సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక్కి నెట్టేస్తున్నారా? అంటే ఔననే సమాధానమే లభిస్తోంది. పీఆర్ఎస్ స్టేట్ ఫైనాన్స్ రిపోర్టు 2025-26 పరిశీలిస్తే కూటమి, వైసీపీ ప్రభుత్వాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం కంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు ఆ నివేదిక బయటపెట్టింది. దీంతో సంక్షేమ పథకాల పంపిణీ అంటే జగన్ మాత్రమే అని ఇన్నాళ్లు చెప్పుకున్న వైసీపీ.. ఇకపై వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
పీఆర్ఎస్ స్టేట్ ఫైనాన్స్ రిపోర్టు ప్రకారం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో మొత్తం 38 శాతాన్ని వెనకబడిన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికే వెచ్చిస్తున్నట్లు స్పష్టమైంది. జగన్ హయాంలో ఈ మొత్తం చాలా తక్కువగా ఉందని ఆ నివేదిక బయటపెట్టింది. 2022-23 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఆయా వర్గాల సంక్షేమం కోసం 19 శాతం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం మాత్రమే వెచ్చించింది. ఇది మొత్తం బడ్జెట్ లో 11 శాతం మాత్రమేనని చెబుతున్నారు. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం 6 నుంచి 8 శాతం అదనంగా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ అంకెలు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రెట్టింపు సంక్షేమం జరిగినట్లేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని వైసీపీ నేతలు తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఏడాది సంక్షేమ పథకాలను ఎగ్గొట్టారని ఆరోపిస్తున్నారు. కానీ, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు ప్రకారం చూస్తే జగన్ ప్రభుత్వంలో కేటాయింపులు కన్నా, చంద్రబాబు సర్కారు చేసిన ఖర్చే ఎక్కువనే విషయం స్పష్టమవుతోంది.
సామాజిక భద్రతా పెన్షన్లను ఏకకాలంలో రూ.వెయ్యి పెంచిన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికీ రూ.4 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఈ విషయంలో దేశంలో అగ్రగామిగా రాష్ట్రం నిలిచింది. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ.15 వేలు చొప్పున పంపిణీ చేశారు. మరోవైపు మత్స్యకార భరోసా, అన్నదాతా సుఖీభవ, ఆటోడ్రైవర్ల సేవలో, స్త్రీశక్తి, దీపం-2 ఇలా ఒక్కో హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చింది. తన ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగు పెట్టిన వెంటనే సంక్షేమ పథకాల జాతరకు తెరతీయడంతో చంద్రబాబు గొప్ప రికార్డు సృష్టించినట్లు ప్రచారం జరుగుతోంది.
తన పాలనలో బటన్లు నొక్కుతూ చాలా కష్టపడుతున్నానని జగన్ చెప్పేవారు. ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకే జమ చేసినట్లు వైసీపీ ప్రచారం చేసింది. అయితే చంద్రబాబు పాలనలో ఈ రికార్డులు అన్నీ చెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని తాజా నివేదిక ప్రకారం అంచనా వేస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే వైసీపీ ప్రభుత్వం కన్నా 6 నుంచి 8 శాతం అదనంగా ఖర్చుచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. రానున్న కాలంలో మరింత ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో జగన్ నిర్లక్ష్యం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నట్లు గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా వాడుకోవడం ద్వారా ఈ ఏడాది రూ.7,902 కోట్ల నిధులను ఏపీ రాబట్టుకుంది. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వానికి అదనపు శక్తి కలిగినట్లైందని అంటున్నారు.


















