ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం జరిగే ఉప రాష్ట్రపతి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారికంగా చెబుతున్నా, సీఎం ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి కీలక రాజకీయ నిర్ణయం దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు పరిశీలకులు అనుమానిస్తున్నారు. అందుకే మంత్రి లోకేశ్ కూడా ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు. ఇద్దరు కీలక నేతలు అధికారిక పర్యటనల నిమిత్తమే ఢిల్లీ వెళ్లినట్లు చెబుతున్నా, ఇద్దరూ ఒకేసారి వెళ్లడం, ముఖ్యమంత్రి కన్నా ముందే లోకేశ్ ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించడం ఉత్కంఠ రేపుతోంది.
ఆదివారం రాత్రి మంత్రి లోకేశ్, సోమవారం రాత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతోంది. సోమవారం ఎన్డీఏ పక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ పక్షాల నేతలను ఆహ్వానించారు. ఇక ఈ రోజు ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసి, సోమవారం ఎన్డీఏ భేటీలో ఆమోదం తీసుకుంటారని అంటున్నారు. మంగళవారం ఎన్డీఏ పక్షాల నేతల సమక్షంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం ఎన్డీఏ నేతల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారని, మంగళవారం జరిగే నామినేషన్ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారని అధికార వర్గాల సమాచారం.
ఇక ఆదివారం రాత్రి ఢిల్లీ వెళుతున్న మంత్రి నారా లోకేశ్ పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని అంటున్నారు. మరోవైపు నిధుల సాధనకే మంత్రి లోకేశ్ ఢిల్లీ వెళుతున్నారని చెబుతున్నా, ఆయన ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఏపీలో ఓ కీలక రాజకీయ నిర్ణయం తీసుకునే విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఢిల్లీ పెద్దలను సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి పరిపాలనకు సంబంధించి సీఎం చంద్రబాబు ఢిల్లీ పెద్దల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా, రాష్ట్రంలో మూడు పార్టీల భాగస్వామ్య కూటమి ప్రభుత్వం నడుపుతున్నందున రాజకీయ నిర్ణయాలను ఢిల్లీ పెద్దలతో చర్చించి తీసుకోవాల్సివస్తుందని అంటున్నారు.
ప్రతిపక్ష వైసీపీని తీవ్రంగా దెబ్బతీయాలనే ప్రయత్నాల్లో ఉన్న ప్రభుత్వం.. వైసీపీని మరింత కుంగదీసే కీలక నిర్ణయం తీసుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా లిక్కర్ స్కాం దర్యాప్తులో సిట్ సాధించిన పురోగతిని కేంద్ర పెద్దలకు వివరించడంతోపాటు అంతిమ లబ్ధిదారు లెక్కలను తేల్చే పనిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫోకస్ చేశారని అంటున్నారు. అంతిమ లబ్దిదారు పాత్రపై కొన్ని కీలక ఆధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ కేసులో అంతిమ లబ్దిదారుపై చర్యలకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసును ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్నందున కేంద్రం కూడా చొరవ తీసుకుని ఈడీ ద్వారా అంతిమ లబ్ధిదారు అరెస్టుకు ప్రయత్నించాలని సీఎం సూచిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి గేమ్ ఓవర్ అని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఈ పర్యటనలో అంతిమ లబ్ధిదారు అయిన బిగ్ బాస్ పై తుది నిర్ణయం తీసుకుంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.