‘ఉప్పు కప్పురంబు’ మూవీ రివ్యూ
నటీనటులు: కీర్తి సురేష్- సుహాస్- బాబు మోహన్- శత్రు- శివన్నారాయణ-శుభలేఖ సుధాకర్-దువ్వాసి మోహన్- విష్ణు ఓయ్-తాళ్ళూరి రామేశ్వరి తదితరులు సంగీతం: స్వీకార్ అగస్థి నేపథ్య సంగీతం: రాజేష్ మురుగేశన్ ఛాయాగ్రహణం: దివాకర్ మణి రచన: వసంత్ మరింగంటి నిర్మాత: రాధిక లావు దర్శకత్వం: అని శశి దక్షిణాదిన తిరుగులేని పాపులారిటీ ఉన్న నటీమణుల్లో కీర్తి సురేష్ ఒకరు. గత కొన్నేళ్లలో తెలుగులో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు సుహాస్. వీళ్లిద్దరి ఆసక్తికర కలయికలో కొత్త దర్శకుడు అని శశి రూపొందించిన చిత్రం.. ఉప్పు కప్పురంబు. అమేజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: 90వ దశకంలో చిట్టి జయపురం అనే ఊరిలో జరిగే కథ ఇది. ఆ ఊరిలో కులాల అంతరాలు లేకుండా.. చనిపోయిన ప్రతి ఒక్కరినీ ఊరికి ఉత్తరాన ఉండే శ్మశానవాటికలో పూడ్చి పెట్టడం.. వారి సమాధి మీద చనిపోయిన కారణాన్ని కూడా పొందుపరచడం ఆనవాయితీ. ఐతే ఆ ఊరి పెద్ద చనిపోయి ఆయన కూతురైన అపర్ణ (కీర్తి సురేష్) ఆయన స్థానంలోకి వచ్చే సమయానికే ఓ సమస్య వచ్చి పడుతుంది. శ్మశానంలో ఇంకో నాలుగు శవాలకు మించి పూడ్చి పెట్టేందుకు స్థలం లేదని తెలుస్తుంది. దీంతో నాలుగు మరణాల తర్వాత ఊరి ఆచారాన్ని కొనసాగించడం ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఊరి పెద్ద స్థానాన్ని తీసుకోవాలని చూస్తున్న భీమయ్య (బాబు మోహన్).. మధుబాబు (శత్రు).. అపర్ణను దించేయడానికి ఈ సమస్యనే పావుగా వాడుకోవాలనుకుంటారు. మరోవైపు శ్మశానానికి కాపరిగా వ్యవహరించే చిన్నా (సుహాస్) మరణానంతరం తనకూ ఆ ఊరిలో ఓ సమాధి ఉండాలన్న తన తల్లి కోరికను ఎలాగైనా తీర్చాలని చూస్తుంటాడు. మరి ఊరికి తలెత్తిన సమస్యను అపర్ణ తీర్చగలిగిందా? ఆమెను దించాలన్న భీమయ్య.. మధుబాబుల లక్ష్యం నెరవేరిందా? చిన్నా తన తల్లి కోరికను నెరవేర్చగలిగాడా? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానాలు తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ: కన్నడలో ‘తిథి’.. తమిళంలో ‘మండేలా’.. తెలుగులో ‘కేరాఫ్ కంచరపాలెం’.. మన చుట్టూ ఉన్న మనుషులు-పరిస్థితులను తెరపై సహజంగా- ఆహ్లాదకరంగా చూపిస్తూ.. వాస్తవికంగా సాగుతూ.. ఇటు వినోదాన్ని అటు భావోద్వేగాలను సమపాళ్లలో పండించి ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలు. వీటి స్ఫూర్తితో ఆయా భాషల్లో మరిన్ని చిత్రాలు తెరకెక్కాయి కానీ.. అన్నీ వాటిలా మ్యాజిక్ చేయలేకపోయాయి. ఈ తరహా కథల్లో వినోదమైనా.. భావోద్వేగాలైనా ఆర్గానిగ్గా అనిపిస్తే. అవి ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. లేదంటే అంతా కృత్రిమమైన వ్యవహారంలా తయారవుతుంది. ‘ఉప్పు కప్పురంబు’ ఈ రెండో కోవకే చెందుతుంది. ఎంచుకున్నది గొప్ప కాన్సెప్టే అయినా.. సందేశానికి వేసిన వినోదపు పూత చాలా అసహజంగా.. అర్థరహితంగా తయారవడంతో ‘ఉప్పు కప్పురంబు’ ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టలేకపోయింది. వినోదం పేరుతో నేలవిడిచి సాము చేయడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష తప్పదు. చివర్లో హృద్యమైన క్లైమాక్సుతో ఎంత మేకప్ చేయాలని చూసినా.. అంతకుముందు జరిగే తంతంతా ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షే పెడుతుంది. ఎంత ఓటీటీ సినిమా అయినా సరే.. ‘ఉప్పు కప్పురంబు’ను చూడ్డానికి చాలా ఓపిక కావాలి.
