డిజిటల్ ప్రపంచంలో హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. కానీ.. కొన్ని అనూహ్య ఉదంతాలు కొత్త వాదనలకు.. సరికొత్త ఉద్యమాలకు కారణమవుతుంటాయి. తెలంగాణ సమాజంలో మమేకమై.. దశాబ్దాల తరబడి ఉంటున్న మార్వాడీలకు గడిచిన కొద్దిరోజులుగా కొత్త చిక్కు వచ్చి పడింది. తెలంగాణలో మొదలైన మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం అంతకంతకూ ముదురుతోంది. అసలు.. ఈ పరిస్థితికి కారణమేంటి? అన్న అరా తీస్తే.. ఇద్దరి మధ్య వివాదం.. రెండు వర్గాల మధ్య రచ్చగా మారిన విషయం కనిపిస్తుంది.
అసలేం జరిగిందంటే.. జులై 31న సికింద్రాబాద్ లోని పాట్ మార్కెట్ లో టూవీలర్ మీద వెళుతున్న తెలంగాణ వ్యక్తి సాయి రోడ్డుకు అడ్డంగా పెట్టిన వాహనం తీయాలంటూ హారన్ కొట్టాడు. సదరు వాహనం ఎస్ కే జువెలరీకి చెందినది. ఆ షాపు యజమాని అల్లుడు అభిషేక్ సాయితో గొడవ పడటమే కాదు.. అతడిపై దాడికి పాల్పడి గాయపర్చాడు. ఈ వ్యవహారం ఆ తర్వాత పలు మలుపులు తిరిగి.. ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అనే వరకు వచ్చింది. హైదరాబాద్ తో మొదలైన ఈ రచ్చ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ ఇష్యూ అంతకంతకూ ముదురుతోంది. ఉస్మానియా విద్యార్థి జేఏసీ అయితే ఈ రోజు (ఆగస్టు 22) మార్వాడీ గో బ్యాక్ అంటూ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఇదెంత ప్రభావం చూపుతుందన్నది పక్కన పెడితే.. అసలు ఇష్యూ మొదలైన దగ్గర గురువారం ఒక ఆసక్తికర మీడియా సమావేశం జరిగింది. అందులో బాధితుడు సాయితో పాటు మార్వాడీ అసోసియేషన్ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లడారు.
ఈ సందర్భంగా బాధితుడు సాయి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై దాడికి పాల్పడిన సందర్భంలో తనకు అండగా నిలిచినోళ్లలో మార్వాడీలని పేర్కొన్నారు. ఆ రోజు జరిగిన గొడవ ఎస్ కే జ్యుయెలరీతోనే తప్పించి.. మార్వాడీ సమాజ్ తో కాదని స్పష్టం చేశారు. సదరు జ్యుయలరీ యజమాని అల్లుడు అభిషేక్ పై అట్రాసిటీ కేసు వరకు వెళ్లిందని.. గొడవ తర్వాత.. దాని యజమాని.. వారి కుటుంబసభ్యులు వచ్చి తనకు క్షమాపణలు చెప్పారన్నారు. అయితే.. ఈ ఉదంతంపై తాను మార్కెట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశానని.. దానిని వెనక్కి తీసుకోనని స్పష్టం చేస్తున్నాడు సాయి. తనపై దాడికి మార్వాడీలకు సంబంధం లేదన్న విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేశారు. ప్రపంచంలో అవకాశాలు ఉన్న ప్రతి చోటుకు మార్వాడీలే కాదు.. ప్రతి ఒక్కరు వెళుతున్న వేళ.. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేయటంలో అర్థం లేదనే చెప్పాలి. మరి.. రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ ఎక్కడివరకు వెళుతుందో చూడాలి.