తెలుగుదేశం పార్టీ ఇక ఎప్పటికీ ఓడదు అంతే అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులతో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇక మీదట జరిగే ప్రతీ ఎన్నికలోనూ గెలిచి తీరుతుందని అన్నారు. ఒకటి రెండు సార్లు కాదు అనేక సార్లు టీడీపీ గెలిచేలా చూస్తున్నామని చెప్పారు. ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే ఏపీ అభివృద్ధి సాధిస్తుందని ప్రజలు కూడా ఆ విధంగా సానుకూలంగా స్పందించేలా పార్టీ సమాయత్తం అవుతోందని మరింతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
టీడీపీ అనేక సార్లు గెలవాలీ అంటే దానికి దగ్గర దారి ఏదీ లేదని ప్రజలతో మమేకం కావడమే అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న మంచి గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. సోషల్ మీడియాను ఇంకా బాగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు పజా సమస్యల మీద ప్రభుత్వ కార్యక్రమాల మీద పూర్తి అవగాహన ఉన్నవారినే సోషల్ మీడియా యాక్టివిస్టులుగా పార్టీ తరఫున తీసుకోవాలని బాబు కోరారు.
తెలుగుదేశం పార్టీ నాది అని ప్రతీ ఒక్క కార్యకర్త భావించడమే కాదు ఆ పార్టీని జనంలోకి ఇంకా ఎక్కువగా తీసుకుని వెళ్ళాలని నిరంతరం అహరహం పనిచేయాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వం చేసే ప్రతీ కార్యక్రమం కూడా ప్రజలకు చేరేలా చూడాలని ఆ విషయంలో పార్టీ క్రెడిట్ ని తీసుకోవడానికి క్యాడర్ జనంలో ఉండాలని బాబు దిశా నిర్దేశం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక నెలకు నాలుగు వేల రూపాయలుగా సామాజిక పెన్షన్లను పెంచామని వాటిని పంపిణీ చేసేటపుడు సచివాలయ సిబ్బంది వెంట పార్టీ వారు కూడా ఉండాలని సూచించామని దాని వల్లో పార్టీ ఏమి చేసింది అన్నది జనాలకు తెలుస్తుందని అన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఈసారి అన్నీ చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పిన బాబు పార్టీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు. ఎప్పుడు అధికారంలో ఉంటుంది అన్న ధీమాని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే తాను లండన్ పర్యటన నుంచి వచ్చిన తరువాతనే టీడీపీ జిల్లా అధ్యక్షులను రాష్ట్ర కమిటీలను నియమిస్తామని బాబు చెప్పారు. ఇప్పటికే దీని మీద కసరత్తు చేశామని ఆ జాబితాను తీసుకుని ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని ఆదేశించారు. ఇదిలా ఉంటే కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రికే ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బంది చెప్పారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని చంద్రబాబు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. కనీసంగా కేటాయించిన విషయాల మీద అంత సమయం లేకుండా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని బాబు ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేల జాబితా తయారు చేసి తనకు అందిస్తే టెలికాన్ఫరెన్స్ పెట్టి మరీ అందరితో మాట్లాడుతాను అని ఆయన అన్నారు.


















