`పీ-ఫోర్` పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా జోరుగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తద్వారా పేదరికం లేని రాష్ట్రాన్ని సాధించాలనేది ఆయన లక్ష్యం. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో సుమారు 20 లక్షలు మంది పేద కుటుంబాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడంతో పాటు పేదరికం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొని పి4 పథకానికి రూపకల్పన చేశానని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, కార్పొరేట్ దిగ్గజ సంస్థలు వంటి వాటిని ఆయన ఆహ్వానిస్తున్నారు.
రాష్ట్రంలోని పేదలను దత్తత తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తాను కూడా కుప్పం నియోజకవర్గంలో 250 పేదల కుటుంబాలను దత్తత తీసుకుంటానని, వారి అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. ఇక ఇప్పటికే మంత్రులు సంధ్యారాణి, సవిత కూడా పేదల కుటుంబాలను దత్తత తీసుకున్నారు. వారి వారి నియోజకవర్గాల్లో పేదలను పైకి తీసుకొస్తామని ఇటీవల ఇద్దరు మహిళా మంత్రులు ప్రకటించారు. అయితే అసలు పీ-ఫోర్ అంటే ఏంటి? దీంట్లో ఏం చేస్తారు? పేదరికం ఏ విధంగా తగ్గిస్తారు? అనే సందేహాలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పీ-4 అంటే ఏంటి? దీనివల్ల పేదరికం ఏ విధంగా తగ్గుతుంది అనే విషయాలు ఆసక్తిగా మారాయి.. పబ్లిక్ -ప్రైవేట్ -పీపుల్ -పార్ట్నర్షిప్ గా పేర్కొ న్నారు ఈ పి ఫోర్ కార్యక్రమం ద్వారా పేదల కుటుంబాలను సమాజంలో ధనవంతులైన వారు పారిశ్రామి కవేత్తలు అదేవిధంగా కార్పొరేట్ సంస్థల దిగ్గజాలు దత్తత తీసుకోవాలనేది ప్రధాన లక్ష్యం. తద్వారా ఆయా కుటుంబాలలోని పిల్లలను చదివించడంతోపాటు వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఆర్థికంగా ఆయా కుటుంబాలను ప్రోత్సహించాలన్నది లక్ష్యం.
దీనికి గాను ఒక్కొక్క కుటుంబానికి సుమారు 50లక్షల నుంచి 80 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి తగ్గే అవకాశం ఉంది. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చేతి పనులు చేసుకునేవారు, కూలి పనులు చేసుకునే వారు, సంచార జాతులు ఇట్లా 3 రకాలుగా పేదలను వర్గీకరించి వారికి ఏ విధంగా మేలు చేస్తే వారి జీవితాలు మారుతాయి అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. అదే విధంగా లబ్ధిదారులైన పేదల కుటుంబాలను కూడా ఎంపిక చేసింది.