రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి సంచలనాలు తెరమీదికి వస్తాయన్నది ఎవరూ చెప్పలేరు. ఎప్పుడూ ఒకే రకమైన రాజకీయాలు కూడా జరిగే అవకాశం ఉండదు. ప్రజల్లోనూ మార్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ అదినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనూ ఇలాంటి మార్పు కనిపిస్తోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు.. బీటెక్ రవి.. పులివెందులలో పాగా వేసేందుకు..పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. పులివెందులపై ప్రత్యేక కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ గెలిచి తీరాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. తరచుగా కడపలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయా లని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు ఇటీవల స్థానిక పదవిని దక్కించుకు న్నారు. బీటెక్ రవి సతీమణి విజయం సాధించారు. ఈ ఊపుతో ఇప్పుడు గ్రామీణ స్థాయిలో బీటెక్ రవి ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
చిత్రం ఏంటంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా1న ఇచ్చే పింఛన్ల కార్యక్రమం పులివెందులలోనే ఫస్ట్ స్టార్ట్ అవుతోందని అంటున్నారు. ఉదయం 6 గంటలకే బీటెక్ రవి ప్రజలను కలుసుకుని పింఛను సొమ్మును స్వయంగా అందిస్తున్నారట. ఇలా.. ప్రజలను కలుసుకునేందుకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే సమయంలో ప్రజాదర్బార్‌లు నిర్వహిస్తున్నారు. వారి సమస్యలను పైస్థాయిలో నివేదించి.. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి సర్కారు విరివిగా నిధులు కూడా ఇస్తుండడం కలిసి వస్తున్న ప్రధాన అంశం. దీంతో బీటెక్ రవి పులివెందులలో దూసుకుపోతున్నారన్న చర్చ తెరమీదికి వస్తోంది. ఇదిలావుంటే.. ఇటీవల జగన్ పులివెందులకు వచ్చినప్పుడు ఈ విషయాన్ని పార్టీ నాయకులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారని తెలిసింది. అయితే.. జగన్ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు. ”చేసుకోనీ అబ్బా.. ఏం జరిగితే అదే జరుగుతుంది.” అని వ్యాఖ్యానించారని పలువురు క్షేత్రస్థాయి నేతలు మీడియా ముందు చెప్పడం విశేషం.

















