కేంద్రీయ రైల్వే సమాచార వ్యవస్థ (CRIS) ఏర్పాటై 40 ఏళ్లు కావడంతో ఇండియన్ రైల్వేస్ ‘రైల్‌వన్ యాప్’ పేరిట ఓ యాప్‌ను ప్రారంభించింది.రైల్వేశాఖ దీనిని ‘సూపర్ యాప్’ అని చెబుతోంది.ఈ యాప్‌లో అన్ని రైల్వే సేవలు ఒకేచోట అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.దీనిని ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, ఉదాహరణకు మీరు అన్ రిజర్వుడ్ టికెట్ లేదా ఫ్లాట్‌ఫాం టికెట్ లేదా సీజన్ టికెట్ తీసుకోవాలంటే యూటీఎస్ యాప్ వినియోగించాల్సి ఉంటుంది.రిజర్వుడ్ టికెట్ బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్, ఆహారం ఆర్డర్ చేయడం కోసం ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్.. ఇలా వేర్వేరుగా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.వీటన్నింటినీ ఒకేచోట పొందేలా ఇండియన్ రైల్వేస్ ‘రైల్వేవన్ యాప్’ రూపొందించింది.’రైల్‌వన్ సూపర్ యాప్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లాంచ్ చేశారు’ అని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎక్స్‌లో పేర్కొంది.
భారతీయ రైల్వే శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం..రైల్‌వన్ యాప్‌ను ప్లేస్లోర్, ఐవోఎస్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఆ తర్వాత యూజర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్, యూటీఎస్ అకౌంట్ క్రెడెన్షియల్స్‌తో సులభంగా లాగిన్ అవ్వొచ్చు.ఒకసారి యూజర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాక ఎం-పిన్, బయోమెట్రిక్ లాగిన్స్‌తో వేగంగా యాప్‌ను యాక్సెస్ చేయొచ్చు.గెస్ట్ లాగిన్ ఆప్షన్‌తో కూడా యాప్‌ను ఓపెన్ చేయొచ్చు. అయితే, అవసరమైన వివరాలు పొందుపరచాలి.ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.ప్రయాణికులకు రైల్వే శాఖ అందిస్తున్న అన్ని రకాల సేవలు ఒకేచోట అంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దీనిపై కథనం రాసింది.ఇందులో అన్ రిజర్వుడ్, ఫ్లాట్‌ఫాం టికెట్లు 3% తగ్గింపుతో బుక్ చేసుకోవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయని అందులో ఉంది.
మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేందుకు రిజర్వుడ్ టికెట్ బుకింగ్, తత్కాల్ టికెట్, జనరల్(అన్‌రిజర్వుడ్) టికెట్, సీజన్ టికెట్, ప్లాట్‌ఫాం టికెట్ బుకింగ్ సేవలు ఉన్నాయి.అంతేకాక, రైళ్ల సమాచారం, పీఎన్ఆర్ స్టేటస్, కోచ్ పొజిషన్, రైలును ట్రాక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడంతోపాటు రిఫండ్ కోసం ఫైల్ చేసుకునేందుకు ఫైల్ రిఫండ్ సర్వీస్ అందుబాటులో ఉంచారు.వీటితోపాటు ఫిర్యాదులు, సత్వర సహాయం కోసం రైల్వే మదత్, ట్రావెల్ ఫీడ్‌బ్యాక్ సేవలు కూడా రైల్ వన్ యాప్‌లో ఉన్నాయి.ఆర్-వ్యాలెట్‌లో డబ్బులు యాడ్ చేసుకుని బుకింగ్స్ చేసుకోవచ్చు.
ఇతర సమాచారం కూడా అందుబాటులో ఉంది.ప్రయాణికులు రైల్వే సేవల కోసం బహుళ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకునే అవసరం లేకుండా రైల్‌వన్ యాప్‌తో అన్నీ ఒకేచోట అందిస్తున్నట్లు భారతీయ రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.అందువల్ల ఆయా యాప్స్ మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పనిలేదని తెలిపింది.”రైల్‌వన్ యాప్ తీసుకురావడం వల్ల అన్ని సేవలూ ఒకేచోట ఉన్నాయి. ఇది మన సమయాన్ని ఆదా చేసేదే. ట్రైన్ ట్రాకింగ్ కోసం, ఫుడ్ ఆర్డర్ చేయడం కోసం..ఇలా ఒక్కో సర్వీస్ కోసం ఒక్కో యాప్ లేదంటే థర్డ్ పార్టీ యాప్ వాడాల్సి వచ్చేది. ఇకపై ఆ ప్రయాస తగ్గినట్లే” అని ఉద్యోగరీత్యా తరచూ రైల్లో ప్రయాణించే టెకీ నవీన చెప్పారు.
“అయితే, తత్కాల్ బుకింగ్‌లో తరచూ సమస్యలు ఎదురవుతుంటాయి. తత్కాల్ బుకింగ్ అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. చాలా సందర్భాల్లో టికెట్లు దొరకవు. ప్రత్యామ్నాయంగా బస్సు ప్రయాణాలు చేయాల్సిందే. దీనిపై కూడా ఇండియన్ రైల్వేస్ దృష్టి పెట్టాలి” ఆమె అన్నారు.ఇండియన్ రైల్వేస్ తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ సిస్టమ్‌లో మార్పులు తీసుకొస్తోంది.ఇప్పటికే తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది.జూలై 15 నుంచి మరో మార్పు కూడా రాబోతోంది. అదేంటంటే, తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ బేస్డ్ ఓటీపీ అథెంటికేషన్ తప్పనిసరి. అంటే, టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ బేస్డ్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే తత్కాల్ టికెట్స్ బుక్ అవుతాయి.కౌంటర్ల వద్ద, అథరైజ్డ్ ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేయాలన్నా ఆధార్ బేస్ట్ ఓటీపీ తప్పనిసరి.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకేసారి పెద్దసంఖ్యలో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోకుండా.. బుకింగ్స్ ఓపెన్ అయిన మొదటి 30 నిమిషాల్లోపు ఆథరైజ్డ్ ఏజెంట్స్ టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలులేకుండా రూల్స్ తీసుకొచ్చారు.ఇందులో భాగంగా 2.5 కోట్ల ఐఆర్‌సీటీసీ ఫేక్ అకౌంట్లను డీయాక్టివేట్ చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో పేర్కొంది.రైల్వే టికెట్ల రిజర్వేషన్ల సిస్టమ్‌లోనూ కీలక మార్పులు వచ్చాయి. ఇప్పటి వరకు రిజర్వేషన్ చార్ట్ రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు తయారయ్యేది.
ఇక నుంచి 8 గంటల ముందే చార్ట్ తయారవుతుంది.ఇది ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయం. ప్రయాణ సమయం దగ్గరపడే వరకు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో అని సందేహాలుండేవి.ఇకపై మరింత ముందుగానే సమాచారం తెలుస్తుంది కాబట్టి ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ అవకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు కలగనుంది.