‘సార్ మేడమ్’ మూవీ రివ్యూ
నటీనటులు: విజయ్ సేతుపతి- నిత్యా మీనన్- ఆర్కే శంకర్-చెంబన్ వినోద్ జోస్- దీపా శంకర్- యోగిబాబు- కాళి వెంకట్-శరవణన్ తదితరులు సంగీతం: సంతోష్ నారాయణన్ ఛాయాగ్రహణం: సుకుమార్ నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్-అర్జున్ త్యాగరాజన్ రచన-దర్శకత్వం: పాండిరాజ్ కథ: ఆకాష్ అలియాస్ ఆకాశం (విజయ్ సేతుపతి) పదో తరగతిలో ఫెయిలవడంతో చదువు మానేసి.. సొంతంగా నాన్ వెజ్ హోటల్ పెట్టి దాన్ని కుటుంబంతో కలిసి విజయవంతంగా నడుపుతుంటాడు. అతను డిగ్రీ చదివిన రాణి (నిత్యా మీనన్)ని పెళ్లి చూపులు చూసేందుకు వెళ్తాడు. అక్కడ ఆకాశం బాగా చదువుకున్నట్లు అబద్ధం చెప్పి రాణి కుటుంబాన్ని పెళ్లికి ఒప్పిస్తుంది ఆకాశం తల్లి. ఐతే రాణికి మాత్రం తన గురించి నిజం చెప్పి ఆమె మనసు గెలుచుకుంటాడు ఆకాశం. ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆకాశం-రాణి.. తర్వాత మాత్రం గొడవ పడతారు. అపార్థాలు పెరిగిపోయి విడాకులు తీసుకునే వరకు వెళ్లిపోతారు. ఇంతకీ వీరి మధ్య గొడవలకు కారణమేంటి.. అవి పరిష్కారం అయి ఇద్దరూ తిరిగి కలిశారా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: పేరుకు తమిళ నటుడే అయినా బహు భాషల్లో మంచి ఆదరణ తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. నిత్య మీనన్ సైతం తన లాగే మంచి పెర్ఫామర్ గా గుర్తింపు సంపాదించింది. కంటెంట్ తో సంబంధం లేకుండా వీరి నటన కోసం థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారు. అలా విడి విడిగా అంత మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు మేటి నటులు కలిసి సినిమా చేస్తే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. అనువాద చిత్రమైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా ‘సార్ మేడమ్’ సినిమాను చూడాలనుకోవడానికి ఇంతకుమించి కారణం అక్కర్లేదు. ఐతే వైవిధ్యమైన పాత్రలు.. నటనకు పెట్టింది పేరైన ఈ ఇద్దరితో తమిళ దర్శకుడు పాండిరాజ్ ఒక సగటు ఫ్యామిలీ డ్రామా తీశాడు ‘సార్ మేడమ్’లో. ఫ్యామిలీ డ్రామాలో అయినా కొత్తగా ఏమైనా చూపించాడా అంటే అదేమీ లేదు. సీరియళ్లలో చూసే భార్యాభర్తల అపార్థాలు.. అత్తా కోడళ్ల గొడవలు.. పంచాయితీల చుట్టూనే మొత్తం సినిమాను లాగించేశాడు. సేతుపతి-నిత్యా మీనన్ ఎప్పట్లాగే తమ పాత్రల్లో ఒదిగిపోయినా.. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్లు వర్కవుట్ అయినా.. తమిళ అతి డామినేట్ చేసేలా సాగే రొటీన్ ఫ్యామిలీ డ్రామా నిరాశకే గురి చేస్తుంది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న జంట మధ్య అపార్థాలు రావడం.. వాళ్లిద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చి మళ్లీ కలవడం.. సింపుల్ గా ‘సార్ మేడమ్’ కథ ఇది. ఇలాంటి కథలు బోలెడన్ని చూశాం. జంట మధ్య విభేదాలను చూపించడానికి రకరకాల మార్గాలున్నాయి. ఐతే దర్శకుడు పాండిరాజ్ మాత్రం ఎక్కువ క్రియేటివిటీ వాడకుండా.. సగటు మధ్య తరగతి ఇళ్ళలో ఏం జరుగుతుందో అది చూపించాలని అనుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంలో ఎక్కువగా భర్త తల్లి.. ఆడబిడ్డ.. భార్య తల్లి లాంటి వాళ్లు కారణమవుతుంటారు. వీరిలో ఒకరితో ఒకరికి పొసగకపోవడం.. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం.. వెనుక ఉండి ఒకరు రెచ్చగొట్టడం.. లాంటి కారణాలు గొడవలకు దారి తీస్తాయి. ప్రతి ఇంట్లో ఉండే ఇలాంటి వ్యవహారాలను సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కానీ.. అది ఒకటో రెండో సీన్ల వరకు అయితే ఓకే. కానీ సినిమా అంతా ఇవే వ్యవహారాలతో నడిపిస్తే? గొడవలు.. అలకలు.. అపార్థాలు.. ఇగోలు.. బుజ్జగింపులు.. పంచాయితీలు.. ఇలా సినిమా మొత్తం వీటి చుట్టూనే తిరిగితే? సేతుపతి-నిత్యా మీనన్ లాంటి జంటను పెట్టుకుని ఇదేం నస అనిపించకుండా ఉంటుందా? ‘సార్ మేడమ్’ సినిమా సరిగ్గా అదే ఫీలింగ్ కలిగిస్తుంది.
