వైసీపీకి కంచుకోటగా భావించే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలు అయింది. అధికార పార్టీ దౌర్జన్యాలు అని ఎంత చెప్పుకున్నా కనీస ఓటింగ్ కూడా దక్కలేదు. కేవలం 600 చిల్లర ఓట్లతో వైసీపీ భారీ షాక్ ని మూటకట్టుకుంది. దీని వెనక కూటమి అధికారం పోలీసులు మందీ మార్బలం అని ఎంత చెప్పుకున్నా దాని కంటే ఎక్కువగా పులివెందుల జనాలలో అసంతృప్తి అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. పైగా వారికి వైసీపీ నుంచి బాధ్యుడైన నేత తమ బాధలు సాధకాలు చెప్పుకోవడానికి కనిపించడం లేరు అన్న సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు
చిత్రంగా చూస్తే కడప ఎంపీగా మూడు సార్లు గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల మీద అంత పట్టు ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన గెలుపు వెనక జగన్ ఇమేజ్ ఉందని అంటారు. ఒకేసారి పులివెందుల అసెంబ్లీ కడప ఎంపీ ఎన్నికలు జరగడంతో జగన్ ప్రభావంతో పులివెందులలో వైసీపీకి కడప ఎంపీకి కూడా ఓట్లు వస్తున్నాయని అంటారు ఇక జగన్ సీఎం గా ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర స్థాయి బాధ్యతలతో ఉంటారు. దాంతో పులివెందుల బాధ్యతలను తమ్ముడు అవినాష్ రెడ్డి మీద ఉంచారు. అయితే వాటి విషయంలో అవినాష్ రెడ్డి ఎంతవరకూ జనాలకు చేరువగా ఉంటున్నారు అన్నదే ఈ ఓటమి తరువాత చర్చకు వస్తున్న విషయంగా చెబుతున్నారు. ఆయనను మృదు స్వభావిగా మంచివారుగా చెబుతారు. కానీ ఆయన అందుబాటులో ఉండే విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక పులివెందులకే చెందిన సతీష్ రెడ్డి ఇపుడు వైసీపీలో ఉన్నారు. ఆయన ఎన్నికలకు ముందు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన తన రాజకీయ జీవితంలో మూడు సార్లు వైఎస్సార్ మీద రెండు సార్లు జగన్ మీద పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు ఆయన టీడీపీ నుంచే 1989లో పొలిటికల్ ఎంట్రీని ఇచ్చారు. ఇక 2011లో ఆయన ఎమ్మెల్సీగా నెగ్గి కొన్నాళ్ళ పాటు శాసన మండలి ఉపాధ్యక్షునిగా పనిచేశారు. టీడీపీలో బీటెక్ రవి ప్రాభవం పెరగడంతో సతీష్ రెడ్డి 2020లో టీడీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి చివరికి వైసీపీలో చేరారు.
ఇక సతీష్ రెడ్డికి పులివెందుల వైసీపీ బాధ్యతలు అప్పగిస్తే మేలు అన్న చర్చ అయితే వైసీపీలో ఉందని అంటున్నారు ఆయన అక్కడే ఉంటారు. స్థానికంగా జనాలలో మమేకం అవుతారు అని అంటున్నారు. ప్రజలకు కావాల్సింది వారి సమస్యలను విని వారితో పాటే కలసి నడవడం. గతంలో వివేకానందరెడ్డి అదే చేసేవారు. ఆ కనెక్షన్ ఇపుడు తెగిపోయింది. దాంతో సతీష్ రెడ్డికి ఆ బాధ్యతలు ఇస్తే రెండిందాల లాభం అని అంటున్నారు అవినాష్ రెడ్డి మీద వైఎస్ సునీత టార్గెట్ చేశారు. ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిజాలో నిందలో ఏవీ తేలకపోయినా ఆమె చేస్తున్న ఆరోపణలు జనంలో చర్చకు వస్తున్నాయి. దాంతో అంతిమంగా వైసీపీకి కూడా అది ఇబ్బందిగా మారుతోంది అని అంటున్నారు దాంతో సతీష్ రెడ్డిని రంగంలోకి దింపితే సునీత చేసే ఆరోపణలు సైతం వీగిపోతాయని అంటున్నారు మరి తన సొంత ఇలాకలో ఏమి చేయాలో జగన్ కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదని ఆయనే అన్ని లెక్కలు సరిచూసి వైసీపీని మళ్ళీ బలోపేతం చేస్తారు అని పార్టీ వర్గాలు అంటున్నాయి.