రాజధాని అమరావతి మళ్లీ వార్తలకెక్కింది. అయితే ఈసారి నిర్మాణాల వేగం గురించి కాదు, అంచనాల వ్యయం గురించి. అవును, ప్రభుత్వ ఆఫీసుల నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు వినిపిస్తున్న లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా సచివాలయం, సీఎం ఆఫీస్, కీలక శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి సీఆర్‌డీఏ రెడీ చేసిన టెండర్ల అంచనా వ్యయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.విషయం ఏంటంటే, 2018 నాటి అంచనాలతో పోలిస్తే.. ఇప్పుడు ప్రతిపాదించిన రేట్లు దాదాపు రెట్టింపు అయ్యాయి. అప్పట్లో చదరపు అడుగుకు సుమారు 4,350 రూపాయల లెక్కన మొత్తం ప్రాజెక్టు వ్యయం 2,271 కోట్లుగా ఉంటే.. ఇప్పుడు అదే నిర్మాణానికి చదరపు అడుగుకు ఏకంగా 8,981 రూపాయల చొప్పున మొత్తం ఖర్చు 4,688 కోట్లకు చేరింది. అంటే, కేవలం నాలుగేళ్లలోనే అంచనా వ్యయం 2,417 కోట్లు పెరిగిపోయింది.
నిజానికి, ఈ నాలుగేళ్లలో స్టీలు, సిమెంట్ వంటి కీలక నిర్మాణ సామాగ్రి ధరల్లో భూమి బద్దలయ్యేంత మార్పులేమీ రాలేదు. పైగా, అప్పుడు ప్రతిపాదించిన ‘డయాగ్రిడ్’ టెక్నాలజీనే ఇప్పుడూ వాడుతున్నామని అంటున్నారు. అయినా సరే, చదరపు అడుగుకు ఏకంగా 4,631 రూపాయలు అదనంగా ఎలా పెరిగిందనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇంజినీరింగ్ నిపుణులు సైతం ఈ ‘అంకెల గారడీ’ చూసి నోరెళ్లబెడుతున్నారట.భారీ అంచనాల వెనుక పెద్ద కథే నడుస్తోందని ఇన్సైడ్ టాక్. ఓ కీలక నేత అండదండలతో ముగ్గురు బడా కాంట్రాక్టర్లకు ఈ పనులను ప్యాకేజీల వారీగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైందట. పని మొదలవ్వగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10% ముట్టజెప్పి, ఆ తర్వాత బిల్లుల చెల్లింపుల టైంలో ఈ పెంచిన అంచనాల ద్వారా భారీగా ‘వసూళ్ల’ పర్వానికి స్కెచ్ గీశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది అచ్చం 2015లో తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో జరిగిన తంతునే గుర్తు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
నిన్న మొన్నటి వరకు, కేవలం 450 కోట్లతో రుషికొండపై కట్టిన భవనాలపై ‘వేల కోట్ల దోపిడీ’, ‘ప్రజాధనం దుర్వినియోగం’, ‘రాజమహల్’ అంటూ గొంతు చించుకున్న నేతలే ఇప్పుడు అమరావతి విషయంలో ఇలా వేల కోట్లలో అంచనాలు పెంచేయడం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఆనాడు ఆ ఆరోపణలను నమ్మి ఓట్లేసిన ప్రజలు, అంతకు ముందు ప్రభుత్వం చేసిన పనుల విషయంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చినా, వాళ్లకే పట్టం కట్టారు.దీన్నిబట్టి, ఎవరున్నా ఇంతే ‘ఎవరు తినలేదు గనుక’ అనే ధోరణికి ప్రజలు అలవాటు పడిపోయారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఏది ఏమైనా, అమరావతి నిర్మాణాల అంచనాల వ్యయం ఇలా ఆరంభంలోనే ఆకాశాన్ని తాకుతుంటే.. పూర్తయ్యేసరికి ఇంకెన్ని వేల కోట్లకు పెరుగుతుందోనన్న ఆందోళన మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ప్రజా రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మే 2న ప్రారంభం కానున్నాయి. దశాబ్ద కాలం కిందట 2015 అక్టోబర్‌లో అమరావతికి శంకుస్థాపన చేసిన మోదీ తిరిగి పునఃప్రారంభ పనులు ప్రారంభించనున్నారు. రాజధాని అమరావతిని అభివృద్ధికి చిరునామాగా నిలిపేలా బృహత్ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.ఇప్పటికే 30 వేల కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడుల్ని ఆకర్షించిన నగరం అత్యాధునిక హంగులతో భవిష్యత్తు అవసరాలు తీర్చే ప్రపంచ స్థాయిరాజధానిగా అవతరించనుంది. వెలగపూడి సచివాలయం వెనుక దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో ఇందుకు చేపట్టిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఉన్నతాధికారులు నిరంతం మోదీ పర్యటన ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. డీఆర్డీవో, డీపీఐఐటీ, ఎన్హెచ్ఏఐ, రైల్వేకు సంబంధించి రూ.57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నాగాయలంకలో దాదాపు రూ.1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్‌కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది.
