ఇస్లామిక్ ఆచారాలు, కఠినమైన షరియత్ చట్టాలకు పేరుగాంచిన సౌదీ అరేబియాలో ఒక విప్లవాత్మక మార్పు చోటుచేసుకోనుంది. గత 73 ఏళ్లుగా మద్య నిషేధం అమలులో ఉన్న ఆ దేశంలో 2026 నాటికి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు, పరిమిత వినియోగానికి అనుమతి లభించనుంది. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశపెట్టిన ‘విజన్ 2030’ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశాన్ని పర్యాటక, ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ నిర్ణయం ఇస్లాంలో ‘హరాం’ (నిషేధితం)గా భావించే మద్యం, సౌదీ ఆధునిక ప్రస్థానంలో భాగమవుతుందా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. సౌదీ మీడియా నివేదికల ప్రకారం.. ఈ మార్పు పూర్తిగా కంట్రోల్డ్ లైసెన్సింగ్ సిస్టమ్ కింద అమలు చేయబడుతుంది.
ఎక్కడెక్కడ మద్యం లభిస్తుంది?
కొత్త నిబంధనల ప్రకారం సౌదీ అరేబియాలో సుమారు 600 చోట్ల మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. వీటిలో ఫైవ్-స్టార్ హోటళ్లు, అధునాతన రిసార్ట్‌లు (High-End Resorts), దౌత్య కార్యాలయాల ప్రాంతాలు (Diplomatic Zones), నియోమ్ (Neom), సిందాళా ద్వీపం (Sindalah Island), రెడ్ సీ ప్రాజెక్ట్ (Red Sea Project) వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాజెక్ట్‌లున్నాయి. ఈ సౌకర్యం కేవలం అంతర్జాతీయ పర్యాటకులకు, ప్రవాసులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్థానిక పౌరులకు, సాధారణ బహిరంగ ప్రదేశాల్లో మద్యం ఇప్పటికీ నిషేధం ఉంది.
ఆల్కహాల్ శాతంపై పరిమితి
కొత్త నియమాల ప్రకారం, బీర్, వైన్ , సైడర్ (cider) వంటి తక్కువ ఆల్కహాల్ శాతం కలిగిన ఉత్పత్తులను మాత్రమే అందించడానికి అనుమతి ఉంటుంది. విస్కీ, వోడ్కా వంటి 20శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలు ఇప్పటికీ నిషేధించబడ్డాయి. మద్యం ఇళ్లలో, మార్కెట్లలో లేదా బహిరంగ ప్రదేశాల్లో అమ్మబడదు. ఎవరూ వ్యక్తిగతంగా మద్యం తయారు చేయడానికి అనుమతి లేదు. మద్యం కేవలం లైసెన్స్ పొందిన ప్రదేశాల్లో, శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా మాత్రమే అందించబడుతుంది.
పెద్ద నిర్ణయం వెనుక కారణాలు
ఈ చర్య సౌదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల కార్యక్రమంలో ఒక భాగం. దీని ప్రధాన ఉద్దేశ్యం చమురుపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యాటకం, ఆతిథ్య సేవలు (hospitality), వినోద రంగాలను ప్రోత్సహించడం. 2030లో జరగనున్న ఎక్స్‌పో (Expo 2030), 2034లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2034) వంటి పెద్ద అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వడానికి సౌదీ అరేబియా సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తమ కఠినమైన నియమాలను కొంత సరళీకరించడం అవసరమని భావిస్తోంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ హోటల్ చెయిన్‌లు తమ కార్యకలాపాల్లో మార్పులకు సిద్ధమవుతున్నాయి.