దేశంలో ఇప్పటివరకు అనేక పార్టీలు.. కుటుంబాలను చీల్చిన సంఘటనలు ఉన్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడలు మేనకాగాంధీ నుంచి మొదలుకుని.. తాజాగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వరకు.. ఎంతో మంది పార్టీల నుంచి బయటికి రావడం, సస్పెండ్ కావడం జరిగింది. ఇందులో కొందరు కొత్త పార్టీలు పెట్టగా.. మరికొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లి.. సొంత కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటాలు కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఇలా సొంత కుటుంబ సభ్యుల చేతిలో పరాభవానికి గురైంది ఎవరెవరు. వారు పార్టీల నుంచి బయటికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది తలపండిన నేతలు చెప్పేమాట. ఇది అక్షరాలా సత్యం. ఎందుకంటే అప్పటివరకు కలిసి ఉన్నవారు.. ఏదో ఒక కారణం వల్ల విడిపోవడం.. రాజకీయంగా నిత్యం విమర్శించుకునేవారు ఎన్నికల వేళ కలిసి పోటీ చేసిన సంఘటనలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో, రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం. ఇక సొంత పార్టీలో ఉండలేక లేదా పార్టీపై ధిక్కార స్వరాన్ని వినిపించి బహిష్కరణకు గురై.. సొంత కుటుంబ సభ్యుల నుంచే బయటికి పంపించబడిన నేతలు, నాయకురాళ్లు కూడా ఉన్నారు. ఇలా సొంత కుటుంబ సభ్యుల చేతిలో అవమానం, సొంత పార్టీ నుంచి బహిష్కరణ ఎదురైన తర్వాత.. బయటికి వెళ్లి కొత్త పార్టీలను స్థాపించడం లేకపోతే.. తమ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీల్లో చేరడం దేశవ్యాప్తంగా జరుగుతున్న కథలే. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పరిణామాలు జరిగిన పార్టీల సంగతి ఒకసారి చూద్దాం.
కేసీఆర్ కుమార్తెగా, ఉద్యమ నాయకురాలిగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్న కల్వకుంట్ల కవిత.. గత కొన్ని రోజులుగా సొంత పార్టీపై, పార్టీ నేతలపై చేస్తున్న కామెంట్లు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. ఇటీవల ఆమె ప్రవర్తిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు.. పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు.. పార్టీలోని కీలక నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో ఒక పార్టీని స్థాపించారు. ఆ సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట ఆయన సోదరి వైఎస్ షర్మిల ఉన్నారు. అయితే ఆ తర్వాత తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదించి.. వైసీపీ నుంచి బయటికి వచ్చిన వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్టీపీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించారు. 4 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం సృష్టించారు. ఆ తర్వాత వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా వైఎస్ షర్మిల కొనసాగుతున్నారు.
దివంగత నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కూడా కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. పార్టీ గీత దాటారన్న కారణంతో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ మరణం తర్వాత టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాలు.. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సవాల్ చేసిన హరికృష్ణ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించిన హరికృష్ణ సక్సెస్ కాలేకపోయారు. దీంతో చివరికి తన పార్టీని టీడీపీలో హరికృష్ణ విలీనం చేశారు.
దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజీవ్ గాంధీ సతీమణి మేనకాగాంధీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. సంజయ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన మేనకా గాంధీని 1982లో ఇందిరాగాంధీతో విభేదాల కారణంగా బహిష్కరించారు. సంజయ్ గాంధీ వారసురాలిగా రాజకీయాల్లోకి రావాలనుకున్న మేనకా గాంధీ ఆశయాలు.. ఇందిరాగాంధీ ఆలోచనలకు సరిపోలేదు. ఇక అప్పటికే తన పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీని రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దే పనిలో ఇందిరా గాంధీ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే పార్టీలోని తన మద్దతుదారులతో కలిసి 1982లో ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో సంజయ్ విచార్ మంచ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని మేనకా గాంధీ సొంతంగా ఏర్పాటు చేయడం సంచలనం రేపింది. ఇది కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని ప్రోత్సహించే చర్యగా భావించిన ఇందిరా గాంధీ.. మేనకా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం జనతాదళ్ పార్టీలో చేరి.. ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న మేనకాగాంధీ.. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లోనూ కుటుంబ పోరు రచ్చకెక్కింది. రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్.. ఏకంగా పార్టీనే చీల్చారు. 2023 జూలైలో ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే శివసేన- బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి.. ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో షిండే శివసేన-బీజేపీ- అజిత్ పవార్ ఎన్సీపీ కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నాయి.