అమరావతి నిర్మాణ ప్రణాళికను పరిశీలిస్తే పర్యావరణం, పౌరజీవనం మధ్య సమతౌల్యం పాటిస్తూ ఈ మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంది. అమరావతిని అత్యంత సౌకర్యవంతమైన నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతూ అత్యున్నత జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వాతావరణంతో అభివృద్ధి చెందే నగరంగా మాస్టర్ ప్లాన్ ఉంది. స్థిరత్వం, రహదారుల అనుసంధానం, జీవన ప్రమాణాలు, నవీకరణ, వారసత్వ పరిరక్షణ, అన్ని వర్గాలు కలిసి ఉండేలా ఈ ప్రణాళికలో పెద్దపీఠ వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం మలిదశ భూ సమీకరణ చేపట్టారు. గ్రీన్, బ్లూ కాన్సెప్ట్‌తో రాజధానిలో 30 శాతం పచ్చదనం, నీటి ప్రవాహానికి ప్రాధాన్యం ఇచ్చారు.
బాహ్య, అంతర్ వలయ రహదారుల్ని 4 జాతీయ రహదారులతో అనుసంధానించేలా గ్రిడ్ రోడ్ విధానం చేపట్టనున్నారు. భూగర్భ కారిడార్ ద్వారానే నీరు, మురుగునీరు, వరద నీరు, శుద్ధి చేసిన నీటి పంపిణీతో పాటు విద్యుత్, ఐసీటీ సరఫరా జరగనుంది. 3300 కిలోమీటర్లకుపైగా సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గ్రీన్ ఫీల్డ్ మోడల్లో నిర్మించనున్నారు. అసెంబ్లీ, సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు, హైకోర్ట్లు ఐకానిక్ భవనాలుగా నిర్మించనున్నారు.
రాజధాని అమరావతి నగరం రూ.30,885.5 కోట్ల పెట్టబడుల్ని ఇప్పటికే ఆకర్షించింది. విద్యారంగంలో బిట్స్ అమరావతి, ఎక్స్ఎల్ఆర్ఐ, విట్, ఏఐఐఎంలు, వైద్య రంగంలో ఈఎస్ఐతో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రులు తమ సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఆతిథ్య రంగంలో హిల్టన్, మారియట్, నోవోటెల్, క్రోన్ ప్లాజాలు హోటళ్లు నిర్మించనుండగా బ్యాంకింగ్ రంగంలో ఆర్బీఐ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, నాబార్డ్‌లు తమ క్యార్యాలయాల ఏర్పాటుకు సముఖత వ్యక్తం చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, విదేష్ భవన్, హడ్కో, హెచ్ పీసీఎల్లు అమరావతిలో ఏర్పాటు కానున్నాయి.
భారతదేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కానుంది. దీనికి ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్ టీ, ఐఐటీ మద్రాస్‌లు తమ సహాయ సహకారాలు అందించనున్నాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుతో పాటు సీఐఐ ఆధ్వర్యంలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కానుంది. వచ్చే 3 ఏళ్లలో ప్రారంభానికి నోచుకునే విధంగా 21వ శతాబ్ధపు భవిష్యత్తు రాజధాని నిర్మాణంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు. జపాన్‌లో అనుసరిస్తున్న మియావాకి విధానం ద్వారా రాజధాని అమరావతిలో వేగంగా పచ్చదనం విస్తరింపచేయవచ్చన్న మోదీ సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఆ దిశగా పచ్చదనం పెంపొందించేందుకు పెద్దపీఠ వేస్తోంది.