మారిన తెలుగు రాజకీయం పుణ్యమా అని అధికారం చేజారిన తర్వాత కేసులు.. విచారణలు.. అరెస్టులు.. జైలు జీవితం.. లాంటివి ఇటీవల కాలంలో కామన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు బోలెడన్ని కేసులు నమోదైనప్పటిని.. ఆయా నేరాలు చేశారన్న తీర్పులు మాత్రం ఇప్పటివరకు రాలేదు. అయితే.. ఇప్పటికే పలువురు నేతలు జైల్లో ఉంటూ బెయిల్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ధోరణి తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువగా ఉందని చెప్పాలి.
ఏపీలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ముఖ్యల్లో ఒకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ కేసులో అరెస్టు అయిన ఆయన కొద్దికాలంగా జైల్లో ఉంటున్నారు. మిగిలిన నేతలకు చెవిరెడ్డికి ఒక తేడా ఉంది. తనను అరెస్టు చేసినప్పటి నుంచి అటు జైల్లోకానీ.. ఇటు కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కానీ తనపై కేసు నమోదు చేసిన వారిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయటం.. తిట్లు.. శాపనార్థాలు పెట్టటం.. తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకోవటం కనిపిస్తుంది.
ఇప్పటికే కోర్టు ప్రాంగణంలో ఆయన చేసిన హడావుడికి వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయినప్పటికి ఆయన తన తీరును మార్చుకోవట్లేదు. నిబంధనల్ని ఉల్లంఘించేలా పెద్దగా అరుస్తుననారు. తాజాగా మరోసారి అలాంటి సీన్ ను రిపీట్ చేశారు చెవిరెడ్డి. తాజాగా ఏసీబీ కోర్టుకు వచ్చిన అనంతరం.. సిట్ అధికారులపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ‘దేవుడున్నాడని.. ప్రక్రతి గొప్పది.. ఎవర్నీ వదలదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కోర్టులో ఉన్న మీడియా ప్రతినిధుల వైపు చూస్తూ పెద్దగా అరుస్తూ మాట్లాడటం గమనార్హం.
లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదని.. అలాంటిది తనను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించటమే కాదు.. సిట్ అధికారుల్ని బెదిరించేలా వ్యవహరించటం గమనార్హం. తాను ఏ తప్పు చేయకుండానే శిక్షను అనుభవిస్తున్నట్లు చెప్పిన చెవిరెడ్డి.. పోలీసులు ఆయన్ను జీపులోకి ఎక్కిస్తున్న వేళలోనే పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఎవరినో సంతృప్తి పర్చేందుకు సిట్ తనను దెబ్బ తీస్తుందని.. ఆ పాపం వారిని వదలదంటూ మండిపడ్డారు. కేసులు.. అరెస్టులు.. కోర్టులకు కావాల్సింది తిట్లు.. శాపనార్థాలు కాదు. ఆధారాలు.. ఎదుటివారు చేసే ఆరోపణల్లో పస లేదని.. అందులో నిజాలేమీ లేవన్న విషయాన్ని న్యాయస్థానాలకు అర్థమయ్యేలా చేస్తే సరిపోయేదానికి.. ఇలా అరుపులు.. కేకలు.. శాపనార్థాలతో సాధించేదేంటి? అన్న విషయం చెవిరెడ్డికి ఎప్పటికి అర్థమవుతుంది?