సేతుపతి-నిత్యల మధ్య కెమిస్ట్రీ.. వారి మధ్య కొన్ని సరదా సన్నివేశాలు.. అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్లు ‘సార్ మేడమ్’లో కొంత మేర ఎంగేజ్ చేస్తాయి. కానీ వీటి నిడివి తక్కువ. విసుగు తెప్పించే ఫ్యామిలీ డ్రామాతోనే మిగతా సినిమా అంతా నిండిపోయింది. ప్రేక్షకులకు కొంచెం రిలీఫ్ ఇవ్వడానికైనా దర్శకుడు వేరే ఎపిసోడ్లు ఏమైనా పెట్టాల్సింది. కానీ హీరో హీరోయిన్ల మధ్య పరిచయం.. హోటల్లో పరోటాల చుట్టూ తిరిగే కొన్ని సీన్ల వరకు ఆసక్తికరంగా అనిపించే ‘సార్ మేడమ్’ తర్వాత.. సీరియల్ తరహాలో సాగే సిల్లీ గొడవల చుట్టూ తిరుగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. పూర్తిగా తమిళ నేటివిటీతో మరీ లౌడ్ గా సాగే సీన్లు ఒక దశ దాటాక విసుగు పుట్టిస్తాయి. కామెడీ సైతం మరీ లౌడ్ గా ఉండి ఎంజాయ్ చేయలేని విధంగా తయారైంది. సినిమా ముగింపు సన్నివేశాలు ప్రేక్షకుల అంచనాకు తగ్గట్లే ఉంటాయి. అక్కడ కొంచెం ఎమోషన్ వర్కవుట్ అయింది. మొత్తంగా చూస్తే సేతుపతి-నిత్య నటన కోసం.. వాళ్లిద్దరి కెమిస్ట్రీ కోసం ‘సార్ మేడమ్’ చూడాలనుకుంటే ఓకే కానీ.. చాలా రొటీన్ గా సాగే ఈ ఫ్యామిలీ డ్రామా అందరికీ రుచించడం కష్టమే. నటీనటులు: విజయ్ సేతుపతి నటనకు వంక పెట్టడానికి ఏముంటుంది? పాత్ర ఏదైనా సులువుగా ఒదిగిపోయే అతను.. ఆకాశం పాత్రలోనూ అలాగే మెప్పించాడు. ఎక్కడా సేతుపతి కనిపించనివ్వకుండా.. ఆకాశం అనే క్యారెక్టర్ మాత్రమే హైలైట్ అయ్యేలా పెర్ఫామ్ చేశాడు. సినిమాను డ్రైవ్ చేసేది తన పాత్రే. సగటు పల్లెటూరి మధ్య తరగతి వ్యక్తిగా తన ఆహార్యం.. నటన రెండూ బాగున్నాయి. నిత్యా మీనన్ కూడా రాణి పాత్రలో సహజంగా నటించి మెప్పించింది. ఒకప్పటితో పోలిస్తే తన లుక్ కొంచెం ఆడ్ గా అనిపించినా.. ఈ పాత్రకు అయితే సరిపోయింది. పతాక సన్నివేశాల్లో తన నటన బాగుంది. యోగిబాబుకు చాలా స్క్రీన్ టైం ఉన్నా.. కామెడీ పండలేదు. మలయాళ నటుడు చెంబన్ హీరోయిన్ తండ్రి పాత్రలో రాణించాడు. హీరోయిన్ అన్నగా ఆర్కే సురేష్ బాగా చేశాడు. హీరో తల్లి పాత్రలో దీపా శంకర్ చాలా సహజంగా నటించింది. కాళి వెంకట్.. శరవణన్.. మిగతా నటీనటులు ఓకే.
సాంకేతిక వర్గం: సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తన మార్కు పక్కన పెట్టి.. ఈ కథకు తగ్గట్లు పాటలు-నేపథ్య సంగీతం అందించాడు. పాటలు వినసొంపుగా లేవు కానీ.. కథకు తగ్గట్లు సాగాయి. నేపథ్య సంగీతం బాగుంది. సుకుమార్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఒకప్పుడు ‘పసంగ’ సహా వైవిధ్యమైన కథలతో ఆకట్టుకున్న రైటర్ కమ్ డైరెక్టర్ పాండిరాజ్.. ‘సార్ మేడమ్’ కోసం మరీ రొటీన్ కథను ఎంచుకున్నాడు. సేతుపతి-నిత్య లాంటి జంటను పెట్టుకుని అతను ఇలాంటి కథను తీయాలనుకోవడం ఆశ్చర్యం. రచన- దర్శకత్వ పరంగా అంత మెరుపులేమీ కనిపించవు.
రేటింగ్- 2.75/5