రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కి దూరమై నాలుగేళ్లు అవుతుంది. `కొండపొలం` తర్వాత అమ్మడు పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడ అవకాశాలతోనే నటిగా బిజీ అయింది. కానీ సక్సస్ లు మాత్రం చెంత చేరలేదు. అవకాశా లైతే ఓడిసి పట్టుకుంటుంది గానీ? విజయాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. నాలుగేళ్లలో ఎనిమిది ..తొమ్మిది హిందీ సినిమాలు చేసింది. వాటిలో సక్సస్ భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించదు. అయినా అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం లైనప్ లో రెండు..మూడు సినిమాలున్నాయి. వాటిపై ఎలాంటి బజ్ కూడా లేదు.
మరి ఇలాంటి ఫేజ్ లో ఉన్న రకుల్ మళ్లీ టాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టిందా? అంటే అవుననే తెలుస్తోంది. అమ్మడు గత పరిచయస్తులకు మళ్లీ టచ్ లో కి వెళ్తుందిట. పాత మేనేజర్ ని మళ్లీ రంగంలోకి దించి దర్శక, నిర్మాతలకు టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తుందిట. అలాగే రామ్ చరణ్-ఉపాసన దంపతులకు రకుల్ మంచి స్నేహితురాలు అన్న సంగతి తెలిసిందే. అటువైపు నుంచి కూడా అమ్మడు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోందిట. మరి కంబ్యాక్ ఛాన్స్ ఎవరైనా ఇస్తారా? లేదా? అన్నది చూడాలి. వాస్తవానికి రకుల్ టాలీవుడ్ లో అవకాశాలు వస్తోన్న సమయంలోనే వదిలి బాలీవుడ్ కి వెళ్లింది. పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్సులు రాలేదు? అన్న నిరాశ కూడా రకుల్ లో ఉంది.
ఓ సందర్భంలో టాలీవుడ్ పై అసహనాన్ని కూడా వ్యక్తం చేసింది. కొందరికే పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు ఇస్తున్నారని..ఎంతో కాలంగా పరిశ్రమలో తన లాంటి సీనియర్లను పట్టించుకోలేదనే ఆవేదన వ్యక్తం చేసింది. ఆ విమర్శల్ని టాలీవుడ్ సీరియస్ గా తీసుకుంటే మాత్రం కంబ్యాక్ కష్టమే. పూజాహెగ్డే కూడా టాలీవుడ్ అవకాశాల్ని కాదని బాలీవుడ్ కి వెళ్లింది. అటుపై అంతే వేగంగా సౌత్ లో మళ్లీ అవకాశాలు కోసం ప్రయత్నించింది. లక్కీగా కోలీవుడ్ ఆదుకోవడంతో? కంబ్యాక్ అవ్వగలిగింది. కానీ టాలీవుడ్ మాత్రం పూజకు అవకాశాలివ్వడం లేదు.
ప్రయత్నాలు చేస్తున్నా? అవి అక్కడికే పరిమితమవుతున్నాయి తప్ప కన్సిడర్ చేసే పరిస్థితి కనిపించలేదు. మరి పూజాహెగ్డే కంటే రెండు ఆకులు ఎక్కువే విసిరిన రకుల్ కి టాలీవుడ్ అవకాశాలు ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం రకుల్ హిందీలో `దే దే ప్యార్ దే 2` లో నటిస్తోంది. దీంతో పాటు `పతీ పట్నీ ఔర్ హూ డూ` చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో `దే దే ప్యార్ దే 2` వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.












