ఏపీలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టింది. పల్లెలు పరవశించి పోయేలా బ్రహ్మాండమైన రోడ్లు తయారు కాబోతున్నాయి రోడ్లకు గుంతలు పడడం, వాహనాలు సరిగ్గా వెళ్ళేందుకు అవకాశాలు లేకపోవడం వంటి వాటి మీద కొంత విమర్శ ఉంది. అయితే విమర్శించే వారికి చెక్ పెట్టేలా సర్వాంగ సుందరంగా గ్రామీణ రోడ్లు తయారు కానున్నాయి. వీటి కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను తాజాగా విడుదల చేసింది.
దేశంలోని వివిధ రాష్ట్రాలలో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టేన్స్ టూ స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కి పేర నిధులను రిలీజ్ చేసింది ఇందులో ఏపీకి ఏకంగా రెండు వేల కోట్లు దక్కాయి. గ్రామీణ ప్రాంత రహదారులను ఈ మొత్తంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునే వీలు కలిగింది. అంతే కాదు సుదీర్ఘ కాలం పాటు చెక్కు చెదరకుండా మంచి నాణ్యతా ప్రమాణాలతో ఈ రోడ్లు నిర్మించుకునేందుకు సరిపడా నిధులు ఇచ్చారు. దాంతో ఇక మీద పల్లె రోడ్లు అంటే సూపర్ అనేలా పరిస్థితి ఉండబోతోంది అన్న మాట.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సాక్సీ నిధులతో ప్రతీ గ్రామంలో మంచి రోడ్లు నిర్మించాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు ఇంజనీరింగ్ అధికారులకు పవన్ దిశా నిర్దేశం చేశారు. ప్రాధాన్యత క్రమంలో వీటిని ఉపయోగించాలని అన్నారు ముందుగా దెబ్బ తిన్న పంచాయతీ రాజ్ రోడ్లను పునర్నిర్మించేందుకు సిద్ధం కావాలని పవన్ కోరారు. అంతే కాదు ఈ రహదారుల నాణ్యతలో రాజీపడేది లేదని కూడా ఆయన స్పష్టం చేయడం విశేషం.
గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్న ప్రత్యేక శ్రద్ధతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఆ క్రమంలో వచ్చిన నిధులను నూరు శాతం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ విషయంలో బాధ్యతను ప్రజా ప్రతినిధులు అధికారులు తీసుకుని రోడ్లు బాగా ఉండేలా చూడాలని అన్నారు. ఇక రోడ్లు వేశామంటే వేశాం అన్నట్లుగా కాకుండా రహదారుల నిర్మాణంలో నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే అని పవన్ అలెర్ట్ చేశారు.
ఇక రోడ్ల నిర్మాణం విషయంలో నాణ్యతను తానే స్వయంగా తనిఖీ చేస్తాను అని పవన్ చెప్పడం విశేషం. అపుడు ప్రమాణాలకు తగిన విధంగా లేకపోతే మాత్రం అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇక రోడ్ల నిర్మాణానికి ముందుకు వచ్చి నిర్మాణం కాంట్రాక్టు పొందినవారికీ ముందుగానే నాణ్యతా ప్రమాణాల గురించి తెలియచేయాలని కూడా పవన్ సూచించారు నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో క్వాలిటీ చెక్ చేయాలని ఆదేశించారు.
మౌలిక సదుపాయాలని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని, వాటికి రహదారులే అత్యంత కీలకమని పవన్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధి విషయాన్ని విస్మరించింది అని పవన్ విమర్శించారు. వివిధ మార్గాలలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధుల వెసులుబాటు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహించింది అని అన్నారు. ఇపుడు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు కో ఆర్డినేషన్ చేసుకుని అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్తున్నాయని పవన్ అన్నారు.
మేము అధికారంలోకి వస్తే మంచి రోడ్లు ఇస్తామని గుంతలు లేని రోడ్లను ఇక చూడరని కూటమి పెద్దలు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇపుడు ఆ హామీని నిలబెట్టుకున్నట్లే అంటున్నారు. ఈ రోడ్లు అద్దంలా మెరిసేలా నేల మీద పాలు పోస్తే ఎత్తుకునేలా అద్భుతంగా రూపొందించేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటోంది. రహదారులు బాగా ఉంటే కనెక్టివిటీ పేరిగి గ్రామీణ ప్రాంతాలు ప్రగతిలో భాగం అవుతాయని అంటున్నారు. మొత్తానికి పల్లెలకు పండుగ వచ్చినట్లే అని అంటున్నారు.


















