తెలిసి తెలియని వయసులో ఆకర్షణలకు లోనుకావటాన్నిఅర్థం చేసుకోవచ్చు. సినిమాలు కావొచ్చు.. అందుబాటులో ఉంటున్న సోషల్ మీడియాలో.. ఇతర మాధ్యమాల పుణ్యమా అని.. పట్టుమని పదేళ్లు దాటిందో లేదో కొందరికి ప్రేమ రోగం పట్టేస్తుంది. వాస్తవాల్ని మరిచి.. ఊహల్లో బతుకుతూ అనాలోచిత నిర్ణయాలతో తల్లిదండ్రులకు వణుకు పుట్టించే పిల్లలు కొందరు ఉంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతంలోనూ ఇలాంటి పరిస్థితే.
బెజవాడలోని క్రిష్ణలంకకు చెందిన బాలుడికి పదమూడేళ్లు. ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బెజవాడకు చెందిన ఆ బాలికకు పద్నాలుగేళ్లు. తొమ్మిదో తరగతి చదువుతోంది. తెలిసి తెలియని వయసులో ఆకర్షణకు లోనయ్యారు. కలిసి బతుకుదామని ఇంటి నుంచి పరారయ్యారు. పోలీసులు బాలుడి వద్దనున్న సెల్ ఫోన్ ద్వారా లొకేషన్ గుర్తించి.. సకాలంలో స్పందించి బెజవాడకు తీసుకొచ్చారు. ఈ ఇద్దరు మైనర్లది క్రిష్ణలంక కావటం గమనార్హం. రెండేళ్లుగా తాము ప్రేమలో ఉంటున్నట్లుగా చెబుతున్న వీరి మాటలకు విస్తుపోయే పరిస్థితి.
బుధవారం (నవంబరు 26) బాలుడి పుట్టినరోజు. దీంతో స్కూల్ కు వెళ్లలేదు. మరోవైపు బాలిక స్కూల్ కు వెళుతున్నట్లుగా చెప్పి బాలుడి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అబ్బాయి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఇద్దరు కలిసి కేక్ కోశారు. ఆ తర్వాత బాలికను ఇంట్లోనే ఉంచిన బాలుడు స్కూల్ కు వెళ్లి తన క్లాస్ మేట్స్ కు చాక్లెట్లు పంచి వచ్చాడు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లిపోయింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్లీ స్కూల్ కు వెళుతున్నట్లుగా చెప్పి బాలుడి ఇంటికి వెళ్లింది.
మరోవైపు బాలుడు తన తండ్రిఫోన్.. ఇంట్లో రూ.10 వేలు క్యాష్ తీసుకొని బాలికతో కలిసి హైదరాబాద్ బస్సు ఎక్కారు. స్కూల్ టైం దాటిన తర్వాత కూడా ఇంటికి రాకపోవటంతో ఇద్దరు తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లారు. వారు అసలు స్కూల్ కే రాలేదని టీచర్లు చెప్పటంతో.. బాలిక తల్లిదండ్రులు ఆమె ఫ్రెండ్స్ ను ఆరా తీసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో క్రిష్ణలంక పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో సీసీ కెమేరాల్ని చెక్ చేయగా.. స్కూల్ యూనిఫాంతో బాలుడితో కలిసి వెళుతున్న ద్రశ్యాలు కనిపించాయి. ఇంతలో బాలుడి తల్లిదండ్రులు సైతం స్టేషన్ కు వచ్చి తమ కొడుకు కనిపించట్లేదని ఫిర్యాదు చేయటంతో.. రంగంలోకి దిగిన పోలీసులు పిల్లలు ఇద్దరు హైదరాబాద్ కు వెళ్లినట్లు గుర్తించారు.
పిల్లాడి దగ్గర ఉన్న ఫోన్ మీద ఫోకస్ చేశారు.సిగ్నల్ లేకపోవటం.. పిల్లలు హైదరాబాద్ కు చేరిన వెంటనే స్నిగల్ లోకి వచ్చి వారున్న లొకేషన్ ను గుర్తించిన పోలీసులు వెంటనే హైదరాబాద్ కు బయలుదేరారు. మరోవైపు హైదరాబాద్ కు చేరుకున్న పిల్లలు ఇద్దరు..రాత్రి పది గంటల వేళలో వనస్థలిపురంలో దిగి.. ఆటో ఎక్కి తుక్కుగూడ వెళ్లారు. తమకు ఇల్లు అద్దెకు కావాలని అక్కడ పరిసర ప్రాంతాల్లో వాకబు చేస్తున్నవైనాన్ని గుర్తించిన ఆటో డ్రైవర్ వారిద్దరిని ఇంటికి తీసుకెళ్లి వారి వివరాలు సేకరించి.. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఇంతలో పోలీసులు అక్కడకు వెళ్లి.. పిల్లలు ఇద్దరిని అదుపులోకి తీసుకొచ్చి విజయవాడకు వచ్చారు. పిల్లలు చేసిన ఈ పనికి వారి తల్లిదండ్రులే కాదు.. పోలీసులు సైతం విస్తుపోయిన పరిస్థితి.













