తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఏఐడీఎంకే (AIADMK) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి సంచలన హామీలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేని విధంగా సిటీ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటివరకు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అమల్లో ఉంది. కానీ AIADMK మాత్రం ఈ హామీని మరో మెట్టు ఎక్కిస్తూ, తాము అధికారంలోకి వస్తే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని స్పష్టం చేసింది. ఇది సామాన్య వర్గాలపై, ముఖ్యంగా రోజువారీ కూలీలు, ఉద్యోగులపై భారీ ఆర్థిక భారం తగ్గిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
మేనిఫెస్టోలో మరో కీలక హామీగా ప్రతి మహిళకు నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం అందిస్తామని AIADMK ప్రకటించింది. పెరుగుతున్న ధరలు, కుటుంబ వ్యయాల మధ్య మహిళలకు ఇది పెద్ద ఊరటనిస్తుందని పార్టీ అభిప్రాయం. గృహ నిర్వహణలో మహిళల పాత్రను గౌరవిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం మహిళా ఓటర్లను ఆకర్షించే వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక “అమ్మ టూ వీలర్ స్కీమ్” కింద 5 లక్షల మందికి ద్విచక్ర వాహనంపై రూ.25,000 సబ్సిడీ అందిస్తామని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ పరిధిలో ఉద్యోగాలకు వెళ్లే యువత, మహిళలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పార్టీ పేర్కొంది. స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు రవాణా సమస్య పెద్ద అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో ఈ పథకం కీలకంగా మారనుంది.
గ్రామీణాభివృద్ధిపై కూడా AIADMK ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్న పేదలకు కాంక్రీట్ ఇండ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చింది. కచ్చితమైన గృహ భద్రత కల్పించడం ద్వారా గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పార్టీ అంటోంది.
ఉపాధి హామీ పథకం విషయంలో కూడా పెద్ద నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 100 రోజుల ఉపాధి హామీ పనులను 150 రోజులకు పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొంది. దీనివల్ల గ్రామీణ కార్మికులకు ఎక్కువ పని దొరకడమే కాకుండా, స్థిర ఆదాయం కూడా పెరుగుతుందని AIADMK చెబుతోంది.
మొత్తంగా చూస్తే, ఈ మేనిఫెస్టోలో AIADMK ప్రజల దైనందిన జీవనంపై ప్రత్యక్ష ప్రభావం చూపే హామీలను ప్రకటించింది. ఉచిత బస్సు ప్రయాణం నుంచి నగదు సహాయం, గృహ నిర్మాణం నుంచి ఉపాధి హామీ వరకు అన్ని వర్గాలను టచ్ చేసే విధంగా వ్యూహాత్మకంగా హామీలు ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంచలన హామీలు తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో, ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.






