ప్రత్యేక దర్శనాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. తొలి మూడు రోజుల్లో ఈ-డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే), మిగిలిన ఏడు రోజుల్లో నేరుగా వచ్చే సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యం ఇచ్చింది.
అదే సమయంలో పరిమిత సంఖ్యలో శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, వీవీఐపీ బ్రేక్ దర్శనాలు నిర్వహించడంతో పాటు స్థానిక భక్తుల కోసం ఈ-డిప్ ద్వారా రోజుకు సుమారు ఐదు వేల టోకెన్లు జారీ చేసింది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా తితిదే అధికారులు ఆధునిక సాంకేతికతతో కూడిన ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం నుంచి క్యూలైన్ల కదలికలు, భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారు.
క్యూలైన్లలో వేచిచూసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మెడికల్ సదుపాయాలు నిరంతరాయంగా అందించారు. వర్షం, చలి ప్రభావం లేకుండా షెల్టర్లు, దుప్పట్లు, అదనపు లైటింగ్ ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సేవకులు, సిబ్బంది సమన్వయంతో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించారు.
వైకుంఠ ద్వారం(VaikuntaDwara) మూసివేత అనంతరం శ్రీవారి ఆలయంలో సాధారణ దర్శన విధానం పునరుద్ధరించబడుతుందని తితిదే అధికారులు తెలిపారు. భక్తులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా క్రమశిక్షణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Tirumala











