నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
గత పదేళ్లుగా తెలంగాణను పాలించిన కె. చంద్రశేఖర్ రావు మరియు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించారని, పంజాగుట్ట చౌరస్తాలో రూ. 2 వేల కోట్లతో విలాసవంతమైన భవనం కట్టుకున్నారని విమర్శించారు. ఏడాదికి రెండు లక్షల ఇళ్లు నిర్మించి ఉంటే పదేళ్లలో 20 లక్షల ఇళ్లు పేదలకు అందేవని, కానీ పేదల గృహాలపై గత ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదని మండిపడ్డారు.
రైతుల సంక్షేమంపై తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం స్పష్టం చేశారు. గత రెండేళ్ల కాలంలో రైతుల కోసం దాదాపు రూ. 1.10 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, పంటలకు బోనస్ వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అమలవుతున్నాయని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ. 1138 కోట్ల విలువైన చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. మహిళలు స్వయం ఉపాధితో నిలదొక్కుకునేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మంది ఫోన్లు వినేటోడు అసలు మనిషేనా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జడ్జీలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు, సినీ సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. చివరకు భర్త-భార్యలు వ్యక్తిగతంగా మాట్లాడుకున్న మాటలు కూడా విన్నారంటే అది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అన్నం తినేటోడు ఎవడైనా మొగుడు-పెళ్లాం మాటలు వింటాడా అంటూ ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్రంలో కొత్త పాలనకు దిశానిర్దేశం చేస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు.
CMRevanthReddy








