అమెరికా కోడలు ప్రియాంక చోప్రా ఓ వైపు హాలీవుడ్ లో నటిస్తూనే, మరోవైపు భారతీయ సినిమాల్లో నటించేందుకు ప్లాన్ ని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. హిందీ చిత్రసీమలో తనకు అవకాశాలు రానివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని బహిరంగంగా వెల్లడించిన పీసీ ఆ తర్వాత దక్షిణాదిన అతిపెద్ద పరిశ్రమ టాలీవుడ్ లో పెద్ద అవకాశం దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేష్- దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో ఎస్.ఎస్.ఎం.బి 29లో నటిస్తోంది.
అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు ఇప్పటివరకూ రాజమౌళి బృందం అధికారికంగా ధృవీకరించలేదు. కానీ తాజాగా ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో.. తాను ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలో నటిస్తున్నానని పీసీ అధికారికంగా ధృవీకరించింది. ఇటీవల విడుదలైన ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పుడు చాలా కాలంగా హిందీ చిత్రసీమకు దూరంగా ఉండటం గురించి మాట్లాడింది. ”నేను హిందీ సినిమాలు మిస్ అవుతున్నాను.. ఇండియాను చాలా మిస్ అవుతున్నాను” అని పీసీ వ్యాఖ్యానించింది.
ప్రస్తుతానికి భారతదేశంలో ఓ సినిమాలో నటిస్తున్నాని ప్రియాంక చోప్రా వెల్లడించింది. రాజమౌళి – మహేష్ లతో ఎస్.ఎస్.ఎం.బి 29లో నటిస్తున్నాను.. ఈ సినిమా విడుదల కోసం నిజంగా చాలా ఉత్సాహంగా ఉన్నానని ప్రియాంక చోప్రా వెల్లడించింది. ఇక ఈ సినిమా కథాంశం ప్రకారం.. మెజారిటీ భాగం దట్టమైన అడవుల్లో తెరకెక్కిస్తున్నారు. కెన్యాలోని డీప్ ఫారెస్ట్ లోను ఈ సినిమాని చిత్రీకరించాల్సి ఉందని కూడా తెలుస్తోంది. ఇది యాక్షన్ అడ్వెంచర్ డ్రామా కేటగిరీలో అద్భుతాలు చేస్తుందని నమ్ముతున్నారు. ఈ చిత్రాన్ని అన్ని భారతీయ భాషలు సహా ఆంగ్లంలోను విడుదల చేస్తారని కథనాలొస్తున్నాయి. చిత్రబృందం అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.