‘ఉప్పు కప్పురంబు’ కాన్సెప్ట్ ఏమో చాలా సీరియస్. కానీ దాన్ని వినోదాత్మకంగా చెప్పడానికే ప్రయత్నించింది చిత్ర బృందం. ఐతే కామెడీ కోసం ఉద్దేశించిన సన్నివేశాలు ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు తెప్పించకపోగా.. ఏంటీ సోది అని విసుక్కునేలా చేస్తాయి. కీర్తి సురేష్ లాంటి పెర్ఫామర్.. కొన్ని సన్నివేశాల్లో క్లూలెస్ గా పిచ్చి గెంతులు వేయడం చూస్తే ఆమెకు ఏం చెప్పి ఈ పాత్రను ఒప్పించారనే సందేహం కలుగుతుంది. చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా.. దానికి వెయిట్ తీసుకొచ్చే ఆసక్తికర కథనం ఇందులో మిస్ అయింది. అసలు రాణా దగ్గుబాటి వాయిస్ ఓవర్లో చెప్పించిన శ్మశానానికి సంబంధించిన బ్యాక్ స్టోరీనే చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఊరికి సంబంధించిన ఆచారం-ఆనవాయితీ లాంటివి అంటే కొంచెం టిపికల్ గా అనిపించాలి. కానీ ఈ శ్మశానం స్టోరీలో వెరైటీ అంటూ ఏమీ కనిపించదు. శ్మశానంలో స్థలం అయిపోయే పరిస్థితి తలెత్తితే.. కొత్త శవాలను పూడ్చి పెట్టడానికి మార్గం తెలియక దాని కోసం ఊరంతా కొట్టేసుకోవడం.. లీడ్ క్యారెక్టర్ ప్రత్యామ్నాయం కోసం చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఐతే 20 నిమిషాల్లోనే సమస్య ఏంటో తేలిపోయాక.. ఆల్టర్నేట్ కోసం ఈ క్యారెక్టర్ వెతికి వెతికి అలసిపోతుంటే.. కథ ఎటూ ముందుకు కదలక చూసే ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. రిపిటీటివ్ గా అనిపించే సీన్లు విసుగు పుట్టిస్తాయి. ఏదో జరిగిపోతున్నట్లు ప్రతి పాత్రా ఓవరాక్షన్ చేస్తుంటుందే తప్ప.. సన్నివేశాల్లో విషయం ఉండదు. పాత్రలు.. సన్నివేశాల ద్వారా అంతర్లీనంగా ఏదో చెప్పాలన్న తపన అక్కడక్కడా కనిపిస్తుంది కానీ.. మరీ నాన్ సీరియస్ గా సాగే సీన్లు ప్రేక్షకుల ఆసక్తిని పూర్తిగా నీరుగార్చేస్తాయి. కామెడీ పండడానికి సరైన సిచువేషన్లు క్రియేట్ చేయకుండా.. డైలాగుల్లో ఎంతో కొంత చమత్కారం లేకుండా.. కేవలం ఆర్టిస్టులు తెగ హడావుడి చేసినంత మాత్రాన ప్రేక్షకులు పగలబడి నవ్వేయరు. ‘ఉప్పు కప్పురంబు’లో కామెడీ పేరుతో ఓ రెండు గంటల పాటు ఇలాంటి హడావుడే కనిపిస్తుంది. మంచి నటిగా పేరున్న కీర్తి సైతం ఇందులో చాలా ఓవరాక్షన్ చేసినట్లు అనిపిస్తుందంటే.. అది రైటింగ్-ఎగ్జిక్యూషన్లో ఉన్న లోపమే. చిన్న పాయింట్ పట్టుకుని విపరీతంగా సాగదీసిన రచయిత-దర్శకుడు.. ఆఖర్లో మాత్రం కొంతమేర ప్రేక్షకుల అటెన్షన్ రాబట్టగలిగారు. ఈ కథతో ఇవ్వాలనుకున్న సందేశాన్ని పతాక సన్నివేశాల్లో బాగానే చెప్పారు. చివరి పావుగంట మాత్రం కొంచెం హృద్యంగా సాగి ఓకే అనిపిస్తుంది. కానీ ఆరంభ సన్నివేశాలతోనే డిస్కనెక్ట్ అయిపోయాక.. చివరిదాకా ఓపిక పట్టడమే కష్టమవుతుంది. సిచువేషనల్ కామెడీకి స్కోప్ ఉన్న కథే అయినా.. వీక్ రైటింగ్ వల్ల కామెడీ సీన్లన్నీ తేలిపోయాయి. