తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు రవాణా శాఖ చేపట్టిన నూతన ఎన్ఫోర్స్‌మెంట్ చర్యలు వేగం పుంజుకున్నాయి. ఇతర రాష్ట్రాల నెంబర్లతో ముఖ్యంగా ఏపీ నెంబర్లతో తిరుగుతున్నవారు, అలాగే రోడ్డు నియమాలను ఉల్లంఘించే వాహనదారులంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమల్లోకి రావడంతో తనిఖీలు భారీగా పెరగనున్నాయి.
ప్రమాదాలను తగ్గించడానికి రవాణా శాఖ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. జిల్లా స్థాయిలో 33 ప్రత్యేక ఎన్ఫోర్స్‌మెంట్ బృందాల ఏర్పాటు చేసింది.. రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను నియమించారు. ప్రతి బృందంలో డీటీసీ, ఎంవీఐ, ఏఎంవీఐలతో పాటు అనుభవజ్ఞులైన సిబ్బంది ఉంటారు. నియమాలను ఉల్లంఘించే వాహనాలపై ఇకపై కఠిన చర్యలు తప్పనిసరి కానున్నాయి.
రోడ్డు భద్రతకు అత్యంత ప్రమాదకరమైన ఓవర్‌లోడింగ్ చేస్తున్న వాహనాలను రవాణా శాఖ ప్రధానంగా టార్గెట్ చేసింది. ఈ కఠిన తనిఖీలకు గురయ్యే వాహనాలు.. లారీలు, బస్సులు,మినరల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు,సాండ్, ఫ్లైయాష్, స్టోన్ బండ్లు,బిల్డింగ్ మెటీరియల్ వాహనాలు.. ఫిట్‌నెస్ గడువు ముగిసిన లేదా ఫిట్‌నెస్ లేని వాహనాలు.. అవసరమైతే సీజ్ చేసే వరకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు.
హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ఆర్టీవోలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ ఆర్టీవోలు వారానికి కనీసం రెండు సార్లు అంతర్‌రాష్ట్ర కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఉల్లంఘనలు ఉన్న వాహనాలు రోడ్డుపై కనిపిస్తే నేరుగా సీజ్ చేయబడతాయి. ఫిట్‌నెస్ గడువు ముగిసిన వాహనాలు, అతివేగం, బహుళ ఈ–చలాన్స్ ఉన్న వాహనాలు పట్టుకుంటారు.
ఎన్ఫోర్స్‌మెంట్ బృందాలు ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లు వంటి వాహనాలను కారణం లేకుండా వేధించరాదు అని మంత్రి స్పష్టంగా ఆదేశించారు. అయితే ప్రయాణికుల బస్సుల్లో ఉల్లంఘనలపై మాత్రం కఠిన చర్యలు తప్పవు.. అనధికార మార్పులు లేదా సీట్‌ల మార్పు చేయరాదు. అత్యవసర నిష్క్రమణ మార్గాల్లో అడ్డంకులు సృష్టించవద్దు..
గత వారం జరిగిన చేవెళ్ల రోడ్డు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ చర్యలు మరింత తీవ్రమయ్యాయి. కేవలం వారం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 2,576 వాహనాలపై కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా, 352 ఓవర్‌లోడింగ్ లారీలు, 43 బస్సులపై ప్రత్యేక కేసులు నమోదు చేశారు.
మహిళలకు ఉపాధి పెంచే దిశగా, మహిళా ఆటో అనుమతులు ఇవ్వడంపై రవాణా శాఖ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. రాబోయే రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు., ఇన్నోవేటివ్ అవగాహన కార్యక్రమాలు, ప్రతి జిల్లాలో చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు..అలాగే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.
తెలంగాణ రవాణా శాఖ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, భద్రతను పెంచడం లక్ష్యంగా నియమాలను పటిష్టంగా అమలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల నెంబర్లతో ఇక్కడ తిరుగుతున్న వాహనదారులు, ఓవర్‌లోడింగ్ చేసేవారు, ఫిట్‌నెస్ లేని వాహనాలు నడిపేవారు వెంటనే అప్రమత్తం కావాలి. లేకుంటే భారీ జరిమానాలు, సీజ్ వంటి చర్యలకు గురికాక తప్పదు.


