మహారాష్ట్రలో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ నుంచి ఆయన సోదరుడి కుమారుడు రాజ్ ఠాక్రే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. బాల్ ఠాక్రే తమ్ముడు శ్రీకాంత్ ఠాక్రే కుమారుడైన రాజ్ ఠాక్రే.. మొదట్లో బాల్ ఠాక్రేతో కలిసి మరాఠా గడ్డపై రాజకీయ వ్యవహారాలను చూసుకునేవారు. ఒకానొక సమయంలో బాల్ ఠాక్రే వారసుడు ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే కాకుండా రాజ్ ఠాక్రేనే అనే ప్రచారం జరిగింది. అయితే ఉద్ధవ్ ఠాక్రే ఎంట్రీతో రాజ్ ఠాక్రేకు దారులు మూసుకుపోయాయి. ఈ క్రమంలోనే రాజ్ ఠాక్రే.. పార్టీపైనే అసమ్మతి గళం విప్పడంతో ఆయనను పార్టీ నుంచి బాల్ ఠాక్రే బయటికి పంపించారు. దీంతో ఆ తర్వాత రాజ్ ఠాక్రే.. మహారాష్ట్ర నవనిర్మాణ సేవా సమితి పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపించారు. అయితే ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఒకే వేదికపై కనిపించడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మరో పార్టీ అప్నాదళ్‌లోనూ కుటుంబ పోరు నెలకొంది. అప్నాదళ్ పార్టీ వ్యవస్థాపకులు సోన్ లాల్ పటేల్.. తన కుమార్తె అనుప్రియ పటేల్ పైనే సస్పెన్షన్ వేటు వేశారు. అప్నాదళ్ పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేసినందుకు.. అనుప్రియ పటేల్‌పై చర్యలు చేపట్టినట్లు ఆ పార్టీ తెలిపింది. సొంత పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత అనుప్రియా పటేల్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం అనుప్రియా పటేల్.. కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కగజం (డీఎంకే) పార్టీలోనూ కూడా కుటుంబ పోరు సాగింది. దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుల మధ్య రాజకీయ వారసత్వం విషయంలో వివాదం తలెత్తింది. కరుణానిధి ఉన్న సమయంలోనే ఆయన పెద్ద కుమారుడు ఎంకే అళగిరి పార్టీ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడటంతో డీఎంకే నుంచి బహిష్కరణ వేటు వేశారు. ఆ తర్వాత కరుణానిధి రాజకీయ వారసుడిగా ఎంకే స్టాలిన్ పార్టీని నడిపించి.. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చారు.
ఉత్తర్‌ప్రదేశ్‌ను కొన్నేళ్ల పాటు పరిపాలించిన సమాజ్ వాదీ పార్టీలోనూ కుటుంబ పోరు కొనసాగింది. పార్టీ నిర్ణయాలను ధిక్కరించడంతోపాటు.. వ్యతిరేకంగా వైఖరి అనుసరించడంతో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్.. తన సోదరుడు శివపాల్ యాదవ్‌ను ఎస్పీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్.. సమాజ్‌వాదీ పార్టీని నడిపిస్తున్నారు. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ లోక్‌సభ ఎంపీలుగా ఉన్నారు.
బిహార్‌లోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీలోనూ అధికారం కోసం పార్టీలో పోరు నడిచింది. ఆర్జేడీ పార్టీ నుంచి తన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆ పార్టీ అధినేత, బిహార్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బహిష్కరించారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించడంతో తేజ్ ప్రతాప్ యాదవ్‌పై వేటు వేశారు.