హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అనే రోజులు పోయాయి. కంటెంట్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో, తమ నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే నటీమణులకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అయితే, పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో, కథను మొత్తం తమ భుజాలపై మోసే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రం మన దగ్గర చాలా అరుదుగా వస్తాయి.
ఈ లోటును తీర్చడానికే అన్నట్లు, ఒక టాలెంటెడ్ బ్యూటీ ఇప్పుడు యాక్షన్ అవతారం ఎత్తింది. ‘విరూపాక్ష’, ‘డెవిల్’ వంటి చిత్రాలతో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సంయుక్త, ఇప్పుడు తన కంఫర్ట్ జోన్‌ను దాటి, ఒక డేరింగ్ స్టెప్ వేసింది. ఆమె నెక్స్ట్ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే ఎవరికైనా గూస్‌బంప్స్ రావడం ఖాయం.
ఆమె నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్‌కు సిద్ధమవుతున్న చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’. దీపావళి కానుకగా మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. చేతిలో గన్, ముఖంపై గాయాలు, ఒంటిపై రక్తపు మరకలతో, చుట్టూ శవాల మధ్య ఎంతో పవర్‌ఫుల్‌గా, ఇంటెన్స్‌గా నిలబడి ఉన్న సంయుక్త లుక్ అదిరిపోయింది. ఆమె కళ్లలో కనిపిస్తున్న కసి, సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది.
ఈ పోస్టర్‌ను దర్శకుడు యోగేష్ KMC చాలా స్టైలిష్‌గా ఫ్రేమ్ చేశారు. వెనుక రైల్వే స్టేషన్ బ్యాక్‌డ్రాప్, వస్తున్న ట్రైన్.. ఇవన్నీ చూస్తుంటే ఒక కొత్త యాక్షన్ స్టార్ ఇండియన్ స్క్రీన్‌పైకి అడుగుపెట్టబోతున్నారనే ఫీలింగ్‌ను కలిగిస్తోంది. ‘ది బ్లాక్ గోల్డ్’ అనే టైటిల్ కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది ఎలాంటి గురించిన కథ, సంయుక్త ఎవరిపై ఈ యుద్ధం చేస్తోంది? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఈ చిత్రాన్ని నిర్మాత రాజేష్ దండ, సింధు మాగంటి భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్లకు తన బీజీఎంతో ప్రాణం పోసే సామ్ సి.ఎస్. ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో పెద్ద ప్లస్ పాయింట్. ఇది ఒక అడ్వెంచరస్, యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా, ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద, ఈ ఫస్ట్ లుక్ అయితే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గ్లామర్ రోల్స్‌తో పాటు, ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలను కూడా చేయగలనని సంయుక్త నిరూపించుకోవడానికి సిద్ధమైంది. మరి ఆమెకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.














