సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళితో ఫారెస్ట్ అడ్వెంచర్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కోసం ప్రపంచ దేశాల్లోని దట్టమైన అడవులు, కొండలు గుట్టలు, వాగులు వంకలు దాటుకుని రాజమౌళి బృందం చేస్తున్న సాహసాలు అన్నీ ఇన్నీ కావు. నిర్మాతలు అపరిమిత బడ్జెట్ ని కేటాయించడంతో రాజమౌళి సృజనాత్మకంగా ఎక్కడా తగ్గడం లేదని తెలిసింది. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయి ఆడియెన్ అభిరుచికి తగ్గట్టు భారీ వీఎఫ్ఎక్స్- విజువల్ బ్యూటీతో రక్తి కట్టించబోతున్నారని, దీనికోసం అసాధారణ బడ్జెట్ ని కేటాయించారని కూడా గుసగుస వినిపిస్తోంది.
ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీలో సముద్రంతో పని ఏం ఉంది? అని ప్రశ్నించవద్దు… నదులు సముద్రాలు కూడా దాటుకుని ప్రయాణం సాగించే ప్రపంచ సాహసయాత్రికుడిగాను మహేష్ ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఇలా సముద్రంపై కూడా సాహసానికి సిద్ధమయ్యాడు. బోట్ పై రైడ్ కి వెళ్లాడో లేదో తెలీదు కానీ, అలలు ఎగసిపడే చోట, తీరాన్ని తాకే చోట ఒక బస అయితే అతడి కోసం ఏర్పాటు చేసారు. అక్కడ బులుగు జిలుగు సముద్రపు అలల సౌందర్యాన్ని మరింత చేరువగా చూడాలనే సాహసం చేసాడు మహేష్. అందుకు సంబంధించిన ఒక రేర్ క్లిక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
దీనికి మహేష్ బాబు ఆసక్తికరమైన నోట్ రాసారు. ”అఖండమైన ఆనందం! అద్భుతమైన బసకు జోయాలికి ధన్యవాదాలు..” అని టైడ్ ఈమోజీని షేర్ చేసాడు. సముద్రపు రాకాశి అలలు నిత్యం విరుచుకుపడే చోట బస ఏర్పాటు చేయడం అంటే నిజంగా అది గ్రేట్ కదా! అందుకే మహేష్ ఇంతగా ఎగ్జయిట్ అయిపోతున్నాడు. ఈ చోట అతడు ఎన్ని రోజులు లేదా ఎన్ని గంటలు బస చేసాడు? అనేది అతడు చెప్పలేదు ఇంకా. ఈసారి మహేష్ కోసం ఇంగ్లండ్ సమీప సముద్రంలోని ఎడ్జ్ స్టోన్ లైట్ హౌస్ కి రాజమౌళి తీసుకెళతారేమో చూడాలి. అత్యంత సాహసోపేతంగా ఆలోచించే మానవులు మాత్రమే ఇక్కడికి అడుగుపెట్టగలరు. ఎడ్జ్ స్టోన్ లైట్ హౌస్ ని రాకాశి అలలు నాలుగు సార్లు మింగేస్తే, నాలుగు సార్లు పునర్మించారు. దీనికోసం వందల కోట్లు ఇంగ్లండ్ ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ దెయ్యాలు నివశిస్తాయని కూడా చెబుతారు. అందుకే అక్కడ కొద్దిరోజులు భయానక అనుభవాన్ని మహేష్ ఫేస్ చేయడానికి సిద్ధమా?


















