మతపరమైన అంశాలను టచ్ చేస్తూ ఏదైనా వివాదాస్పద సినిమాని తెరకెక్కిస్తే ఆ తర్వాత ఎదురయ్యే చిక్కుల గురించి తెలిసిందే. ఆ సినిమాకి సెన్సార్ పూర్తవ్వడం నుంచి చాలా విషయాలలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రాజకీయంగాను ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి. సంజయ్ లీలా భన్సాలీ పద్మావత్ సినిమాని తెరకెక్కించినప్పుడు మహ్మద్ ఖిల్జీ పాత్రను ఎక్కువ చేసి చూపిస్తూ, రాజ్ పుత్ రాజును తక్కువ చేస్తున్నాడని సంజయ్ లీలా భన్సాలీపై రాజ్ పుత్ (హిందువులు) లు తిరగబడ్డారు.
ఇప్పుడు తాజ్ మహల్ సీక్రెట్స్ పై సినిమా తీసి చిక్కుల్లో పడ్డాడు పరేష్ రావల్. `ది తాజ్ స్టోరి` పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో అతడు కీలక పాత్రధారి. ఇంతకుముందు పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే వివాదం రాజుకుంది. ఇప్పుడు ప్రముఖ భాజపా నాయకుడు సింగ్ ఈ సినిమా రిలీజ్ ని ఆపాలని, సెన్సార్ సర్టిఫికెట్ ని ఇవ్వకుండా ఆపాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు. `ది తాజ్ స్టోరి` కథాంశం వివాదాస్పదమైనది. హిందువులు ముస్లిముల మధ్య గొడవలకు కారణమవుతుందని సింగ్ వాదిస్తున్నారు. తాను కోర్టులో వేసిన ఓ పిటిషన్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారని సింగ్ చెబుతున్నారు.
ఈ సినిమా కథాంశం ప్రకారం… తాజ్ మహల్ లోపల తాళాలు వేసిన 22 గదులను తెరవాలని రజనీష్ సింగ్ గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసారు. ఆ పిటిషన్ లోని అంశాల ఆధారంగా ది తాజ్ స్టోరి సినిమా తెరకెక్కిందని సింగ్ వాదిస్తున్నారు. తన పిటిషన్ లోని అంశాలను కాపీ కొట్టి సినిమా తీసారనేది ఆయన ఆరోపణ. తన అనుమతి లేకుండా ఇలా కాపీ కొట్టకూడదని వాదిస్తున్నారు. తాజ్ మహల్ లోపల ఉన్న 22 తాళాలు వేసిన గదులను తెరిస్తే.. అక్కడ మొదట దేవాలయం కనిపిస్తుందని అన్నారు. ఈ పురాతన నిర్మాణాన్ని అధ్యయనం చేసి స్పష్టమైన సమాధానం ఇవ్వాలని భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) సభ్యులతో కూడిన కమిటీని కూడా ఆయన అభ్యర్థించారు. అయితే 2022లో ఈ కేసును విచారించిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రస్తుతం కోర్టు చిక్కుల కారణంగా పరేష్ రావల్ ఇబ్బందిలో ఉన్నాడు.
ఈ చిత్రానికి తుషార్ అమ్రిష్ గోయెల్ దర్శకత్వం వహించారు. సురేష్ ఝా నిర్మించారు. ఇందులో పరేష్ రావల్, జాకీర్ హుస్సేన్, అమృత ఖన్విల్కర్, నమిత్ దాస్, స్నేహ వాఘ్ కీలక పాత్రలు పోషించారు.


















