భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రుపై ఇప్పటివరకు మరే ప్రధానమంత్రి చేయని ఘాటు విమర్శల్ని హ్యాట్రిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయటం తెలిసిందే. సందర్భానికి అనుగుణంగా చరిత్రలోకి వెళ్లిన సమయంలో.. దేశ తొలి ప్రధాని నెహ్రుపై ప్రధాని మోడీ విరుచుకుపడటం తెలిసిందే. తాజాగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే కూటమి ఎంపిక చేసిన రాధాక్రిష్ణన్ ను పరిచయం చేసే క్రమంలో నెహ్రు చేసిన తప్పుడు నిర్ణయాల్ని ప్రస్తావించారు మోడీ.
తన సొంత ప్రతిష్టను పెంచుకోవటానికి దేశ ప్రయోజనాల విషయంలో ఆయన రాజీ పడిన వైనాన్ని ప్రశ్నించారు మోడీ. పాకిస్థాన్ తో నెహ్రు కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందంతో దేశానికి పూడ్చలేనంత నష్టం జరిగినట్లుగా విమర్శించారు. నెహ్రూ నిర్వాకం వల్ల రెండుసార్లు దేశ విభజన జరిగిందన్న మోడీ.. ‘‘ఒకసారి రాడ్ క్లిఫ్ లైన్ తో భారత్ ను విభజించారు. సింధూ నదిని ముక్కలు చేసి దేశాన్ని మరోసారి విభజన చేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రు దేశానికి చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రైతన్నలకు నష్టం చేకూరేలా నెహ్రు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని మేం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేశాం’’ అని స్పష్టం చేశారు.
దేశ తొలి ప్రధానమంత్రిపై ఈ స్థాయిలో విరుచుకుపడిన ప్రధాని మోడీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సింధూనది జలాలకు సంబంధించిన అంశాన్ని ప్రధాని మోడీ ప్రస్తావిస్తూ.. ‘‘సింధూ నదిలో 80 శాతానికి పైగా నీటిని పాక్ కు అప్పగించారు. మన రైతుల్ని దగా చేశారు. అప్పటి జన్ సంగ్ ఎంపీ వాజ్ పేయి సహా పలువురు పార్లమెంటు సభ్యులు నెహ్రూ నిర్ణయాల్ని తప్పు పట్టారు. నిరసన చేశారు. అప్పట్లో దీనిపై పార్లమెంట్ లో 2 గంటల పాటు చర్చ జరిగింది. కొన్ని బకెట్ల నీళ్లు పోతే ఎందుకింత రాద్ధాంతం అని నెహ్రూ దబాయించారు. లద్ధాఖ్ లో మన భూభాగాన్నిచైనా ఆక్రమించుకుంటే చూసీ చూడనట్లుగా అప్పటి నెహ్రూ ప్రభుత్వం వదిలేసింది. దీనిపై అప్పట్లో ప్రశ్నిస్తే.. అక్కడ గడ్డి పరక కూడా పెరగదంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అయితే.. తాను చేసిన పొరపాటును నెహ్రు కొన్ని రోజులకు ఒప్పుకున్నారు. సింధూ నది జలాల ఒప్పందం కుదుర్చుకొని ఉండే పాక్ తో ఇతర సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నా. నెహ్రూ హయాంలో జరిగిన తప్పుల్ని సరి చేస్తున్నాం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.