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా.. కేవలం కాన్సెప్ట్.. క్లైమాక్స్ కోసం ‘ఉప్పు కప్పురంబు’పై ఓ లుక్కేయొచ్చు. నటీనటులు:
కీర్తి సురేష్ మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టుకుంటే కష్టమే. ఆమె చేయదగ్గ స్థాయి పాత్ర కాదిది. కీర్తి అవసరానికి మించి నటించింది అనిపించే పాత్రల్లో ఇదొకటిగా అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో వచ్చే కొన్ని సీన్లలో మాత్రం కీర్తి తన ప్రత్యేకతను చాటుకుంది. కీర్తి లుక్ ఏమంత ఆకర్షణీయంగా లేదీ చిత్రంలో. సుహాస్ కాటి కాపరి పాత్రలో రాణించాడు. అమాయకత్వం నిండిన ఆ పాత్రకు అతను మంచి ఛాయిస్ అనిపిస్తాడు. ఎమోషనల్ సీన్లలో అతను బాగా చేశాడు. బాబూ మోహన్ చాన్నాళ్ల తర్వాత పూర్తి నిడివి ఉన్న పాత్ర చేశాడు. గ్యాప్ వచ్చినా సరే.. ఇబ్బంది పడకుండా-పెట్టకుండా నటించాడు. శత్రు పాత్ర-నటన చికాకు పెడతాయి. ఇందులో అతణ్ని తప్పుబట్టేదేమీ లేదు. పాత్ర అలా తయారైంది. దర్శకుడు ఏం చెబితే అది చేసినట్లున్నాడు. తాళ్ళూరి రామేశ్వరి నటన కూడా అతిగానే అనిపిస్తుంది. విష్ణు ఓయ్ క్యామియో పెద్దగా వర్కవుట్ కాలేదు. శుభలేఖ సుధాకర్.. దువ్వాసి మోహన్.. వీళ్లంతా మామూలే. సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘ఉప్పు కప్పురంబు’ పర్వాలేదనిపిస్తుంది. స్వీకార్ అగస్థి సోసోగా సాగిపోయాయి. రాజేష్ మురుగేశన్ నేపథ్య సంగీతం బాగుంది. దివాకర్ మణి ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్. ఒక పల్లెటూరి వాతావరణాన్ని.. అక్కడి మనుషులను బాగా చూపించాడు. నిర్మాణ విలువలు ఈ కథకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ‘శుభం’ రైటర్ వసంత్ మరింగంటినే ఈ చిత్రానికీ స్క్రిప్టు సమకూర్చాడు. అతను చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. దాన్ని కథగా విస్తరించడంలో తడబడ్డాడు. స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ సాధారణంగా తయారయ్యాయి. దర్శకుడు అని శశి.. టేకింగ్ లోనూ మ్యాజిక్ చేయలేకపోయాడు. అతను ఎమోషనల్ సీన్లలో ఓకే అనిపించినా.. కామెడీలో మాత్రం నిరాశపరిచాడు.
రేటింగ్- 2.5/5