దేశంలో ‘గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్’ వైపుగా గుజరాత్‌లోని సూరత్ ముందుకు సాగుతోంది. దేశంలో మొదటిసారిగా సోలార్ బస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసి దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఈ హైటెక్ ఎలక్ట్రిక్ బస్‌స్టేషన్‌లో ఛార్జింగ్, Wi-Fi వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇందులో రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్, సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకు 24 గంటల గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది.
సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.1.60 కోట్ల వ్యయంతో ఆల్తాన్‌లో కొత్తగా నిర్మించిన ‘స్మార్ట్ బస్ స్టేషన్’ సూరత్‌కు సరికొత్త ఆకర్షణగా నిలవనుంది. ఇక్కడ వంద కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటైంది. ఈ ప్రాజెక్ట్‌ను జర్మన్ సంస్థ GIZ సహకారంతో రూపొందించింది.
‘లైట్ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సెల్’ గురించి ప్రకాశ్ భాయ్ పాండ్యా (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) వివరించారు. దేశంలోనే మొదటి సారిగా సూరత్‌లోని ఆల్తాన్‌లో నిర్మించిన సోలార్ ఆధారిత బస్ డిపోలో 100 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్, 224 KWH బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.1.60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించామన్నారు. ఈ బస్ డిపో నుంచి ఏటా సుమారు లక్ష యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దీని వల్ల సుమారు రూ.6.65 లక్షల విలువైన ఎనర్జీ ఆదా అవుతుందన్నారు.
“ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సోలార్ నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సెకండ్ లైఫ్ బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. వీటితో రాత్రిపూట ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జ్ చేయడం వల్ల గ్రిడ్‌పై భారం తగ్గుతుంది. ఫలితంగా పునరుత్పాదక శక్తిని ఎక్కువగా ఉపయోగించవచ్చు. ఈ బస్ స్టాప్ ప్రజా రవాణాను పర్యావరణపరంగా, సాంకేతికంగా అభివృద్ధి పథం వైపు నడిపిస్తుంది. ఇంధన ఆదా, పర్యావరణ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ పైలట్ ప్రాజెక్ట్ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలువనుంది”