కొన్ని పాత్రల్లో కొందరినే చూడగలం. ఆ పాత్రలు వాళ్ల కోసమే పుట్టినట్లు ఉంటాయి. మరొకరిని ఊహించుకోలేం. ఆ సినిమాలను వేరే వాళ్లు రీమేక్ చేయాలని చూస్తే ప్రతికూల ఫలితాలు వస్తుంటాయి. తెలుగులో అనుష్క చేసిన అరుంధతి ఆ కోవకు చెందిన సినిమానే. అరుంధతి పాత్రలో అనుష్కను కాకుండా వేరొకరిని చూడలేం అంటే అతిశయోక్తి కాదు. పాత్రకు అవసరమైన విగ్రహం ఉండడమే కాదు.. పెర్ఫామెన్స్‌లోనూ అదరగొట్టేయడంతో అనుష్క కెరీర్లో అదొక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది.
మామూలుగా ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను వేరే భాషలో రీమేక్ చేస్తుంటారు. కానీ ఇప్పటిదాకా ఆ ప్రయత్నం జరగలేదు. కానీ ఇప్పుడు హిందీలో ‘అరుంధతి’ రీమేక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ పాత్రను హిందీలో చేయగల కెపాసిటీ ఎవరికి ఉంది అనే ప్రశ్న తలెత్తడం సహజం. అందుకు సమాధానంగా నిలుస్తున్న పేరు.. శ్రీలీలది కావడం గమనార్హం.
శ్రీలీల ప్రధాన పాత్రలో హిందీలో ‘అరుంధతి’ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ఇందులో టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కూడా భాగస్వామి అవుతున్నారట. తమిళంలో రీమేక్‌లకు పెట్టింది పేరైన మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారట. ఐతే అరుంధతి లాంటి గంభీరమైన పాత్రను చేయగల సామర్థ్యం శ్రీలీలకు ఉందా అన్నది ప్రశ్న. ముందు అలాంటి భారీ విగ్రహం ఆమెకు లేదు. ఇక తన వాయిస్ చాలా పీలగా ఉంటుంది. గంభీరంగా అనిపించదు. డబ్బింగ్ చెప్పించినా అంతగా సెట్ అవుతుందా అన్నది ప్రశ్న.
ఇంతకుముందు అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమాను హిందీలో భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తే అది దారుణంగా దెబ్బ తింది. అరుంధతి లాంటి ఐకానిక్ క్యారెక్టర్లను అందరూ చేయలేరన్నది వాస్తవం. మిస్ ఫిట్ అనిపిస్తే మొత్తంగా సినిమానే తేడా కొట్టొచ్చు. మరి అనుష్కతో పోలిస్తే చాలా డెలికేట్‌గా, చిన్నపిల్లలా అనిపించే శ్రీలీలతో అరుంధతి లాంటి గంభీరమైన పాత్రను చేయించి మెప్పించగలరా అన్నది కాస్త ఆలోచించుకుంటే మంచిది.

















