ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చర్చ అంతా సిట్ అధికారులు సమర్పించిన 305 పేజీల ప్రాథమిక ఛార్జ్ షీట్ పైనే ఉందని అంటున్నారు. మరోవైపు వైసీపీ కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటంతో వ్యవహారం మరింత ముదిరిందని చెబుతున్నారు.
వైసీపీలో, గత ప్రభుత్వంలో నెంబర్ 2 గా చెప్పే మిథున్ రెడ్డి అరెస్టు అనంతరం “బిగ్ బాస్” అరెస్టుపైనా చర్చలు మొదలైపోయాయి. దీనిపై రాజకీయం హస్తినకు మారే అవకాశం ఉందనే చర్చా మొదలైంది. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డికి ఉన్నంతలో సకల సౌకర్యాలు అందుతున్నాయని, అక్కడ ఆయన పని బాగుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలైంది.
అవును… మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజామండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 1 వరకూ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఈ సమయంలో… 2023లో చంద్రబాబు అరెస్టు అయినప్పుడు మొదట్లో ఆయనకు దక్కిన సౌకర్యాలకంటే ఎక్కువగా మిథున్ రెడ్డికి దక్కాయనే చర్చ వినిపిస్తుంది. ఇందులో భాగంగా… వెస్ట్రన్ కమోడ్ తో కూడిన ప్రత్యేక గది, గదిలో కుర్చీ, ఐరన్ బెడ్ కూడా అందించబడ్డాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో… అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి ఇంటి ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. దాంతోపాటు మల్టీ విటమిన్ మాత్రలు, ఫిష్ ఆయిల్ మాత్రలను అందిస్తున్నారని చెబుతున్నారు.
ఇదే సమయంలో… వాకింగ్ షూస్, అనేక ఇతర ఉత్పత్తులను కూడా అందిస్తున్నారని.. గదిలో వార్తాపత్రికలు, మ్యాగజైన్ లతో పాటు టెలివిజన్ కూడా అందించబడిందనే ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో… కొన్ని తెల్ల కాగితాలు, పెన్నులు మిథున్ రెడ్డి అడిగి తెప్పించుకున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో ఆయనకు ఖైదీ నెంబర్ 4196 కేటాయించారు.
మిథున్ రెడ్డి ఆగస్టు 1వ తేదీ వరకూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సి రావడం.. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ ఇంటి భోజనానికి అనుమతి లభించడంతో.. పెద్దిరెడ్డి ఫ్యామిలీలోని పలువురు కీలక సభ్యులు రాజమండ్రి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. దీనికోసం సెంట్రల్ జైలు సమీపంలో ఓ విల్లాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు! కాగా… చంద్రబాబు అరెస్టు సమయంలో నారా లోకేష్, భువనేశ్వరి రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపంలో తాత్కాలిక బస ఏర్పాటు చేసుకుని.. జైల్లో బాబుకి ఇవ్వాల్సిన ఆహారాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… తాజాగా ఆ పరిస్థితిని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఈ విషయం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.