కొన్నిసార్లు అంతే. కొన్ని అంశాలు కాకతాళీయంగా జరిగిపోతుంటాయి. 2024 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలోని 175 స్థానాలకు 175 స్థానాలు గెలవటమే టార్గెట్ గా పెట్టుకున్న జగన్ వైనాట్ 175? అంటూ ప్రచారం చేయటం తెలిసిందే. 175 స్థానాల్లో పది శాతమైన 17 స్థానాల్లోనూ గెలవలేక పదకొండు నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచి చతికిలపడటం తెలిసిందే. ఇక్కడే మరో ఆసక్తికర కోణాన్ని విశ్లేషకులు తెర మీదకు తీసుకొచ్చారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో వచ్చిన అసెంబ్లీ సీట్లు 164. దీన్ని 1+6+4=11 అవుతుందన్న సంగతి తెలిసిందే. తాను సాధించిన స్థానాల విడి అంకెల్ని కలిపితే వచ్చే మొత్తానికి సరిపోయే సీట్లను సాధించిన వైనాన్ని చూసినోళ్లంతా జగన్ తరచూ ప్రస్తావించే దేవుడి స్క్రిప్టు మాటను ఆయన రాజకీయ ప్రత్యర్థులు తెర మీదకు తీసుకురావటం షురూ చేశారు.
నిజానికి 2024లో అసెంబ్లీలో ఎన్నికల్లో కేవలం తన బలం 11 స్థానాలకే పరిమితం అవుతుందని జగన్ మాత్రమే కాదు.. ఆయన అంత దారుణ పరాజయాన్నిచవిచూస్తారన్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కానీ..జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఊహించి ఉండరనే చెప్పాలి. అలా పదకొండు అంకెతో జగన్ ప్రయాణం మొదలైంది. ఊహించని దారుణ పరాజయానికి కారణం ఎవరన్న విషయాన్ని పక్కన పెడితే.. జగన్ జీవితంలో 11 అంకె ఈ దారుణ ఓటమితో ఎంట్రీ ఇచ్చింది. రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయాలంటూ జగన్ ప్రభుత్వంలో అమరావతికి చెందిన వారు పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం తెలిసిందే. ఈ ఉద్యమాన్ని వైసీపీ నేతలు ఎంతలా ఎగతాళి చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే.. అమరావతి ఉద్యమానికి సంబంధించిన ఒక ఆసక్తికర అంశాన్ని.. దానికి జగన్ ను వెంటాడుతున్న 11 అంకెతో పోలుస్తూ.. ఆ మధ్యన చంద్రబాబు చేసిన వ్యాఖ్య అందరిని కనెక్టు అయ్యేలా చేసింది. కారణంగా అమరావతి రాజధాని కోసం అక్కడి ప్రజలు 1631 రోజులు ఉద్యమం చేశారన్నారు. 1631 (1+6+3+1=11) సంఖ్యను ఒక్కో అంకెను విడివిడిగా కూడితే కూడా జగన్ ను వెంటాడే 11 అంకె వస్తుంది.
అలా తరచూ ‘‘11’’ వైసీపీ అధినేతను వెంటాడుతోంది. ఓటాన్ బడ్జెట్ తో బండి లాగుతున్న కూటమి సర్కారుపై జగన్ చేసిన విమర్శల నేపథ్యంలో.. గత ఏడాది నవంబరు 11న బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేయటంతో తెర మీదకు మళ్లీ ‘11’ వచ్చింది. కారణం.. క్యాలెండర్ లో నవంబరు 11 నెలలో ఉండటం.. తేదీ సైతం 11 నాడే బడ్జెట్ సమావేశాల కోసం అసెంబ్లీ షురూ కావటంపై అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా లిక్కర్ స్కాంకు సంబంధించిన ఉదంతంలోనూ 11 జగన్ ను వదలకపోవటం విశేషం. హైదరాబాద్ లో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి దొరికిన డబ్బు రూ.11 కోట్లు కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో జగన్ ను నెంబరు 11 అని పిలిస్తే సరిపోతుందంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు విసురుతున్న పంచ్ లు.. ఆ అంకె మీద జగన్ మరింత ఏహ్యభావానికి గురి చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.