ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండు రోజుల క్రితం పదిహేనేళ్ళు పూర్తి చేసుకున్నారు. దానికి సరైన గిఫ్ట్ ఏపీకి లభించింది. ప్రత్యేకించి విశాఖ దానిని అందుకుని సగర్వంగా ముందు వరసలో నిలుచుంది. ఉమ్మడి ఏపీలో ఏపీలో హైదరాబాద్ తరువాత ఐటీ ఫీల్డ్ లో విశాఖదే ప్లేస్ అని అంతా అనేవారు, ఇపుడు అదే నిజం అయింది. హైదరాబాద్ పక్కన విశాఖ అని ధీమాగా చెప్పుకునేలా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతోంది. మీకు మైక్రో సాఫ్ట్. మాకు గూగుల్ సెంటర్ ఇది ఇపుడు ఆంధ్రులంతా ఆనందంగా అంటున్న మాట.
చంద్రబాబు వంటి సీఎం ఉండబట్టే తెలుగు రాష్ట్రాలకు ప్రఖ్యాతమైన టెక్ సంస్థలు దక్కాయన్నది ఒక విస్పష్టమైన మాట. బాబు ఒక పనిని చేయాలి అంటే ఎంతో శ్రమిస్తారు. ఎంతో మందిని కలుస్తారు. దానిని అలా ఎక్కడ నుంచి ఎక్కడి దాకా అయినా వేగంగా కదిలేలా తానే అంతా అన్నట్లుగా జోరు చూపిస్తారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఒక పెట్టుబడి రావాలంటే ఖండాంతరాలకు వెళ్ళాల్సి వస్తోంది. ఎన్నో రకాలుగా చెప్పాల్సి వస్తోంది. అయినా కూడా వస్తుందా రాదా అన్నది డౌటే. అలాంటిది విభజన తరువాత ఎంతో ఇబ్బంది పడుతున్న ఏపీ వైపు ప్రపంచం తొంగి చూడాలంటే ఏకంగా భగీరథ ప్రయత్నమే చేయాలి. ఆ విషయంలో చంద్రబాబు నిత్య కృషీవలుడై పరిశ్రమించారు, చివరికి అనుకున్నది సాధించారు. అందుకే ఆయనను ఇపుడు అంతా శభాష్ అని అంటున్నారు.
ఇక ఇపుడు అంతా కృతిమ మేధ మీదనే ప్రపంచం నడుస్తోంది. దాంతో ఏఐ ఆధారిత సమాజాన్ని అంతా చూడబోతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఒకేసారి వేసిన పది అడుగులుగా గూగుల్ డేటా సెంటర్ విశాఖ రాకను అంతా చూస్తున్నారు. ఇది బాబు సాధించిన అద్భుతమైన విజయంగా చెబుతున్నారు. దాంతో తరతరాలకు ఆయన పేరు చరిత్రలో నిలిచేలా ఈ గొప్ప ప్రయత్నం చరిత్ర పుటలలో పదిలంగా ఉంటుందని అంటున్నారు.
సంపదను సృష్టిస్తాను అని బాబు ఎన్నికల ముందు చెప్పారు. ఇపుడు అదే జరుగుతోంది. విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ సంస్థ పెట్టే భారీ పెట్టుబడులతో 2028–2032 మధ్య కాలంలో ఏకంగా ఆంధ్రప్రదేశ్ కి మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ఖజానాకు కూడా ఎంతో బలం చేకూరనుంది. ఏపీ ఆర్ధిక స్థితి గణనీయంగా మెరుగుపడనుంది. ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏకంగా ఏడాదికి దాదాపుగా 10 518 కోట్ల రూపాయల ఆదాయం దండీగా దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే ఏపీ విస్తృతమైన ప్రగతికి ఈ గూగుల్ సెంటర్ బాటలు వేస్తుంది అని భావించాలి.
రానున్న కాలంలో విశాఖ వైపు అంతా చూసే పరిస్థితి ఉంటుంది. దేశమంతా కాదు, ఇతర దేశాల నుంచి ఉపాధికి విశాఖకు వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అదే సమయంలో టూరిజం ద్వారా కూడా ఆదాయం రానున్న రోజులలో పెద్ద ఎత్తున వస్తునని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధికి అవకాశాలు ప్రతీ ఏడాది కనీసంగా రెండు లక్షల దాకా సృష్టించబడతాయుని కూడా అంటున్నారు. మొత్తం మీద ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ రుణాన్ని ఈ విధంగా భారీ ఎత్తున తీర్చుకున్నట్లు అయింది అని అంటున్నారు.